మక్తల్, మార్చి 9 : సంగంబండ రిజర్వాయర్ హై లెవె ల్ లెఫ్ట్ మెయిన్ కెనాల్ కింద వరి సాగు చేసిన రైతులకు నీళ్లు లేక చేతికి వచ్చిన పంట ఆగమవుతుందని రైతులు ఆవేదన చెందుతున్నారు. సంగంబండ పెద్దవాగుపై నిర్మించిన హై లెవెల్ లెఫ్ట్ మెయిన్ కెనాల్ పరిధిలో 29,900 ఎకరాలకు సాగునీరు అందించేలా ప్రణాళికలు రూపొందించారు. కాగా, కోటి ఆశలతో సాగు చేసిన పంటలు చేతికిరాకపోవడంతో రైతులకు ఏం చేయాలో పాలుపోని పరిస్థితి నెలకొన్నది.
అప్పులు చేసి పెట్టుబడి పెడితే ఎండిపోయిన పంటలతో దిక్కుతోచని స్థితిలో పడిపోయామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పంటలు ఎండిపోతున్నాయని అధికారులు, ప్రజాప్రతినిధులకు చెప్పినా ప్రయోజనం లేదు. కెనాల్‌కు రిజర్వాయర్ నుంచి నీటిని విడుదల చేసేందుకు చర్యలు చేపట్టాలని ఎమ్మెల్యే ఇంటి చుట్టూ ఎన్ని ప్రదక్షిణలు చేసినా పట్టించుకోవడం లేదని వాపోయారు. కాల్వకు నీళ్లు రాకపోవడం వల్ల దండు గ్రామానికి చెందిన వెంకట్‌రెడ్డి 7ఎకరాల్లో వరి సాగు చేయగా, నాలుగు ఎకరాలు ఇప్పటి వరకే ఎండిపోయింది. పక పొలం రైతు బోరు నీటిని రూ.20వేలకు కొనుగోలు చేసి రెండెకరాలకు పారించుకుంటున్నాడు. ఇప్పటికైనా స్పందించి పంటలను కాపాడాలని రైతులు కోరుతున్నారు.