గద్వాల/అయిజ, నవంబర్ 16 : పచ్చటి పొలాలు, పక్కనే తుంగభద్ర నదీతీరాన ప్రశాంతమైన వాతావరణం లో 12 గ్రామాల ప్రజలు వ్యవసాయం చేసుకుంటూ జీవ నం సాగిస్తున్నారు. అయితే ఆ గ్రామాల ప్రజలు, రైతుల కు ఇథనాల్ కంపెనీ ఏర్పాటవుతుందన్న పిడుగులాంటి వార్త తెలిసింది. పచ్చని పొలాలు, పల్లెలు, నదిని కలుషితం చేసే ఫ్యాక్టరీ మాకొద్దంటూ ఆందోళనకు సిద్ధమయ్యారు. ఇథనాల్ ఫ్యాక్టరీ పేరు వినగానే రైతులు ఉలిక్కి పడుతున్నారు. గాలి, నీరు, తినే పంటలను కలుషితం చే సే ఫ్యాక్టరీ మాకొద్దంటూ రాజోళి మండలం పెద్ద ధన్వాడ గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చే స్తున్నారు. ఇప్పటికే నారాయణపేట జిల్లా చిత్తనూర్‌లో ఇలాంటి ఫ్యాక్టరీని అక్కడి రైతు లు, ప్రజలు అడ్డుకొన్నారు.
ఆరోగ్యాలకు ముప్పుతోపాటు పొలాలను నాశనం చేసే పరిశ్రమను జోగుళాంబ గద్వాల జిల్లాలో గాయత్రీ రెన్యూవబుల్ ఫ్యూయల్స్ ఇథనాల్ పేరుతో ఏర్పాటు చేస్తున్నారు. జీపీ తీర్మానం లేకుండా, ప్రజా అభిప్రాయాలు సేకరించకుండా.. కంపెనీ ఏర్పాటు కు సన్నాహాలు చేస్తుండడం అందుకు సంబంధించిన రో డ్డు, విద్యుత్ పనులు చేస్తుండడంతో 12 గ్రామాల ప్రజ లు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. నిత్యం ఆందోళనలు చే యడంతోపాటు కలెక్టర్, ప్రజాప్రతినిధులకు వినతిపత్రా లు అందజేస్తున్నారు. ఇంత జరుగుతున్నా స్థానికులకు తె లియకుండా కంపెనీ పనులు చకచకా సాగుతున్నాయి. కాసులకు కక్కుర్తిపడ్డ అధికారులు పంటపొలాలు ఏమైతేనేమి, రైతులు రోడ్డున పడితే మాకేంటన్నట్లు ఫ్యాక్టరీకి ఇరిగేషన్ అధికారులు నీటిని కేటాయించారు.
ఎప్పటికీ ఒక టీఎంసీ నిల్వ ఉండేలా అధికారులు అనుమతులిచ్చారు. తుంగభద్ర నది నుంచి రెండు మోటర్ల ద్వారా నీటిని ని రంతరం ఇథనాల్ ఉత్పత్తికి వినియోగించుకునేలా చర్య లు చేపట్టారు. ప్రతిరోజూ సుమారు లక్షా ఇరవై వేల లీట ర్ల ఇంధనం ఉత్పత్తి చేసేలా రూ.189 కోట్లతో ఫ్యాక్టరీని ఏర్పాటు చేస్తున్నారు. కంపెనీ నుంచి వెలువడే రసాయనాలు సమీపంలోని వాగులోకి వదిలేలా ప్రణాళిక సిద్ధం చేశారు. ఆ వాగు నీరు తుంగభద్రలోకి వెళ్లడంతో కలుషితమయ్యే అవకాశం ఉందని రైతులు వాపోతున్నారు. విద్యుత్ శాఖాధికారులు వారికి అవసరమైన కరెంట్‌ను అందించడానికి ఓకే చేశా రు. ఈ విషయం తెలిసిన రైతులు ఫ్యాక్టరీ నిర్మాణం చేపడితే బంగారు పంటలు పండే భూములు తమ కం డ్ల ముందే బీళ్లుగా మారుతున్నాయని తెలిసి ఆందోళన చెందుతున్నారు. మాకూ.. మా గ్రామాలకు, పంటలకు హాని కలిగించే పరిశ్రమ నిర్మించొద్దం టూ ఆందోళనకు సిద్ధమయ్యారు.
రాజోళి మండలం పెద్దధన్వాడ సమీపంలో గాయిత్రీ సహజ ఇంధన కర్మాగారం ఆధ్వర్యంలో సుమారు 29 ఎ కరాల్లో ఇథనాల్ ఫ్యాక్టరీ నెలకొల్పుతున్నారు. ఇటీవల ప నులు ప్రారంభించేందుకు ప్రయత్నించగా గ్రామస్తులు అ డ్డుకున్నారు. అయితే అక్కడికి రెవెన్యూ అధికారులు, పో లీసులు వెళ్లి స్థానికులతో చర్చించిన తర్వాతే పనులు చేపడుతారని చెప్పారు. కానీ, కంపెనీ యాజమాన్యం తిరిగి విద్యుత్ స్తంభాలు పాతడానికి ఏర్పాటు చేయగా మరోసారి అడ్డుకున్నారు. ఫ్యాక్టరీ మాకొద్దంటూ కలెక్టరేట్ వద్ద ఆందోళనలు చేపట్టారు. అయినా కంపెనీ పనులు ప్రారంభించే ప్రయత్నం చేస్తుండడంతో ఫ్యాక్టరీకి వ్యతిరేకంగా 12 గ్రామాల్లో ఊరూరా ఉద్యమాలు మొదలయ్యాయి.
కేసీఆర్ ప్రభుత్వం పెద్దధన్వాడలోని నిరుపేద దళితులకు 152 ఎకరాలు కేటాయించింది. ఇక్కడ ప్రస్తుతం పొగాకు, మిరప, వేరుశనగ, కంది సాగు చేసుకొని జీవిస్తున్నారు. వీరి పొలాల పక్కనే ఇథనాల్ ఫ్యాక్టరీ ఏర్పా టు కావడంతో భూములు సాగు చేసుకొని జీవించే దళితులకు అన్యాయం జరిగే అవకాశం ఉంది. వారికి వ్యవసాయ భూమి లేక ఆర్థికంగా ఇబ్బందులు పడే అవకా శం ఉందని వాపోతున్నారు. 2009లో తుంగభద్ర నది కి వరదలు వచ్చిన సమయంలో ప్రభుత్వం ప్రస్తుతం ఫ్యాక్టరీ నిర్మాణం చేసే పొలం పక్కనే దళితులకు ఇండ్లు నిర్మించుకునేందుకు ఆరెకరాల భూమిని నాటి సర్కారు కేటాయించింది. సమీపంలోనే కంపెనీ ఏర్పాటవుతుండడంతో భవిష్యత్‌లో అనారోగ్యం బారినపడే అవకాశం ఉన్నదని వారు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. దీనికి తోడు కలుషిత నీరు, గాలి, పొగతో తుమ్మిళ్ల లిఫ్ట్ నీరు కూడా కలుషితమయ్యే ప్రమాదం ఉన్నది.
ఇథనాల్ ఫ్యాక్టరీ నుంచి వచ్చే వ్య ర్థాల వల్ల పచ్చని పంటలు పండే మా భూములు బీడుగా మారే అవకాశం ఉన్నది. చిత్తనూర్, నిర్మల్ జిల్లా గుం డంపల్లి, దిలావర్పూర్ రైతులు వ్యతిరేకించారు. అనారోగ్య సమస్యలతోపా టు పంట పొలాలు నాశనమవుతా యి. ఫ్యాక్టరీ సమీపంలో మాకు 20 ఎకరాల పొలముంది. ఫ్యాక్టరీ ఏర్పాటైతే బీడుగా పెట్టుకోవాల్సిన పరిస్థితి. ఉన్న భూమి పోతే మేము ఎలా బతకాలి. ఆందోళనలు చేస్తే పోలీసులు భయపెడుతున్నారు. ఎవరికీ భయపడే ప్రసక్తిలేదు. ప్రాణాలైనా అడ్డుపెట్టి ఫ్యాక్టరీ నిర్మాణం అడ్డుకుంటాం.
– జయరామిరెడ్డి, రైతు, పెద్ద ధన్వాడ
ఫ్యాక్టరీ ఏర్పాటు చేస్తే మా పచ్చని పొలాలు బీడులుగా మారే అవకాశం ఉంది. ఎట్టి పరిస్థితిలో ఫ్యాక్టరీ నిర్మా ణం జరగనివ్వం. గ్రామ సమీపంలో నిర్వహిస్తున్న ఇథనాల్ ఫ్యాక్టరీతో ప్రజలు, పొలాలకు తీవ్రమైన నష్టం జరుగుతుంది. మా పంటలు దెబ్బతింటాయి. భూముల్లో గడ్డి కలుషితమై మా పశువులు తింటే వాటి ప్రాణాలకే ముప్పు. మాకు నష్టం కలిగించే దేనినైనా అడ్డుకుంటాం. పచ్చని పంట పొలాలు పండు ఈ ప్రాంతంలో ఈ ఫ్యాక్టరీ అవసరం లేదు. ఎక్కడైనా ఏర్పాటు చేసుకోండి.
– నారాయణ, మాజీ సర్పంచ్, చిన్నధన్వాడ
తమ పచ్చని పొలాలను బీళ్లుగా మార్చి, తమ గ్రామాలను కలుషితం చేసి, ప్రజలు అనారోగ్యం బారిన పడేసే ఇథనాల్ ఫ్యాక్టరీని ఎట్టి పరిస్థితుల్లో అడ్డుకొని తీరుతాం. శాంతియుతంగా ఉద్యమాలు చేస్తాం. మా సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తాం. సమస్య పరిష్కారమయ్యే వరకు ఉద్యమాన్ని కొనసాగిస్తాం.
– వీరేశ్‌గౌడ్, పెద్దధన్వాడ