నవాబ్‌పేట, జూలై 19 : రేవంత్ ప్రభుత్వంలో రైతులు ఇబ్బందులు పడుతున్నారు. రైతు సంక్షేమాన్ని పట్టించుకోకపోవడంతో అరిగోస పడుతున్నారు. సాగునీరు మొదలు.. విత్తనాలు.. ఎరువులు.. పండిన పంట విక్రయించేందుకు నానా పాట్లు పడుతున్నారు. వానకాలం సీజన్లో జొన్న, మొక్కజొన్న పంటలు సాగు చేయగా.. ప్రస్తుతం కళకళలాడుతున్నాయి. కానీ వాటికి సరైన సమయంలో వేసేందుకు యూరియా అందుబాటులో లేక అగచాట్లు పడుతున్నారు.
చాలా చోట్ల అరకొరగా సరఫరా చేస్తుండడంతో కొరత తీవ్రంగా వేధిస్తున్నది. ఈ క్రమంలో శనివారం మహబూబ్‌నగర్ జిల్లా నవాబ్‌పేట మండలంలో పోలీస్ పహారా మధ్య యూరియాను రైతులకు పంపిణీ చేశారు. సింగిల్‌విండో కార్యాలయానికి 600 బస్తాల యూరియా రాగా.. విషయం తెలుసుకొన్న పలు గ్రామాల రైతుల పెద్ద ఎత్తున మండల కేంద్రానికి చేరుకున్నారు. పెద్దమొత్తంలో తరలిరావడంతో కార్యాలయ ఆవరణలో ఉద్రిక్తత నెలకొన్నది.
కర్షకులు ఒక్కసారిగా ఎగబడడంతో విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడకు చేరుకొని రైతులను సముదాయించారు. అనంతరం క్యూలైన్లో నిల్చోబెట్టి పంపిణీ ప్రక్రియ కొనసాగించారు. దీంతో గంటల తరబడి బారులు తప్పలేదు. మహిళా రైతులకు సైతం ఇబ్బందులు తప్పలేదు. మండల కేంద్రంలో వివిధ ఫర్టిలైజర్ దుకాణాల్లో యూరియా ఉన్నా.. బస్తా రూ.350 నుంచి రూ.370 వరకు విక్రయిస్తుండడంతో రైతులు ఆసక్తి చూపలేదు.
కాగా రైతుల యూరియా కష్టాలపై న్యూస్ కవరేజీకి వెళ్లిన ఓ న్యూస్ చానల్ ప్రతినిధిపై చిర్రుబుర్రుమన్నట్లు తెలిసింది. ఎక్కువ ఫొటోలు తీస్తే.. పోలీసులకు ఫిర్యాదు చేస్తా అని ఏఈవో బెదిరించినట్లు సదరు రిపోర్టర్ తెలిపాడు. ఈ విషయమై ఏఈవోను వివరణ కోరగా తాను ఎవరిపై ఆగ్రహం వ్యక్తం చేయలేదని చెప్పుకొచ్చారు.