భూత్పూర్ : రైతులు పంట పొలాల్లో రసాయన ఎరువులను (Chemical fertilizers ) తగ్గించాలని వ్యవసాయ శాస్త్రవేత్త భరత్ భూషణ్(Scientist Bharat Bhushan) కోరారు. శుక్రవారం మండలంలోని కరివెన గ్రామంలో నిర్వహించిన రైతుల ముంగిట శాస్త్రవేత్తలు అనే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వ్యవసాయ శాస్త్రవేత్తలు మాట్లాడుతూ పంట పొలాల్లో రైతులు పంటల దిగుబడిని పెంచేందుకు ఇష్టానుసారంగా రసాయన ఎరువులను వాడుతున్నారని అన్నారు.
రసాయన ఎరువుల వాడకం మూలంగా భూసారం తగ్గుతుందని వివరించారు. రైతులు పంట దిగుబడి పైనే దృష్టి పెట్టడం సమంజసం కాదని పేర్కొన్నారు. రైతులు పొలానికి అవసరమైన పోషకాలను, సారాన్ని ఇవ్వడం మర్చిపోతున్నారని తెలిపారు. భూమికి సారం సేంద్రీయ ఎరువుల వాడకం ద్వారా వస్తుందని, గతంలో దీన్ని ఎక్కువగా వాడేవారని తెలిపారు. పంట మార్పిడి విధానం ద్వారా కూడా భూమిలో సారం పెరుగుతుందని తెలిపారు.
ఒకసారి వరి పంట సాగు తర్వాత పప్పు దినుసులు, ఆకుకూరలకు సంబంధించిన పంటను సాగు చేస్తే పొలంలో భూసారం సమృద్ధిగా పెరుగుతుందని తెలిపారు. కార్యక్రమంలో పాలెం వ్యవసాయ పరిశోధన కేంద్రం శాస్త్రవేత్త మాధురి, పరిశోధనా కేంద్రం వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ కళ్యాణి, మండల ఏవో మురళీధర్, ఏఈవో ఆనంద స్వామి, రైతులు తదితరులు పాల్గొన్నారు.