నాగర్‌కర్నూల్, డిసెంబర్ 2 : రైతులకు ఇచ్చిన మాట ప్రకారం రుణమాఫీ చేసే విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమవడంతో జిల్లా వ్యాప్తంగా గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో నాలుగు విడుతలుగా రూ.2 లక్షలలోపు రుణం తీసుకున్న రైతులకు మాఫీ కాకపోవడంతో ఆందోళన చెందుతున్నారు. ఇంకా వేల సంఖ్యలో రైతులకు రుణమాఫీ పెండింగ్‌లో ఉండడంతో తమకు మాఫీ అవుతుందా? లేదా అనే అయోమయం రైతుల్లో నెలకొన్నది.
అర్హత ఉన్నప్పటికీ ఎందుకు వర్తించడం లేదని ప్రభుత్వంపై అసహనం, ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అధికారంలో వస్తే రుణమాఫీ చేస్తామని ప్రగల్భాలు పలికి తీరా అధికారంలోకి వచ్చాక వేల సంఖ్యలో రైతులకు మొండిచేయి చూపుతున్నది. మూడు విడుతల్లో పూర్తిస్థాయిలో మాఫీ చేస్తామన్న ప్రభుత్వం నాలుగు విడుతలైనా నాగర్‌కర్నూల్ జిల్లాలో ఇంకా 6,117 మంది రైతులకు వివిధ కారణాల చేత వర్తింపచేయలేదు. దీంతో మళ్లా రైతులు మాఫీ కోసం అధికారులకు దరఖాస్తు అందజేశారు.
ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రుణమాఫీ పథకంలో భాగంగా నాలుగు విడుతల్లో రూ.2 లక్షల వరకు రుణాలు మాఫీ చేశారు. అయితే ఈ పథకం కింద నాగర్‌కర్నూల్ జిల్లా లో 1,11,297 మంది రైతులకు రుణమాఫీ వర్తించగా.. ఇంకా చాలా మందికి కాలే దు. దీంతో పలువురు రైతులు ఆందోళన చెందుతున్నారు. రుణాలకు పలు నిబంధనలు ఉన్నా అంతకు తక్కువగా ఉన్నా ఆలోపు రుణాలు ఉన్న వారు సైతం నాలుగు విడుతల్లో నోచుకోలేదు. అర్హత ఉన్నా, ప్రభుత్వ నిబంధనల మేర కు అన్ని పత్రాలు అందించినా.. మాఫీ కాకపోవడం ఏమిటని ప్రశ్నిస్తున్నారు.
నాలుగో విడుత పూర్తయ్యే నాటికి నాగర్‌కర్నూల్ జిల్లాలో ఇంకా వివిధ కారణాలు చెబుతూ ప్రాసెస్ చేయనివి, ఆధార్‌లో రుణమాఫీలో పేరు వ్యత్యాసం ఉండ డం, కుటుంబ సభ్యుల నిర్ధారణ సక్రమంగా లేదని, ఆధార్‌లోనూ, రుణమాఫీలోనూ పేర్లు వేర్వేరుగా ఉండడం, కుటుంబ సభ్యుల్లో ఉ ద్యో గం ఉన్నా, పాస్‌పుస్తకాలు లేవని, రేషన్‌కార్డు లేదని, ఇద్దరు రైతులకు ఒకే ఐడీ నెంబర్ ఉంద న్న కారణాలు చూపి జిల్లాలో ఇంకా 6,117 మంది రైతులకు ఇవ్వలేదు. దీంతో సదరు రైతు లు తిరిగి దరఖాస్తు చేసుకున్నారు. జిల్లాలో మొ త్తం రూ.1,17,411 మంది రుణా లు తీసుకో గా.. వివిధ కారణాలతో ఇంకా 6,117 మందికి రుణమాఫీ కాలేదు. జిల్లా వ్యాప్తంగా రూ. 1,200 కోట్లకుపైగా పెండింగ్‌లో ఉన్నట్లు అధికారుల లెక్కలు చెబుతున్నాయి.
ఇచ్చిన మాట మేరకు రుణమాఫీ చేశామని మూడ్రోజుల కిందట మహబూబ్‌నగర్‌లో నిర్వహించిన రైతు పండుగలో సీఎం రేవంత్‌రెడ్డి ప్రకటించడంతో కర్షకులు అయోమయంలో పడ్డారు. మూడు విడుతల్లోనే పూర్తి చేస్తామన్న సర్కారు నాలుగు విడుతలుగా ఇచ్చినా మాఫీ కాలేదని పలువురు లబోదిబోమంటున్నారు. మరోసారి ప్రభుత్వానికి దరఖాస్తు చేసుకోవాల్సిన దుస్థితి ఏర్పడిందని నిట్టూర్చుతున్నారు. చేస్తున్న మాఫీకి చెబుతున్న లెక్కలకు పొంతన లేదని రైతుల్లో విమర్శలు వ్యక్తమవుతున్నాయి. కేసీఆర్ ప్రభుత్వంలో ఎలాంటి సమస్యలు లే కుండా రుణమాఫీ జరిగిందని, కాంగ్రెస్ హ యాంలో అన్నీ సమస్యలే ఎదురవుతున్నాయనే అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
మాగనూరు మండలం గురురావ్ లింగంపల్లి గ్రామంలో పది ఎకరాల వ్యవసాయ భూమి ఉంది. రూ.లక్షా 60 వేల రుణం మక్తల్ డీసీసీబీలో తీసుకున్నా.. కేసీఆర్ ప్రభుత్వ హయాంలో మాఫీ అయ్యింది. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతి రైతుకూ రూ.2 లక్షల రుణ మాఫీ చేశామని చెబుతున్నా.. నాకు మాత్రం కాలేదు. ఇప్పటికైనా అధికారులు స్పందించి మాఫీ చేయాలి.
– మహదేవ్గౌడ్, రైతు, గురురావ్ లింగంపల్లి, మాగనూర్ మండలం
నారాయణపేట యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి రూ.1.60 లక్షల పంట రుణం తీసుకున్నా. రెగ్యులర్‌గా రెన్యువల్ చేశాను. బ్యాంకు అధికారులు, వ్యవసాయ శాఖ అధికారులు ఆధార్ కార్డులో బాలు నాయక్ చవాన్‌గా ఉంది.. బ్యాంకు ఖాతాలో లంబాడీ బాలుగా ఉంది. దీంతో రుణమాఫీ జరగలేదు. రెండు నెలల కిందట అధికారులు పేర్లు సరిచేసి రుణమాఫీ చేస్తామని ప్రకటించారు. నాలుగు విడుతలుగా రుణ మాఫీ చేసినా కాలేదు. చిన్నప్పటి నుంచి కాంగ్రెస్ పార్టీ వీరాభిమానిని. నా కుమారుడు బీఆర్ఎస్ నుంచి సర్పంచ్‌గా గెలుపొందినా, నేను కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నాను. కానీ నాకు రుణమాఫీ చేయకపోవడం దారుణం. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి మాఫీ చేయాలి.
– బాలు నాయక్, రైతు, పిల్లిగుండ్ల తండా, నారాయణపేట మండలం.
ధన్వాడ యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్రాంచ్ నుంచి రూ.2 లక్షల పంట రుణం తీసుకున్నాను. రెగ్యులర్‌గా రుణాన్ని రెన్యువల్ చేశాను. వడ్డీతో కలిపి రూ.2,03,861 అప్పు మిగిలింది. కాంగ్రెస్ ప్రభుత్వం రూ.2 లక్షల పైచిలుకు ఉన్నదన్న సాకుతో నాలుగు విడుతలుగా రుణమాఫీ చేయడం లేదు. ప్రభుత్వం ఊకదంపుడు ఉపన్యాసాలు ఇస్తున్నా.. ఆచరణలో అమలు కావడం లేదు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి రుణ మాఫీ చేయాలి.
– ఇక్బాల్ ఖాన్, రైతు, ధన్వాడ
బ్యాంక్ చుట్టూ చెప్పులరిగేలా తిరుగుతున్నా.. రుణమాఫీ గురించి పట్టించుకోవడం లేదు. నారాయణపేట ఏపీజీవీబీలో రూ.2.10 లక్షల అప్పు తీసుకున్న. రూ.2 లక్షలు రుణమాఫీ చేస్తామని, అధికారులు పైన ఉన్న రూ.10 వేలు కట్టించుకున్నారు. కట్టి మూడు నెలలు అవుతున్నా మాఫీ మాత్రం కాలేదు. ఇంతకీ రుణమాఫీ అవుతుందా..? లేదా..? అన్న విషయం కూడా చెప్పడం లేదు. అప్పు చేసి పంటకు పెట్టుబడులు పెట్టే పరిస్థితులు ఏర్పడ్డాయి.
– కే.పాండురంగారెడ్డి, రైతు, పగిడిమర్రి, ఊట్కూరు మండలం