గట్టు, ఫిబ్రవరి 14 : నెట్టంపాడు ఎత్తిపోతల పథ కం కింద సాగునీరు అందక గట్టు మండల రైతులు ఇబ్బందులు పడుతున్నారు. ఎప్పటి మాదిరిగానే యాసంగి పైర్ల సాగు చివరిదాకా నీరందుతుందని భావించిన గట్టు మండల రైతాంగం తమ పొలాల్లో వరిపైర్లను ఎక్కువ విస్తీర్ణంలో సాగుచేశారు. కొంతకాలం వారబంది ద్వారా సాగునీటి సరఫరా సవ్యం గా సాగింది. అయితే తదనంతరం సాగునీటి సరఫ రా నిలిచిపోవడంతో రైతులు అయోమయానికి గురవుతున్నారు. మండలంలో బోర్లు, బావుల కింద 3250 ఎకరాల్లో వరి వేరుశనగ సాగైంది. రైతుల ఇబ్బందులు తెలుసుకున్న ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి గట్టు మండలంలోని 107 ప్యాకేజీ కాల్వలను ఇటీవల పరిశీలించి రెండు రోజులపాటు నీటిని విడుదల చేయించారు.
ఆ నీరు పైర్లకు ఏమా త్రం సరిపోలేదు. దీంతో సాగునీటి కోసం రైతులు వారం, పదిరోజుల నుంచి అష్టకష్టాలు పడుతున్నా రు. ఎప్పుడెప్పుడు కాల్వ నీరు వస్తుందోనని వేయికండ్లతో ఎదురుచూస్తున్నారు. కాల్వలోని తోతట్టు ప్రాంతాల్లో గుంతలు ఏర్పాటు చేసుకుని మోటర్ల ద్వారా తాత్కాలికంగా తమ పంటలను కాపాడుకుంటున్నారు. ఇదిలావుండగా అధికారుల సమాధానం మాత్రం వేరేవిధంగా ఉన్నది.
నెట్టెంపాడు ఎత్తిపోత ల పథకంలో భాగంగా 105 ప్యాకేజీ డీ-5 వరకు మాత్రమే వారాబందీ ద్వారా సాగునీటిని వదులుతామని ఇదివరకే చెప్పామని, రైతులు అనవసరంగా పంటలు వేసుకున్నారని చెబుతున్నారు. తాము ఆరుతడి పంటలు వేసుకోమని సూచిస్తే, వరిపంట వేసుకుని రైతులు అనవసర ఇ బ్బందులు తెచ్చుకుంటున్నారంటున్నారు. కాగా గతంలో మాదిరిగా యాసంగిలో సాగునీరు అందుతుందని భావించడంతోపాటు ఏప్రిల్ 15వరకు సాగునీటి సరఫరా అవుతుందని అధికారులు చెప్పడంతోనే తాము రబీలో పైర్లను సాగుచేశామని రైతు లు చెబుతున్నారు.
ఈ పరిస్థితి ఇదిలాఉండగా ర్యాలంపాడు రిజర్వాయర్‌లో రోజురోజుకూ నీరు అడుగంటిపోతున్నది. తా జాగా 14వ తేదీ గురువారం వరకు రిజర్వాయర్‌లో నీటి నిల్వ 0.7 టీంఎంసీలుగా ఉన్నది. రిజర్వాయర్ పూ ర్తి నీటినిల్వ సామర్థ్యం 4 టీఎంసీలు ఉండగా, లీకేజీల కారణంగా 2టీఎంసీలకే కుదించారు. దీనికారణంగా 2టీఎంసీల నిల్వను కో ల్పోవడం రైతులకు శాపంగా మారింది. ఇదే ఇప్పు డు రైతులకు ఇబ్బందికర పరిస్థితి తలెత్తేలా చేస్తోందని అభిప్రాయపడుతున్నారు.
ఇదిలావుండగా జూరాలకు 4టీఎంసీలు వదలాలని మంత్రి జూపల్లితోపాటు జిల్లా ఎమ్మెల్యేలు కర్ణాటకకు వెళ్లి నీటి విడుదలకు సీఎం, సంబంధింత మంత్రులు అంగీకరించినట్లు చెప్పుకొచ్చారు. అది ఇంతవరకు కార్యరూపం దాల్చలేదు. జూరాలకు నీరు వచ్చి చేరితే పంపింగ్‌ను ప్రారంభించి ర్యాలంపాడు రిజర్వాయర్‌లోకి అవసరమ య్యే నీటిని నింపి యాసంగి గండాన్ని గట్టెక్కించాలనే ఆ లోచనలో ప్రజాప్రతినిధులు, అధికారులు ఉన్నారు. అయితే కర్ణాటక ప్రభుత్వం కరుణపైనే తెలంగాణ రైతుల భవిష్యత్ ఆధారపడి ఉంది. కాగా నీటి విడుదల జాప్యమయ్యే కొద్దీ చేతికొచ్చిన రైతుల పంటలు ప్రమాదంలో పడే అవకాశం ఉంది. తద్వా రా రూ.లక్షలు పెట్టుబడి పెట్టిన రైతుల పంటలు చేయిజారే అవకాశం ఉంది. ఈ విషయంలో ప్రజాప్రతినిధులు, అధికారులు స్పందించి పంటలు ఎం డిపోకుండా నీటిని విడుదల చేయించి తమ ప్రయోజనాలు కాపాడాలని రైతులు కోరుతున్నారు.
నాకు మొత్తం 12 ఎకరాల పొలం ఉన్నది. మూడు బోర్లు ఉన్నా వాటితో కొద్దికొద్దిగానే నీరు వస్తాయి. కాల్వ నీరు వస్తాయని నాలుగు ఎకరాల్లో వరి, మరో 4 ఎకరాల్లో మిర్చి, మూ డెకరాల్లో వేరుశనగ సాగు చేశా. కాల్వకు నీరు రానందున బో ర్ల ద్వారా పంటలకు అరకొరగానే నీరు అందిస్తున్నా. గిట్టుబాట ధర లేకపోవడంతోపాటు నీటి కొరత కారణంగా మిర్చి పంటను ఇటీవలనే ఎండగొట్టా.
– రజావలి, రైతు, మాచర్ల
నాకు ముక్కాలు ఎకరా పొలం ఉంది. ఇం దులో పొగాకు సాగుచేశా. ఎలాంటి బోరు సౌ కర్యం లేదు. కాల్వ ఆధారంగా పంట వేసినం. కాల్వతో నీరు రాకపోవడంతో పక్క రైతుల బోర్లతో నీటిని పారించుకుంటున్నా. పక్క రైతులు కూడా ఎంతవరకు నాకు నీరు ఇస్తరు. పంట ఎండిపోయే ప్ర మాదం ఉంది. ప్రజాప్రతినిధులు, అధికారులు ఆదుకుని కాల్వకు నీటిని విడుదల చేయాలి.
– నర్సింహులు, రైతు, గట్టు
జూరాల, నెట్టంపాడు కింద యాసంగిలో ఎంత విస్తీర్ణంలో పంటలు సాగుచేసుకోవాలో రైతులకు జనవరి మొదటి వారంలోనే మీడియా ద్వారా తెలియజేశాం. నెట్టంపాడు కింద 105 ప్యాకేజీ డీ-5 వరకు మాత్రమే వారబందీ ద్వారా సాగునీటిని అందిస్తామని చెప్పాం. రైతులు వినిపించుకోకుండా వివిధ ప్యాకేజీల కాల్వల కింద పైర్లను సాగుచేశారు. మానవతా ధృక్పథంతో సంక్రాంతి వరకు సాగునీటిని అందించాం. కర్ణాటక నుంచి జూరాలకు నీరు విడుదలైతే నీటిని విడుదల చేసే అవకాశాలు పరిశీలిస్తాం.
– రహీమొద్దీన్, పీజేపీ ఇన్చార్జి ఎస్ఈ