అలంపూర్ చౌరస్తా, నవంబర్ 6 : ఆరుగాలం కష్టపడి పండించిన పంటను అమ్ముకుందామని వస్తే సీసీఐ అధికారుల ఇష్టానుసారంగా తేమ శాతం పరీక్షలు చేసి వాహనాలను వెనక్కి పంపడం సరైన పద్ధతి కాదని పత్తి రైతులు సీసీఐ అధికారులపై రైతులు ఆగ్రహించారు. గురువారం సాయంత్రం ఉండవెల్లి మండలం 44వ జాతీయ రహదారిపై ఉన్న వరసిద్ధి వినాయక కాటన్ మిల్లులో సీసీఐ అధికారుల నిర్లక్ష్య దోరణితో వ్యవరించడంతో ఆగ్రహించిన రైతన్నలు జాతీయ రహదారిపై బైఠాయించారు. లక్షల రూపాయలు అప్పులు చేసి పొలాలపై పెట్టుబడులు పెట్టామని, భారీ వర్షాల కారణంగా పంటలు పండక వచ్చిన దిగుబడిని అమ్ముకుందామంటే ప్రభుత్వ నిర్లక్ష్యం, సీసీఐ అధికారుల ఇష్టానూసారంతో రైతులు నట్టేట మునుగుతున్నామన్నారు.
భారీ వర్షాల వల్ల పొలాల్లో పత్తి తడవడంతో ఇండ్ల దగ్గర ఇబ్బందులు పడుతూ ఆరబెట్టుకుని అమ్ముకుందామని వస్తే సీసీఐ అధికారులు మాత్రం తేమశాతం ఎక్కువ ఉందని, పత్తి పనికి రాదని వాహనాలను వెనక్కి పంపుతున్నారని అధికారుల తీరుపై మండిపడ్డారు. ఒక వైపు ఎకరాకు 7క్వింటాళ్లు మాత్రమే కొంటామని, మరోవైపు తేమశాతం ఎక్కువ అంటూ పత్తి రైతులను తీవ్ర ఇబ్బందులను గురి చేస్తున్నారని అన్నారు. బయట లక్షల రూపాయాలు అప్పులు తెచ్చి పంటలు సాగు చేశామని కానీ సరైన దిగుబడి లేదు. వచ్చిన పంటను అమ్ముకున్న అ డబ్బులు కూలీలు, ఎరువుల వారికే సరిపోతున్నాయని అన్నారు. రైతులు ఎన్నో ఇబ్బందులు పడుతున్నా ప్రభుత్వం చూసీచూడనట్లు వ్యవహరిస్తుందని ఇదెక్కడి ప్రభుత్వామని రైతులు ఆగ్రహించారు.
ఏ రాష్ట్రంలోనైనా రైతులను ప్రభుత్వాలు ఆదుకుంటాయి. కానీ తెలంగాణలో మాత్రం రైతులను ప్రభుత్వం ఆదుకోవడం లేదని అన్నారు. సుమారు అరగంట పాటు జాతీయ రహదారిపై రైతులు బైఠాయించడంతో ఎక్కడి వాహనాలు అక్కడే నిలిచిపోయాయి. సమాచారం అందుకున్న సీఐ రవిబాబు, ఎస్సైలు, సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని రైతులతో మాట్లాడారు. ఇలా జాతీయ రహదారిపై ధర్నా చేయకూడదని వేల వాహనాలు, అంబులెన్స్‌లు వెళ్తూ ఉంటాయని ఏదైనా సమస్య మీకు వస్తే అధికారుల దగ్గరికి వెళ్లాలని రైతులకు నచ్చజెప్పారు. అధికారులతో మాట్లాడి మీ సమస్యను పరిష్కరిస్తామని చెప్పడంతో రైతులు శాంతించారు.