మద్దూర్, డిసెంబర్ 28: రైతు సమస్యలను సత్వరమే పరిష్కరించాలని కలెక్టర్ కోయ శ్రీ హర్ష అన్నారు.బుధవారం మండల కేంద్రంలోని తాసిల్దార్ కార్యాలయాన్ని ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. పలు రికార్డులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తాసిల్దార్ కార్యాలయానికి వచ్చిన రైతుల ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలని ఆధికారులకు ఆదేశించారు. ఫిర్యాదు దారుడు ధరణి పోర్టల్‌తో అర్జీ చేసుకున్నవారి పత్రాలను పరిశీలించి ఫిర్యాదు దారుడికి ఇబ్బందులు కలుగకుండా చూడాలన్నారు. కార్యక్రమంలోతాసిల్దార్ రవి, సిబ్బంది ఉన్నారు.
అర్హులకే సదరం సర్టిఫికెట్లు జారీ చేయాలి
నారాయణపేట టౌన్, డిసెంబర్ 28: అర్హులైన దివ్యాంగులకే సదరం సర్టిఫికెట్లు ఇవ్వాలని కలెక్టర్ శ్రీహర్ష అధికారులను ఆదేశించారు. బుధవారం పట్టణంలోని కలెక్టర్ కార్యాలయంలో వైద్య ఆరోగ్య, డీఆర్డీఏ అధికారులతో సదరం క్యాంపుల నిర్వహణపై సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పట్టణంలోని ప్రభుత్వ దవాఖానలో ప్రతి బుధవారం నిర్వహించే ఆర్థో సదరం క్యాంపులో అదే రోజు సాయంత్రం వరకు సర్టిఫికెట్లు ఇవ్వాలన్నారు. ప్రతి మంగళవారం మహబూబ్‌నగర్‌లో ఈఎన్టీ, కంటి, మానసిక సంబంధిత దివ్యాంగులకు నిర్వహించే సదరం క్యాంపుకు సంబంధించి శనివారం రోజు సర్టిఫికెట్లు అందజేయాలన్నారు. సదరం క్యాంపు నిర్వహించే రోజు ఎన్ని స్లాట్ బుకింగ్స్ వచ్చాయి, ఎంత మందికి సర్టిఫికెట్లు ఇచ్చారన్న వివరాలను వాట్సాప్‌తో తనకు సమాచారం ఇవ్వాలన్నారు. అనర్హులకు సర్టిఫికెట్లు ఇస్తే చర్యలు తప్పవన్నారు. సమావేశంలో అదనపు కలెక్టర్ మయాంక్ మిట్టల్, డీఆర్డీవో గోపాల్‌నాయక్, జిల్లా దవాఖాన సూపరింటెండెంట్ రంజిత్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.
మన ఇసుక వాహనంతో సత్ఫలితాలు
జిల్లాలో మన ఇసుక వాహనంతో నిర్మాణ రంగాలకు ఇసుక సరఫరా ప్రారంభించాక సత్ఫలితాలు వస్తున్నట్లు కలెక్టర్ శ్రీహర్ష అన్నారు. బుధవారం పట్టణంలోని కలెక్టర్ కార్యాలయంలో మైనింగ్, రెవెన్యూ, మున్సిపల్ అధికారులతో మన ఇసుక వాహనం నడుస్తున్న తీరు తెన్నులపై సమీక్షించారు. పట్టణ ప్రజలు గృహ నిర్మాణ అవసరాలకు మన ఇసుక వాహనం ద్వారా ఇసుక బుక్ చేసుకుంటే 48 గంటల్లో ఇంటి వద్ద దించడం జరుగుతుందన్నారు. ఇసుక కోసం ప్రజల వెతలు తీరడంతో పాటు తక్కువ ధరకు ఇసు క లభిస్తుందన్నారు. రోజుకు 180 ట్రిప్పుల వరకు మన ఇసుక వాహనం ద్వారా ఇసుక సరఫరా చేసినట్లు, ఈ నెల లో 1,555 ట్రిప్పులు సరఫరా చేయడం జరిగిందన్నారు.కోస్గిలో ఇసుక రీచ్ అందుబాటులోకి తెచ్చేందుకు, ఊట్కూర్ మండలం సమిస్తాపూర్ నుంచి పేటకు ఇసుక సరఫరా చేసేందుకు ఉన్న అవకాశాలను పరిశీలించాలన్నా రు. ఇసుక అవసరమున్నవారు ఆన్లైన్లో మాత్రమే బుక్ చేసుకోవాలని, డీడీలు, చెక్కులు తీసుకొస్తే ఆమోదించరాదని రెవెన్యూ అధికారులకు సూచించారు. సమావేశంలో ఏడీ మైన్స్ విజయ్‌కుమార్, మున్సిపల్ కమిషనర్ సునీత తదితరులు పాల్గొన్నారు.