గద్వాల/గద్వాల రూరల్, అక్టోబర్ 25 : జోగుళాంబ గద్వాల కలెక్టరేట్ వద్ద ఉద్రిక్తత నెలకొన్నది. ఎన్నికల వేళ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను అమలు చేయాలంటూ నడిగడ్డ హక్కుల పోరాట సమితి నాయకులు, కర్షకులు డిమాండ్ చేశారు. రుణమాఫీ చేయడంతోపాటు రైతుభరోసా డబ్బులను ఖాతాల్లో జమచేయాలంటూ నడిగడ్డ హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో శుక్రవారం కలెక్టర్‌కు వినతిపత్రం అందజేసేందుకు రైతులు భారీగా కలెక్టరేట్‌కు చేరుకున్నారు.
అయితే, రైతులను కలెక్టరేట్‌లోకి వెళ్లకుండా పోలీసులు మెయిన్ గేట్‌కు తాళం వేసి అడ్డుకున్నారు. దీంతో నడిగడ్డ హక్కుల పోరాట సమితి జిల్లా చైర్మన్ రంజిత్‌కుమార్ రైతులతో కలిసి గేటు ఎదుట ధర్నా చేపట్టారు. అనంతరం రైతులు గేట్‌ను తీసుకొని లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించడంతో కొద్దిసేపు ఉద్రిక్తత పరిస్థితి నెలకొన్నది. కలెక్టర్ బయటకు వచ్చి తమ సమస్యలను వినాలని కార్యాలయం ఎదుట నిరసన వ్యక్తం చేశారు.
రైతులు భారీగా రావడంతో అందరినీ పంపించడం వీలుకాని నేపథ్యంలో కలెక్టర్ సంతోష్ బయటకు వచ్చి వినతిపత్రం అందుకున్నారు. ఆ తరువాత నడిగడ్డ హక్కుల పోరాట సమితి జిల్లా చైర్మన్ రంజిత్కుమార్తోపాటు కొందరు రైతులతో కలెక్టర్ మాట్లాడారు. సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించే విధంగా చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు. అంతకుముందు నడిగడ్డ హక్కుల పోరాట సమితి కార్యాలయం నుంచి రైతులు ర్యాలీగా కలెక్టరేట్‌కు చేరుకున్నారు.
అనంతరం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో నడిగడ్డ హక్కుల పోరాట సమితి జిల్లా చైర్మన్ రంజిత్‌కుమార్ మాట్లాడారు. అధికారంలోకి వచ్చిన వెంటనే రూ.2 లక్షల రుణమాఫీ చేస్తామని ప్రగల్భాలు పలికిన కాంగ్రెస్.. గద్దెనెక్కి పది నెలలు కావస్తున్నా ఇప్పటివరకు పూర్తిస్థాయిలో మాఫీ చేయలేదన్నారు. రైతుబంధు కంటే ఎక్కువ పెంచి ‘రైతుభరోసా’ ఇస్తామన్న హామీకి ఇప్పటివరకు దిక్కులేదన్నారు. దీనికి తోడు వానకాలం సాగుకు రైతుభరోసా ఇవ్వమని స్వయాన వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు ప్రకటించడం సిగ్గుచేటన్నారు.
ఆధార్‌కార్డు, బ్యాంక్, పట్టాదారు పాస్‌బుక్కులలో ఉన్న రైతుల పేర్లలో చిన్న చిన్న తప్పులున్నాయన్న సాకుతో రుణమాఫీ చేయడం లేదని మండిపడ్డారు. కొర్రీలతో సర్కారు కాలయాపన చేయడంతోపాటు రైతులకు అన్యాయం చేస్తుందన్నారు. కలెక్టర్లు బ్యాంకర్లతో సమావేశమై రుణమాఫీ అయ్యేలా చూడాలని కోరారు. ఒక వైపు రుణమాఫీ చేశామని సీఎం, మంత్రులు గొప్పలు చెబుతున్నప్పటికీ.. క్షేత్రస్థాయిలో ఆ పరిస్థితి లేదన్నారు. చాలామంది రైతులు రుణమాఫీ కోసం ఎదురుచూస్తున్నారన్నారు. ఇలాంటి ప్రభుత్వాన్ని ఎన్నడూ చూడలేదన్నారు.
రుణమాఫీ పూర్తిస్థాయిలో చేయకుంటే జిల్లా నుంచి భారీ ఎత్తున రైతులతో అసెంబ్లీకి చేరుకొని నిరసన వ్యక్తం చేస్తామని హెచ్చరించారు. కాంగ్రెస్ ప్రభుత్వం రియల్ఎస్టేట్ బ్రోకర్ అవతారం ఎత్తిందన్నారు. ప్రశ్నించే వారిని అణగదొక్కుతూ.. విద్యార్థులపైనా లాఠీచార్జి చేస్తూ.. అమానుష చర్యలకు దిగుతుందే తప్పా ప్రజా సమస్యలను పరిష్కరించడంలో చొరవ చూపడం లేదని విమర్శించారు. కార్యక్రమంలో నడిగడ్డ హక్కుల పోరాట సమితి కన్వీనర్ బుచ్చిబాబు, నాయకులు లవన్న, వెంకట్రాములు, బలరాముడు, గోవిందు, విష్ణు, ఆంజనేయిలు, రైతులు పాల్గొన్నారు.