కల్వకుర్తి/వంగూర్, మే 27 : ధాన్యం కొనాలంటే రైతులు అధికారు లు, ప్రజాప్రతినిధుల కాళ్లు మొక్కాలా? అని బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్, మాజీ ఎమ్మెల్యేలు మర్రి జనార్దన్‌రెడ్డి, జైపాల్ యాదవ్ ప్రశ్నించారు. బుధవారం వంగూరులో బీఆర్ఎస్ ఆ ధ్వర్యంలో రైతు మహాధర్నా చేపట్టారు. ఈ కార్యక్రమానికి ఆర్‌ఎస్‌తోపాటు మాజీ ఎమ్మెల్యేలు జనార్దన్‌రెడ్డి, జైపాల్‌యాదవ్, రాష్ట్ర ఫుడ్ కమిషన్ చైర్మన్ గోళి శ్రీనివాస్‌రెడ్డితోపాటు పలువురు హాజరయ్యా రు.
ఈ సందర్భంగా ఆర్ఎస్పీ మాట్లాడుతూ తాను రోజుకు 18 గంట లు పనిచే స్తున్నానని, సమీక్షలు చేస్తున్నానని సీఎం రేవంత్ ప్రగల్భాలు పలికితే వాటి గురించి ఆరా తీస్తే.. రాష్ట్రంలోని అసైన్‌భూములు వివరాలు, వాటి సర్వే నెంబర్ల గురించి రివ్యూలు చేస్తున్నాడని తెలిసిందని విమర్శి ంచారు. తెలంగాణలో రైతుల గురించి మాట్లాడటమే తప్పవుతుందని.. దీనికి ప్రత్యక్ష ఉదాహరణ కరీంనగర్లో ఆర్టీసీ డ్రైవర్ రిమూవల్ అని ఆందోళన చెందారు.
కరీంనగర్లో ఆర్టీసీ డ్రైవర్ రైతుల ధాన్యా న్ని కొనుగోలు చేయాలని అన్నందుకే అతన్ని డ్రైవర్ ఉద్యోగం నుంచి తొలగించారని, ఇంతకన్న దౌర్భాగ్యంఇంకేదైనా ఉంటుందా అని ప్ర శ్నించారు. రైతుల సమస్యల గురించి మాట్లాడితే కేసులు నమోదు చేసి జైళ్ల కు తరలిస్తున్నారని, బీఆర్ఎస్ సింహంలా గర్జిస్తూ రైతుల పక్షాన పోరాటాలు చేస్తూనే ఉంటుందన్నారు. అకాల వర్షాలకు తడిసిన ధా న్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. నిర్ధిష్టమైన ప్రణాళిక ఏర్పాటు చేసుకుని కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి ఉంటే ఈ పరిస్థితి వచ్చేది కాదన్నారు. ధాన్యం ఆఖరి గింజ కొనుగోలు చేసే వరకు రైతుల పక్షాన బీఆర్ఎస్ పోరాటం చేస్తూనే ఉంటుందన్నారు.
సాయిరెడ్డి మరణ వాంగ్మూలం లేఖకు విలువలేదా ?
సీఎం సొంత గ్రామం కొండారెడ్డిపల్లిలో మాజీ సర్పంచ్ సాయిరెడ్డి మరణ వాంగ్మూల లేఖకు విలువ లేకుండా పోయిందని ఆర్ఎస్పీ ఆవేదన వ్యక్తం చేశారు. ఒక వ్యక్తి చనిపోతూ తన ఆత్మహత్యకు కారకుల గురించి రాస్తే.. ఆ లేఖను పట్టించుకోకుండా కేసును నీరుగార్చి ఈ ప్రభుత్వం నేరస్తులకు చుట్టంగా మారిందని దుయ్యబట్టారు. తన ఇంటికి రోడ్డు లేకుండా అడ్డంగా గోడ కట్టి తనను హింసకు గురిచేశారని మాజీ సర్పంచ్ సాయిరెడ్డి ఆవేదన వ్యక్తం చేస్తూ.. రేవంత్‌రెడ్డి సోదరుల వల్లే తాను ఆత్మహత్య చేసుకుంటున్నానని సూసైడ్ నోట్ రాసి చనిపోతే.. ఇంత వరకు దానిపై పోలీసులు, ప్రభుత్వం చర్యలు తీసుకోలేదని దుయ్యబట్టారు. ఇది ప్రజా ప్రభుత్వమా? అని ప్రశ్నించారు. కనీసం ఈ విషమమై రేవంత్‌రెడ్డి సోదరులకు నోటీసులు కూడా ఇవ్వలేదని ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ప్రజల సొమ్ముతో జీతాలు తీసుకుంటున్న పోలీసులు చట్టాన్ని రక్షించాలని లేకపోతే బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తగిన ఫలితం అనుభవిస్తారని ఆయన హెచ్చరించారు.
కేసీఆర్ పాలన రామరాజ్యం : జైపాల్
కేసీఆర్ ప్రభుత్వ హయాంలో రాష్ట్రంలో రామరాజ్యం నెలకొన్నదని కల్వకుర్తి మాజీ ఎమ్మెల్యే జైపాల్‌యాదవ్ పేర్కొన్నారు. రూ.72వేల కోట్లను రైతుబంధు ద్వారా రైతుల ఖాతాలో జమ చేసిన గొప్ప వ్యక్తి కేసీఆర్ అని అన్నారు. గుంట పొలం ఉన్న రైతు మృతి చెందితే రూ.5లక్షల రైతుబీమా కల్పించి రైతులపై కేసీఆర్‌కు ఉన్న ప్రేమ ఇట్టే మనం అర్థం చేసుకోవచ్చన్నారు. రైతులను నిలువునా దోచుకుంటున్న కాంగ్రెస్ ప్రభుత్వానికి చరమగీతం పాడాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ రైతు ధర్నాలో తడిచిన ప్రతి ధాన్యం గింజనూ ప్రభుత్వం కొనుగోలు చేయాలని తీర్మానించారు. అనంతరం ధర్నా నుంచి నేరుగా ర్యాలీగా వెళ్లి తాసీల్దార్ మురళీమోహన్‌కు వినతిపత్రం అందజేశారు.
అంతకు ముందు బీఆర్ఎస్ పార్టీ కార్యాలయాన్ని ఆర్ఎస్పీ, మర్రి, జైపాల్యాదవ్లు ప్రారంభించారు. ధర్నాకు 800 మంది హాజరయ్యారు. రైతులు,బీఆర్ఎస్ శ్రేణులు ఎంతో ఉత్సాహంగా ధర్నాకు తరలివచ్చారు. ఈ ధర్నాలో తెలంగాణ ఉద్యమకారులు, కవి, గాయకులు మానకోట ప్రసాద్, సందీప్ రైతుల పాలిట కాంగ్రెస్ ప్రభుత్వం చేపడుతున్న రైతు వ్యతిరేక విధానాలకు అనుగుణంగా తమ పాటలతో అలరించారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ సీనియర్ నేతలు పోకల మనోహర్, శ్రీకాంత్ భీమా, పర్వతాలు, తులసీరాం, గణేశ్‌రావు, నరేందర్‌రావు, రాజేందర్‌రెడ్డి, సురేందర్, నేతలు ప్రవీణ్‌రెడ్డి, మదన్‌కుమార్‌రెడ్డి, శ్రీపతిరావు, పుల్లయ్య యాదవ్, అంజి, రాజుతో పాటు సర్పంచులు, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
కాంగ్రెస్ , బీజేపీ ఒక్కటే.. : మర్రి
ధాన్యం కొనుగోళ్ళలో కాంగ్రెస్, బీజేపీ నాయకులు డ్రామాలాడుతున్నారని నాగర్‌కర్నూల్ మాజీ ఎమ్మెల్యే, అచ్చంపేట నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ సమన్వయకర్త మర్రి జనార్దన్‌రెడ్డి దుయ్యబట్టారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో రైతులు విలవిలలాడుతున్నారని ఆవేదన చెందారు. రైతులు దారుణమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, పండించిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలని అధికారుల కాళ్లు మొక్కే పరిస్థితులు దాపురించాయన్నారు. ఇంతకన్నా దయనీయమైన పరిస్థితులు ఉంటాయా అని వాపోయారు.
ఈ దుర్మార్గమైన పరిస్థితులకు కారణమైన ప్రభుత్వానికి ఘోరీకట్టాలనే లక్ష్యంతో సీఎం సొంత మండలం వంగూర్‌లో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో రైతు మహాధర్నా చేపట్టడం అభినందనీయమన్నారు. కాంగ్రెస్ పతనం ఈ మండలం నుంచే ప్రారంభమైందని హెచ్చరించారు. రైతుల గొంతుకగా బీఆర్ఎస్ ఉంటుందని మర్రి చెప్పారు. రాష్ట్రంలో ప్రభుత్వం తిరోగమన దిశలో పయనిస్తుందని విమర్శించారు. నిజంగా ప్రభుత్వానికి పోయే కాలం వచ్చిందని, ప్రజాపాలన అంటూ పోలీస్ పాలన సాగిస్తున్నారని దుయ్యబట్టారు. ధాన్యం కొనమని అడిగితే కేసులు నమోదు చేస్తామని బెదిరిస్తారా? అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.
కాంగ్రెస్ నాయకులకు, ప్రజా ప్రతినిధులకు నిజంగా ప్రజాపాలనపై గౌరవం ఉంటే సెక్యూరిటీ లేకుండా గ్రామాల్లోకి.. రైతుల కల్లాల వద్దకు రావాలని సవాల్ విసిరారు. మద్దతు ధర ఇవ్వాలని, ధాన్యం కొనుగోలు చేయాలనే డిమాండ్‌తో రైతులు ధర్నా చేసేందుకు భయపడుతున్నారంటే.. ఇది ప్రజాపాలనా? లేక పోలీస్ పాలనా? అన్ని ప్రశ్నించారు. కేసులకు భయపడవద్దు, చట్టప్రకారం ముందుకు సాగుదామని పిలుపునిచ్చారు. కాంగ్రెస్ ఇచ్చిన అబద్దపు హామీలకు మోసపోయి అధికారాన్ని అప్పగించాం.. మరోసారి మోసపోవద్దని సూచించారు. ప్రభుత్వానికి దమ్ము ఉంటే జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు పెట్టాలని, అప్పుడు రైతుల సత్తా ఏమిటో తెలుస్తుందన్నారు.
పోలీసుల రక్షణ లేకుండా కనీసం గ్రామాల్లోకి వెళ్లే పరిస్థితి కాంగ్రెస్ నాయకులకు లేదని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ అంటేనే కష్టాలు, కష్టాలు అంటేనే కాంగ్రెస్, రెండింటికీ అవినాభావ సంబంధం ఉందన్నారు. ఎరువులు మొదలు ధాన్యం అమ్మే వరకు రైతులకు అన్నీ కష్టాలేనని, ఇందుకు కారణం కాంగ్రెస్ పాలననే అన్నారు. ఇందిరా కాంగ్రెస్ వేరు.. ఇప్పుడున్న రేవంత్ కాంగ్రెస్ వేరు.. రేవంత్ కాంగ్రెస్ అంటేనే డూప్లికేట్ కాంగ్రెస్.. కేసులు, నిర్బంధాలు, వసూళ్లు, కబ్జాలు అనేవి నేటి కాంగ్రెస్ లక్ష్యమన్నారు.
రైతుబంధుకు ఎగనామం పెట్టారు.. ధాన్యం కొనుగోలు చేయరు.. గ్రామాలలో కాంగ్రెస్ పార్టీ గ్రాఫ్ దారుణంగా పడిపోయిందన్నారు. ధాన్యం కొనుగోళ్లలో ఉన్నతస్థాయి అధికారులు, మిల్లర్లు, కొందరు అధికార పార్టీ నాయకులు కుమ్మక్కై రైతులకు కుచ్చుటోపీ పెడుతున్నారని మండిపడ్డారు. క్వింటాలు వడ్లకు 12 నుంచి 18 కిలోల వరకు కోత విధిస్తున్నారని.. ఈ విషయమై మాట్లాడుతుంటే ఎవరూ స్పందించండం లేదని వాపోయారు. కోతలు విధించకుండా వడ్లను, తడిసిన ధాన్యాన్ని, మక్కలను చివరి గింజ వరకు కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. ఇబ్బందులు పడుతున్న రైతుల పక్షాన బీఆర్ఎస్ పోరాటాలకు ఎప్పుడూ సిద్ధంగా ఉంటుందని మర్రి ఉద్ఘాటించారు.
రైతు మహాధర్నాలో ప్లకార్డుల ప్రదర్శన
అభివృద్ధి ఫలాలన్నీ కొండారెడ్డిపల్లికేనా.. మిగతా గ్రామాలు ఏం పాపం చేశాయన్న ప్ల కార్డులను బుధవారం రైతు మహాధర్నాలో వంగూరు మండలవాసులు ప్రదర్శించారు. సీఎం సొంత ఊరు పుణ్యం చేసుకుంటే.. మిగతా పల్లెలు పాపమేమైనా చేశాయా? అంటూ నిరసన గళం వినిపించారు. ఆ ఒక్క ఊరికే రూ.వందల కోట్లు కేటాయిస్తే.. మిగ తా వాటికి రూ.లక్షలు కూడా ఇవ్వలేదంటూ ఆవేదన చెందారు.