జడ్చర్ల : మహబూబ్నగర్ జిల్లా జడ్చర్ల పత్తి మార్కెట్ యార్డులో ప్రభుత్వం ఏర్పాటుచేసిన ధాన్యం కొనుగోలు కేంద్రంలో ధాన్యం కొనడం లేదంటూ రైతులు జడ్చర్ల కల్వకుర్తి 167 వ జాతీయ రహదారిపై రైతులు ధర్నాకు ( Farmers protest) దిగారు. అకాల వర్షాలతో తడిసిన ధాన్యాన్ని ఆరబెట్టి కొనుగోలు కేంద్రానికి తీసుకురాగా అక్కడి సిబ్బంది కొనుగోలు చేయడం లేదని రైతులు ఆందోళన వ్యక్తం చేశారు.
రోజుల తరబడి కొనుగోలు కేంద్రం వద్దే ఎదురుచూపులు చూస్తుండగా అకాల వర్షంతో ధాన్యం తడిసిపోతుందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం సకాలంలో తమ ధాన్యాన్ని కొనుగోలు చేయాలని మొలకెత్తిన వరి ధాన్యంతో కల్వకుర్తి 167 వ జాతీయ రహదారిపై నిరసన వ్యక్తం చేస్తూ ఆందోళనకు దిగారు. కొనుగోలు చేసిన ధాన్యాన్ని మిల్లర్లు లారీల నుంచి దించడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. గంటకు పైగా రైతులు ఆందోళన నిర్వహించడంతో జాతీయ రహదారిపై కిలోమీటర్ల మేర భారీగా వాహనాలు నిలిచిపోయాయి.