బిజినేపల్లి, జనవరి 24 : కాంగ్రెస్ ప్రభుత్వంలో రైతులకు యూరియా కష్టాలు తప్పడం లేదు. వానకాలంలో బస్తాల కోసం అరిగోస పడగా.. యాసంగి పంటల సీజన్లో మళ్లా అవే కష్టాలు దాపురించాయి. పంటలకు సరైన సమయంలో యూరియా అందించాలని రైతులు తల్లడిల్లుతున్నారు. సరిపడా అందక నిత్యం నరకయాతన పడుతున్నారు. తాజాగా బిజినేపల్లిలో రాత్రింబవళ్లు పడిగాపులు కాశారు. మండల కేంద్రంలోని సింగిల్విండో కార్యాలయం, రైతు వేదిక వద్ద శుక్రవారం రాత్రి 9 గంటల నుంచి శనివారం ఉదయం వరకు అన్నదాతలు నిరీక్షించారు. నాలుగైదు అందులో లేకపోవడంతో రైతులు మండలంలోని ఆయా గ్రామాల నుంచి మండల కేంద్రానికి చేరుకొని ఎముకలు కొరికే చలిలో దుప్పట్లు కప్పుకొని.. స్వెట్టర్లు వేసుకొని క్యూలైన్లలో నిరీక్షించారు.
ఉదయం 7 గంటల తర్వాత వ్యవసాయ అధికారులు వచ్చి రైతులకు టోకెన్లు అందించి యూరియా పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ ప్రభుత్వం రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ఎరువులు అందుబాటులో ఉన్నాయని రైతులకు చెబున్నా.. ఎక్కడా సరిపడా పంపిణీ కావడం లేదని ఆరోపించారు. దీంతో ఇబ్బందులు పడాల్సి వస్తుందని వాపోయారు. రెండు, మూడు బస్తాల కోసం పనులను వదులుకొని కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నామని వాపోయారు. ఇచ్చే కొన్ని బస్తాలకు సైతం నిబంధనలు పేరుతో కొర్రీలు పెడ్తున్నారని మండిపడ్డారు. గత కేసీఆర్ ప్రభుత్వ హయాంలో తిప్పలు లేకుండా యూరియా దొరికేదని గుర్తుచేశారు. ఏదేమైనా రేవంత్ పాలనలో యూరియా కోసం నిత్యం కష్టాలు తప్పడం లేదని ఆవేదన చెందారు. మండలానికి 1,400 యూరియా బస్తాలు వచ్చినట్లు వ్యవసాయ అధికారులు తెలిపారు.