ఊట్కూర్, నవంబర్ 3 : సీసీఐ అధికారులపై పత్తి రైతులు కన్నెర్ర చేశారు. మద్దతు ధర ప్రకటించి కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశాక రాత్రికి రాత్రే నిబంధనల్లో మార్పులు చేపట్టడంపై ఆగ్రహం చెందారు. రోజుకో కొ ర్రీలు పెడుతూ కొనుగోలు చేయకుండా వ్యవహరించడంపై మండిపడ్డారు. సోమవారం పలువురు రైతులు అడ్వాన్స్ స్లాట్ బుకింగ్ చేసుకుని వాహనాల్లో పత్తి లోడ్‌తో ఊట్కూర్ మండలంలోని విజయ కాటన్ ఇండస్ట్రీకి చేరుకున్నారు. అయితే ఎకరాకు 7 క్వింటాళ్లు మా త్రమే కొంటామని అధికారులు చెప్పడంతో ఆందోళనకు దిగారు. ఇండస్ట్రీ ఎదుట రహదారిపై బైఠాయించి రాస్తారోకో చేపట్టారు. రో జుకో నిబంధనతో ప్రభుత్వం తమను ముం చుతున్నదని సీసీవో శ్రీనివాసులుతో వాగ్వాదానికి దిగారు.
గంటపాటు జరిగిన ఆందోళనతో వాహనాలు ఎక్కడికక్కడ నిలిచిపోయా యి. విషయం తెలుసుకొన్న ఎస్సై రమేశ్ అక్కడకు చేరుకొని రైతులను సముదాయించి ట్రాఫిక్‌కు అంతరాయం లేకుండా చేశారు. అ యితే పాత నిబంధనల మేరకు కొనుగోలు చేయాలని కోరగా.. నారాయణపేట జిల్లా మా ర్కెట్ కార్యదర్శి భారతి, ఏవో గణేశ్‌రెడ్డి ఒప్పుకోలేదు. ఉన్నతాధికారుల ద్వారా వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్ దృష్టికి తీసుకెళ్లగా.. దిగొచ్చిన ప్రభుత్వం ఎకరాకు 12 క్వింటాళ్ల పత్తిని కొనుగోలు చేసేందుకు అంగీకరించడంతో రైతులు శాంతించారు. బీఆర్ఎ స్ నేత గంగాధరాచారి, రైతు సంఘం నాయకులు చంద్రశేఖర్‌రెడ్డి, భీమయ్య, రఘు, భీం రాజు తదితరులు మద్దతు తెలిపారు.
నారాయణపేట రూరల్, నవంబర్ 3 : ప్రభుత్వం విధించిన నిబంధనలు తొలగించి ఎకరాకు 12 క్వింటాళ్ల పత్తిని కొనుగోలు చేయాలని రైతులు డిమాండ్ చేశారు. ఈమేరకు సోమవారం మండలంలోని లింగంపల్లి సమీపంలోని భాగ్యలక్ష్మి కాటన్ ఇండస్ట్రీ ఎదుట ప్రధాన రహదారిపై బైఠాయించి ఆందోళనకు దిగారు. రైతులు చేపట్టిన నిరసనతో నారాయణపేట, హైదరాబాద్ వైపు వెళ్లాల్సిన ఆర్టీసీ బస్సులు, ఇతర వాహనాలు గంటన్నర పాటు రాకపోకలు నిలిచి ప్రయాణికులు తీవ్రమైన ఇబ్బందులకు గురయ్యారు.
ఈక్రమంలో పేట రూరల్ ఎస్సై రాముడు సిబ్బందితో అక్కడికి చేరుకొని వాహనాలను అడ్డు తొలగించాలని రైతులకు హుకుం జారీ చేయడంతోపాటు వాహనాలను స్వయంగా రోడ్డుకు అడ్డు తొలగించేందుకు ప్రయత్నం చేశారు. ఈక్రమంలో రైతులు పోలీసులకు వాగ్వాదం చోటుచేసుకుంది. విషయం తెలుసుకున్న నారాయణపేట ఆర్డీవో రాంచందర్‌నాయక్ రైతుల వద్దకు చేరుకుని సీసీఐ ద్వారా సమస్యను పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వడంతో ధర్నాను విరమించారు.