గద్వాల, జూలై 17 : తాము పండించిన సీడ్ పత్తి విత్తనాలను కంపెనీలు పూర్తి స్థాయిలో కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ బుధవారం అయిజ, బింగిదొడ్డి స్టేజీ సమీపంలో 5గంటల పాటు ధర్నా చేసిన సంగతి విదితమే. మరోసారి గురువారం రైతు లు తాము సాగు చేసిన విత్తన పత్తి విత్తనాలు పూర్తిస్థాయిలో కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ కలెక్టరేట్ ఎదుట రైతులు పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు. జిల్లాలో సుమారు 20కంపెనీలకు పైగా కంపెనీలు సీడ్ పత్తి సాగు చేయాలని విత్తనాలు సరఫరా చేశారని రైతులు చెప్పారు. కంపెనీలు, ఆర్గనైజర్లను నమ్మి మాకున్నా స్థోమత, పొలాన్ని బట్టి ఎకరా మొదలుకొని నాలుగు ఎకరాల వరకు సీడ్ పత్తి సాగు చేశామని తెలిపారు. ప్రస్తుతం పంట వేసి 45రోజులు కావస్తున్నదని, ఈ సమయంలో సీడ్ కంపెనీలు చేతులేత్తేసి కేవలం ఎకరాకు రెండు క్విం టాళ్ల పత్తి విత్తనాలు మాత్రమే కొనుగోలు చేస్తామని, మిగతా సీడ్ పత్తి విత్తనాలను కొనుగోలు చేయమని చెబుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
కలెక్టర్‌ను కలిసి తమ గోడును వెళ్ల బోసుకుందామని కలెక్టరేట్‌లోకి వెళ్తుండగా పోలీసులు అడ్డుకోవడంతో ఆగ్రహించి కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించామన్నారు. కలెక్టర్ తమ దగ్గరకు వచ్చి హామీ ఇచ్చే వరకు ఆందోళన విరమించబోమని అక్కడే బైఠాయించారు. డీఎస్పీ మొగులయ్య కలుగచేసుకొని కలెక్టర్ ఆర్గనైజర్లు, కంపెనీల తో మాట్లాడి విషయం తెలుసుకున్న తర్వాత రైతుల సమక్షంలోనే వివరాలు వెల్లడిస్తారని చెప్పడంతో రైతులు శాంతించారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ 20ఏండ్లుగా జిల్లాలో సీడ్ పత్తి సాగు చేస్తున్నామని, కంపెనీలు,ఆర్గనైజర్లు దోచుకుంటున్నారని విమర్శించారు. నడిగడ్డలో 30 ఏండ్లుగా 40మంది ఆర్గనైజర్లు 35వేల మంది రైతుల జీవితాలతో చెలగాటం ఆడుతున్నారని చెప్పారు.
తాము యేటా నష్టపోతుంటే కంపెనీలు, ఆర్గనైజర్లు తమ కష్టమ్మీద కోట్లు సంపాదిస్తున్నారని విమర్శించారు. ఈ ఏడాది రైతులకు సీడ్ ఇచ్చే సమయంలో ఎటువంటి నిబంధనలు పెట్టకుండా, పంట వేసి ప్రస్తుతం క్రాసింగ్‌కు వచ్చే సమయంలో ఎకరాకు కేవలం రెండు క్విం టాళ్ల పత్తిని మాత్రమే కొనుగోలు చేస్తామని చెప్పడం రైతులను మోసం చేయడమేనన్నారు. ముందే విష యం చెబితే పంట సాగు చేసేవాళ్లం కాద న్నారు. ఎకరాకు సుమారు రూ.30వేల నుంచి రూ. 50 వేల వర కు పెట్టుబడి పెట్టారని, ఆ పెట్టుబడి ఎవరిస్తారని ప్రశ్ని ంచారు. రైతులకు బీఆర్ఎస్, బీజేపీ, నడిగడ్డ హక్కు ల పోరాట సమితి, ప్రజా సంఘాల నాయకులు సంఘీభావం తెలిపారు. ధర్నాతో ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడగా.. వాహనాలను అయిజ రోడ్డు ఆర్టీ వో కార్యాలయం వెళ్లే దారి నుంచి మళ్లించారు.
రైతులు ఉత్పత్తి చేసిన పత్తి విత్తనాలను పూర్తిగా కొనుగోలు చేయాలని, సమస్యలు రాకుండా కంపెనీలు బాధ్యతతో వ్యవహరించాలని కలెక్టర్ సంతోష్ కంపెనీలు, ఆర్గనైజర్లను ఆదేశించారు.గురువారం జిల్లా కేంద్రంలోని ఐడీఓసీ సమావేశ హాల్లో పత్తి విత్తన కొనుగోలుపై వ్యవసాయశాఖ అధికారులు,సీడ్ కంపెనీల ప్రతినిధులు,సీడ్ ఆర్గనైజర్లతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం రైతుల సంక్షేమానికి అధిక ప్రాధాన్యత ఇస్తున్నదని, రైతులకు ఇబ్బందులు కలగకుండా వారు పండించిన పత్తి విత్తనాలను ఖచ్చితంగా కొనుగోలు చేయాలని ఆదేశించారు. పత్తి సాగు జిల్లాకు ప్రధాన ఆదాయ మార్గమని, జిల్లాలో 40వేల ఎకరాల్లో రైతులు విత్తన పత్తిని సాగు చేస్తున్నారని తెలిపారు. 35కంపెనీల ద్వారా పంపిణీ చేసిన విత్తనాల ప్రకారంగా రైతులు పండించిన సీడ్ పత్తి విత్తనాలను వారికి లాభం చేకూరేలా చివరి విత్తనం వరకు కొనుగోలు చేయాలని సూచించారు. ఎస్పీ శ్రీనివాస్‌రావు మాట్లాడుతూ రెండు రోజులుగా బింగిదొడ్డిలో 4గంటలపాటు గద్వాలలో రోడ్డుపై రైతులు ధర్నా చేయడం వల్ల ట్రాఫిక్ సమస్య తలెత్తిందన్నారు. రైతులకు ఏవైనా సమస్యలు తలెత్తితే జిల్లా యంత్రాంగం పోలీస్ శాఖకు ముందుగా తెలియజేయాలన్నారు. సమావేశంలో అదనపు కలెక్టర్ లక్ష్మీనారాయణ, వ్యవసాయశాఖ డైరెక్టర్ సుచరిత, వ్యవసాయశాఖ జిల్లా అధికారి సక్రియనాయక్, ఏడీ సంగీతలక్ష్మీ పాల్గొన్నారు.