మాగనూరు, జనవరి 11 : విద్యుత్ సరఫరాలో అంతరాయం, లో వోల్టేజీ సమస్య తీర్చాలని కొల్పూరు, మందిపల్లి, పుంజనూరు, మూడుమాల్, గజ్రందొడ్డి గ్రామాలకు చెందిన రైతులు శనివారం కొల్పూర్ సబ్‌స్టేషన్ ఎదుట నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా కొల్పూర్ లిఫ్ట్ ప్రెసిడెంట్ స్వామిగౌడ్ మాట్లాడుతూ మూడునెలలుగా లోవోల్టేజీ సమస్యతో రైతులు చాలా ఇబ్బందులు పడుతున్నారని దీంతో బోర్లు కాలిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. సమస్యను కొల్పూర్ లైన్మెన్ దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోకపోవడంతో ఐదు గ్రామాల రైతులు కలిసి సబ్‌స్టేషన్‌ను ముట్టడి చేసి లైన్‌మెన్‌తో వాగ్వాదానికి దిగినట్లు తెలిపారు.
విద్యుత్ కోతలను అరికట్టి సక్రమంగా సరఫరా అందించాలని డిమాండ్ చేశారు. ఈ విషయంపై కొ ల్పూర్ లైన్మెన్ మన్యం శెట్టిని వివరణ కోరగా గతేడాది నుంచి సబ్‌స్టేషన్ మెయింటనెన్స్‌కు నోచుకోవడం లేదని దీంతో సబ్‌స్టేషన్‌లో లూజ్ కనెక్షన్స్తో ఏర్పడి స్పారింగ్స్ రావడంతో విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడుతుందని తెలిపారు. ఇదే విషయంపై మాగనూరు మండల విద్యుత్ అధికారిని వివరణ కోరగా కొల్పూరు సబ్స్ట్టేషన్ అంతా బాగానే ఉందని ఏదో చిన్న పొరపాటు వల్ల సమస్యలు వస్తున్నాయని అవి కూడా త్వరలో పరిషరిస్తామని చెప్పారు.