MGKLI | కొల్లాపూర్, మార్చి 14: యంజీకేఎల్ఐ మరియు పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుల ద్వారా జిల్దార్ తిప్ప చెరువుకు సాగునీరు అందించాలని శుక్రవారం ఉదయం ఏడు గంటల ప్రాంతంలో చెరువు వద్ద రైతులు నిరసన తెలిపారు. ఈ సందర్భంగా తెలంగాణ రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షులు బాలపీర్, మొలచింతలపల్లి మాజీ సర్పంచ్ బాలస్వామి గౌడ్లు మాట్లాడుతూ.. నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్ మండలం ముక్కిడిగుండం గ్రామంలో ఉన్న జిల్దార్ తిప్పా చెరువు తూమును తక్షణమే మరమ్మతులు చేపట్టాలని డిమాండ్ చేశారు. ముక్కిడిగుండం మొలచింతలపల్లి గ్రామ సరిహద్దుల్లో ఉన్న జిల్దార్ తిప్ప చెరువు రెండు గ్రామాలలో రైతాంగానికి వ్యవసాయ సాగుకు సాగునీరు ఉపయోగించబడే ఈ చెరువు కింద దాదాపుగా రైతులు 5000 ఎకరాల పైచిలుకుగా సాగు చేస్తున్నట్లు తెలిపారు.
నేటి పాలకులు ఈ చెరువు పైన దృష్టి పెట్టి అభివృద్ధి చేయాలని చెరువుకు మరమ్మతులు చేపట్టాలన్నారు. రైతులకు సాగునీరు అందే విధంగా పక్కనే ఉన్న పాలమూరు రంగారెడ్డి కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ రెండు ప్రాజెక్టులు ఉన్న పక్కనే ఉన్న గ్రామానికి సాగునీరం అందించలేకపోతున్న పాలకులు మాత్రం గొప్పలు చెప్పుకోవడం తప్ప ఈ ప్రాంత రైతాంగంపైన సవితి తల్లి ప్రేమ చూపుతోందన్నారు. ఈ రెండు ప్రాజెక్టుల ద్వారా సాగునీరు అందించాలని వారు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
ఎన్నికలు వచ్చిన ప్రతిసారి అదిగో సాగునీరు అందిస్తామని మాయమాటలు చెప్పి ఓట్లు వేయించుకుంటున్నారు తప్ప చెరువు పైన కనీస ఆలోచన లేకుండా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. ఇప్పటికైనా చెరువు యొక్క తూము మరమ్మతులు చేయలేకపోవడం వల్ల రైతులు వేసుకున్న పంటలకు నీరు అందక ఎండిపోతున్నటువంటి పరిస్థితి ఉంది. స్థానిక మంత్రి జూపల్లి కృష్ణారావు దీనిపైన స్పందించి తూము మరమ్మతులు వెంటనే చేపట్టాలని, ఈ ప్రాజెక్టుల ద్వారా సాగునీరు అందించాలని వారు ప్రభుత్వాన్ని కోరారు. ఈ కార్యక్రమంలో రైతులు ఆడేం ఆశన్న, గంగం రాముడు, తదితరులు పాల్గొన్నారు.