కల్వకుర్తి, ఆగస్టు 17: రుణమాఫీపై కాంగ్రెస్ ప్రభుత్వం ‘మమ’ అనేసింది. ఏదైనా తలపెట్టిన కార్యం పూర్తి చేయలేక వెల్లకిల పడితే.. మమ అని సదరు కార్యాన్ని పూర్తి అయ్యిందనిపిస్తారు. మమ అనే పదం రుణమాఫీ విషయంలో రేవంత్ సర్కార్‌కు అతికినట్లు సరిపోతుంది. అధికారంలోకి వచ్చాక 2023 డిసెంబర్ 9న రూ.2లక్షల వరకు పంట రుణాలు మా ఫీ చేస్తామని ఎన్నికల్లో ఊదరగొట్టిన రేవంత్‌రెడ్డి అధికార పీఠం ఎక్కాడు. ఆ తర్వాత మెల్లగా మాట మారుస్తూ మూడు విడుతల్లో, ఆగస్టు 15లోగా రూ.2లక్షల రుణాలను మాఫీ చేస్తానని కనిపించిన దేవుళ్లపై ఒట్లు వేసి కాలం గడిపాడు. తీరా గడువులు రాగానే రుణమాఫీపై కొర్రీలు వేశాడు. రుణమాఫీ చేస్తున్నామని ప్రకటిస్తూనే కొర్రీలకు శ్రీకారం చుట్టాడు.
దీంతో సగానికిపైగా రైతులకు రుణమాఫీ అందలేదు. ప్రభుత్వం మా త్రం అర్హులందరికీ రుణమాఫీ చేశామని చెప్పుకుంటోంది. సాంకేతిక సమస్యలతో రుణమాఫీ రానివారు తిరిగి దరఖాస్తు చేసుకోవాలని చావు కబురు చల్లగా చెప్పింది. రుణమాఫీ తీరు పై రైతుల్లో తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతున్నది. రేవంత్ ప్రభు త్వం రైతులను దారుణంగా వంచించిందని రైతు సంఘం నా యకులు మండిపడుతున్నారు. కేవలం అధికారంలోకి వచ్చేందుకే రుణమాఫీ హామీతో రైతులను కాంగ్రెస్ పార్టీ దారుణంగా మోసం చేసిందని దుయ్యబడుతున్నారు.
రుణమాఫీ విషయంలో ఆదినుంచి కూడా రేవంత్ సర్కార్ పక్కా ప్రణాళికతోనే ఉన్నది. సభలు, సమావేశాల్లో ముఖ్యమంత్రితోపాటు మంత్రులు, ఎమ్మెల్యేలు రైతులపై ఎనలేని ప్రేమ ఒలకబోస్తూ బ్యాంకుల్లో ఉన్న ప్రతి రైతు పంటరుణాన్ని మాఫీ చేస్తామని ప్రకటనలు చేశారు. రైతుల రుణాలు మాఫీ చేస్తున్నామని జీవో ఇవ్వడంతో క్షీరాభిషేకాలు చేశారు. తీరా రుణాల మాఫీ ప్రకియ ప్రారంభం కావడంతో ప్రభుత్వం అవలంబిస్తు న్న కొర్రీలు ఒక్కొక్కటి వెలుగు చూస్తున్నాయి.
రుణమాఫీకి ప్ర ధానంగా రేషన్‌కార్డును మాత్రమే ప్రామాణికంగా చూశారనేది స్పష్టమైంది. కుటుంబంలో ఒక్కరికి మాత్రమే పంట రుణం ఉంటే వారికి మాత్రమే రుణమాఫీ వర్తించిందన్న విషయం రై తులకు చాలా ఆలస్యంగా అర్థమైంది. రుణమాఫీకి అర్హత ఏమిటంటే రేషన్‌కార్డు. అర్హత ఉన్నా రేషన్‌కార్డు లేకపోవడంతో రు ణమాఫీ రాలేదు. వ్యవసాయాధికారుల వద్దకు వెళితే.. వారి వద్ద ఉన్న యాప్‌లో కుటుంబ సభ్యుల నిర్ధారణ చేయాల్సి ఉం దనే సమాధానం వస్తున్నది.
కల్వకుర్తి పీఏసీసీఎస్‌లో 137 మంది రైతులకు రూ.1.50 లక్షలకుపైగా రుణాలు ఉన్నాయి. వీరందరి పేర్లను రుణమాఫీకి అర్హులని ఉన్నతాధికారులకు జాబితా పంపించారు. రూ.2లక్షల జాబితాలో కేవలం 24 మంది రుణాలు మాఫీ అయ్యా యి. 113 మంది రైతులకు రుణమాఫీ వర్తించలేదు. ఇదేమని అడిగితే ఎవరి వద్ద పూర్తి సమాచారం లేదు. రుణమాఫీ అనేది అర్థంకాని బ్రహ్మ పదార్థమైంది. రేషన్‌కార్డు కలిగిన కుటుంబంలో ఒకే వ్యక్తికి రూ.2 లక్షల రుణం ఉంటే.. అది మాఫీ అయినట్లు తెలుస్తుంది.
అలా కాకుండా రేషన్‌కార్డులో ఉన్న సభ్యులకు భూ ములు ఉండి వారికి రుణాలు రూ.2లక్షలలోగా ఉన్నవారికి రుణమాఫీ కాలేదు. ఇలా రకరకాల కారణాల వల్ల చాలామంది కి లబ్ధి కలగలేదు. కల్వకుర్తి మండ లం వెంకటాపూర్‌లో రూ.2లక్షల రుణమాఫీకి 50 మంది వరకు అ ర్హులుంటే ఒక్కరికీ మాత్రమే వర్తించింది. తాండ్రలో కూడా అదే పరిస్థి తి. స్వయంగా సీఎం రేవంత్ వంగూ ర్ మండలం కొండారెడ్డిపల్లిలో 1,41 3 మంది రైతులు ఉన్నారు. మొదటి, రెండో విడుతలో అంటే రూ.1.50లక్ష ల వరకు కేవలం 205 మందికి మాత్ర మే మాఫీ అయ్యింది. మూడో విడుతలో 15 మందికి వర్తించినట్లు సమాచారం.
అర్హులైన వారికి పూర్తిస్థాయిలో అమలు కాకపోవడంతో కాంగ్రెస్ నాయకులు గప్‌చుప్ అయ్యారు. ఈ విషయంపై మాట్లాడ డానికి మొహం చాటేస్తున్నారు. రుణమాఫీ ఏ మాత్రం సక్కగా ఉన్నా.. ఫొటోలకు పాలు పోసే బ్యాచ్ ఇప్పటికే బయలు దేరేదని రైతు సంఘం నాయకులు చలోక్తులు విసురుతున్నా రు. మరికొందరు మాత్రం రుణమాఫీ విషయం లో ప్రభుత్వ తీరుపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నా రు.
త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలు వస్తున్న క్ర మంలో ఏమని ప్రజల్లోకి వెళ్లాలని ఆందోళన వ్య క్తం చేస్తున్నారు. ప్రతి ఊర్లో సరాసరిన లెక్కిస్తే 40 శాతం రైతులకు మాత్రమే రుణమాఫీ వచ్చిందని వాపోతున్నారు. చివరకు నవ్వినోనిముందే జారి పడ్డట్లు తమ పరిస్థితి తయారైందని ప్రభుత్వ తీరుపై మండిపడుతున్నారు. రుణమాఫీ పూర్తి స్థాయిలో కా వడం లేదని సిద్ధిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు అడిగితే బావిలో దూకి చావమని ముఖ్యమంత్రి అనడంపై కాంగ్రెస్ శ్రేణుల్లో నిరసన వ్యక్తమవుతుంది.
చాలామంది రైతులు రైతుబంధుపై ఆశలు పెట్టుకున్నారు. రైతుబంధు ఇవ్వకుండా ప్రభుత్వం రుణమాఫీ ముందేసుకోవడంతో రుణమాఫీపై ఆశలు పెట్టుకున్నారు. రుణమాఫీ కూడా కాకపోవడంతో దిగాలు పడిపోయారు. పెట్టుబడులకు రైతుబంధు లేదు, రుణమాఫీ అయితే కొత్త రుణాలు తీసుకుందామంటే మాఫీ కాలేదు. ఇప్పుడెలా భగవంతుడా అంటూ బాధపడుతున్నారు. రేవంత్ ప్రభుత్వం తమను నిలువునా మోసం చేసిందని రైతులను ఏడిపించిన ఏ ప్రభుత్వం ముందల పడదని శాపనార్థాలు పెడుతున్నారు.