గద్వాల, మార్చి 27 : సర్కారు ముందు చూపులేక పోవడం, వర్షాలు వచ్చిన సమయంలో రిజర్వాయర్లు నింపుకోక పోవడం వల్ల ప్రస్తుతం రైతులు సాగు చేసిన పంటలకు సాగునీరు అందడం లేదు. దీంతో సాగు చేసిన పంటలు ఎండిపోవడంతో రైతులు లబోదిబో మంటున్నారు. వాస్తవంగా యాసంగి సాగుకు ముందే ప్రభు త్వం, ఇరిగేషన్ అధికారులు ఆయా ప్రాజెక్టుల్లో ఉన్న నీటి లభ్యత ఆధారంగా యాసంగి సాగు ప్రణాళిక రూపొందించాలి.
దీని కోసం ఐఏబీ (ఇరిగేషన్ అడ్వైజ్ బోర్డు) సమావేశం నిర్వహిం చి అందులో నిర్ణయం తీసుకోవాలి కానీ అధికారులు ఐఏబీ సమావేశం నిర్వహించకుండా సాగునీటి ప్రణాళిక రూపొందించడం, ఈ విషయం రైతులకు తెలియక పోవడంతో వారు ఇష్టారీతిగా పంటలు సాగుచేసినట్లు తెలిసింది. ప్రస్తుతం జూరాల ప్రాజెక్టులో అరకొర నీరు ఉండడం, వర్షాలు వచ్చిన సమయంలో రిజర్వాయర్లు నింపుకోక పోవడం, నెట్టెంపాడ్ ప్రాజెక్టు పరిధిలోని ర్యాలంపాడ్ రిజర్వాయర్లో పూర్తి స్థాయిలో నీరు అధికారులు నింపక పోవడం వల్ల దాని పరిధిలో 104 ప్యాకేజీ కింద రైతుల సాగు చేసిన పంటలకు సాగునీరు అంద క పంటలు ఎండి పోతున్నాయి.
కండ్ల ముందే చేతికి వచ్చిన పంటలు ఎండిపోతుంటే రైతుల కడుపులో మసి పోసినట్లు అవుతున్నది. పంట లు ఎండుతున్నా అటు అధికారులు, ఇటు ప్ర భుత్వం పట్టించుకోక పోవడంతో రైతులు దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. పంట నష్టం అంచనా వేసి పరిహారం చెల్లించాలని రైతులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. రైతులు తమ పం టలు ఎండి ఇబ్బందులు పడుతున్న అధికార పక్షం నాయకులు కనీసం పంటల పరిశీలన చేయకపోవడంపై గుర్రుగా ఉన్నారు. పంటలు కాపాడుతామని మంత్రితో పాటు ఎమ్మెల్యేలు కర్ణాటకు వెళ్లి హడావుడి చేశారే తప్పా తమ పంటలను కాపాడడానికి నీటిని విడుదల చేయించడంలో అందరూ విఫలమయ్యారం టూ రైతులు ఆరోపిస్తున్నారు.
నెర్రెలిచ్చిన భూములు
ర్యాలంపాడ్ రిజర్వాయర్ 104 ప్యాకేజీ పరిధిలో కొండాపురం,వెంకటాపురం, రంగాపు రం, గువ్వలదిన్నె, ఇర్కిచేడ్ గ్రామాల్లో సుమా రు 8వేల ఎకరాల్లో రైతులు వరి పంటను సాగు చేశారు. ప్రస్తుతం ఆ పంటలకు నీరు అందక సుమారు 3వేల ఎకరాలకుపైగా వరి పంటలు ఎండిపోయినట్లు రైతులు చెబుతున్నారు. బోర్ల కింద ఎకరా, అర ఎకరాకు నీరు పారితే ఆ పంటను మాత్రమే రైతులు కాపాడుకుంటున్నారు. పంటలు ప్రస్తుతం చేతికి వచ్చే దశలో ఉండగా నీరు సక్రమంగా అందక పోవడంతో భూములు నెర్రెలు బారాయి.
పంట పెరిగిన వరి కర్రలు మొత్తం తాళుగా ఉన్నాయి. దీంతో రైతులు పంట కోసి పశువులకు మేతగా వినియోగిస్తున్నారు. రెండు తడులు దిగువకు నీటిని విడుదల చేస్తే పంట మొత్తం చేతికి వచ్చేదని రైతులు వాపోతున్నారు. గత ప్రభుత్వ హ యాంలో ఎండని పంటలు ఇప్పుడు ఎందుకు ఎండుతున్నాయని రైతులు ఇరిగేషన్ అధికారులు, ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు. సర్కారుకు, అధికారులకు ముందుచూపు లేక పోవడం వల్లే ఇలాంటి పరిస్థితి తలెత్తిందని రైతులు ఆరోపిస్తున్నారు. కళ్ల ముందే పంట ఎండి పోయి పెట్టిన పెట్టుబడి అంతా బూడిదలో పోసిన పన్నీరవుతుంటే రైతుల కడుపు మండుతున్నది.
నాలుగెకరాలు సాగు చేస్తే ఎకరా మిగిలింది
మొత్తం నాలుగు ఎకరాల వరి పంట సాగు చేశా. ప్రస్తుతం మూడు ఎకరాల పంట పూర్తిగా ఎండిపోయింది. బోరు ఉన్నందుకు ఒక ఎకరా పంటకు నీరు పారడంతో దానిని కాపాడుకుంటున్నా. చివరి ఆయకట్టు వరకు నీటిని విడుదల చేయలేమని అధికారులు చెబితే మేము పంటలు సాగు చేసే వాళ్లం కాదు. నీళ్లు వస్తాయనే ఆశతో రైతులు వరిపంట సాగు చేశారు. పంట మొత్తం చేతికి వచ్చే దశలో ఎండిపోయింది. ప్రస్తుతం రైతుల పరిస్థితి ఆగమ్యగోచరంగా ఉంది. వారి బాధలు ఎవరికి చెప్పుకోవాలో తెలియడం లేదు. ప్రభుత్వం పంట నష్టపరిహారం అంచనా వేయించి రైతులను ఆదుకోవాలి. లేదంటే చావులే శరణ్యం.
– నర్సింహులు, రైతు, శివరంగాపురం
తొమ్మిది ఎకరాల్లో వరి ఎండి పోయింది
అన్నదమ్ములం అందరం కలిసి తొమ్మిది ఎకరాల్లో వరి సాగు చేశాం. పంట కోత దశకు వచ్చే సమయానికి నీరు కింది ఆయకట్టుకు రావడం లేదు. దీంతో తొమ్మిది ఎకరాల్లో పంట ఎండి పోయింది. ఎండిన పంటను పశువులకు మేతగా వాడుకుంటున్నాం. ఎకరాకు సుమారు రూ.30వేలకు పైనే పెట్టుబడి పెట్టాం. మొత్తం పెట్టుబడి రూ.3లక్షల వరకు అయింది. పెట్టుబడి అంత బూడిదలో పోసిన పన్నీరైంది. ఇటు ప్రభుత్వం రైతు భరోసా ఇవ్వక, సాగునీరు అందించక పోవడంతో రైతుల పరిస్థితి గందరగోళంగా తయారైంది. ప్రభుత్వం స్పందించి పంట నష్టం అంచనా వేసి రైతులకు పరిహారం చెల్లించాలి.
– ఎల్లప్ప,రైతు, వెంకటాపురం, కేటీదొడ్డి మండలం
పశువులకు మేతగా వాడుతున్నాం..
వరి పైరు చేతికి వచ్చే సమయంలో కింది పంటల వరకు నీరు రాలేదు. దీంతో సాగు చేసిన మూడు ఎకరాల వరి పంట పూర్తిగా ఎండిపోయింది. ఎండిపోయిన వరి పంటను పశువులకు మేతగా వాడుకుంటున్నాం. గతంలో ఎప్పుడూ ఇలాంటి పరిస్థితి రైతులు ఎదుర్కోన లేదు. గతంలో నీరు పుష్కలంగా ఉండడంతో పంటలు బాగా సాగు చేశాం. ఈ ఏడాది వరి పంట సాగు చేసిన రైతులందరూ నష్టపోయారు. ఇప్పటి వరకు అధికారులు పొలాల దగ్గరకు వచ్చి పంట నష్టం అంచనా వేయలేదు. ప్రభుత్వానికి, అధికారులకు రైతులంటే చులకనగా కనిపిస్తున్నారు.ప్రభుత్వం నష్టపరిహారం ఇచ్చి రైతులను ఆదుకోవాలి.
– నాగప్ప, రైతు, వెంకటాపురం, కేటీదొడ్డి మండలం