వనపర్తి, డిసెంబర్ 2 (నమస్తే తెలంగాణ) : పొలానికి బాట ఇవ్వకుండా తన అన్న అడ్డుకోవడం.. అధికారులకు చెప్పినా పట్టించుకోవడం లేదంటూ.. మనస్తాపంతో రైతు కలెక్టరేట్లో ప్రజావాణిలో ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన సంఘటన వనపర్తిలో చోటు చేసుకున్నది. గోపాల్పేట మండలం ఏదుట్లకు చెందిన నరెడ్ల వెంకట్రామారెడ్డికి శేఖర్‌రెడ్డి, సాయిరెడ్డి, రామేశ్వర్‌రెడ్డి ముగ్గురు కొడుకులు. వెంకట్రామారెడ్డికి గ్రామ శివారులో రెండు చోట్ల 11 ఎకరాల పొలం ఉండగా.. ముగ్గురు కొడుకులు పంచుకున్నారు. ఇందులో రామేశ్వర్‌రెడ్డి వాటా ను విక్రయిస్తే సాయిరెడ్డి తీసుకున్నాడు.
అయితే సర్వేనెంబర్ 135లో ఉన్న చెలకలో సాయిరెడ్డి పొలానికి బాట లేదంటూ అన్న శేఖర్‌రెడ్డి అడ్డుకోగా ఆరు నెలలుగా బీడుగా మారింది. ఈ విషయమై గ్రామ పెద్దలు, రెవెన్యూ అధికారుల దృష్టికి సాయిరెడ్డి తీసుకెళ్లాడు. గ్రామ పెద్దలు చెప్పే యత్నం చేసినా శేఖర్‌రెడ్డి వినలేదు. గత వారం వనపర్తికి వచ్చి ప్రజావాణిలో ఫిర్యాదు చేసి వారం గడిచినా ఎలాంటి పురోగతి లేదని మళ్లీ సోమవారం కలెక్టరేట్‌కు వచ్చాడు. వెంట తెచ్చిన దరఖాస్తును అక్కడి ఉద్యోగులు లాగేసుకొని సాయిరెడ్డిని బయటకు పంపే ప్రయ త్నం చేశారు.
మనస్తాపం చెందిన రైతు వెంట ప్లాస్టిక్ కవర్లో తెచ్చుకున్న పాల్డన్ పౌడర్‌ను తాగి కిందపడ్డాడు. వెంటనే పోలీసులు గమనించి దవాఖానకు తరలించగా చికిత్స పొందుతున్నాడు. ఇదిలా ఉంటే.. ఫిర్యాదు చేసేందుకు వెళ్లిన సాయిరెడ్డి చేతిలో నుంచి దరఖాస్తు పేపర్లను కలెక్టర్‌కు ఇవ్వకుం డా లాగేసుకున్నారని తెలిసింది. కాగా గత నెల 25న ప్రజావాణిలో సాయిరెడ్డి చేసిన ఫిర్యాదు తమకు అందిందని, రెండు, మూడ్రోజుల్లో సర్వేయర్‌ను ఏదుట్లకు పంపిస్తామని గోపాల్పేట తాసీల్దార్ తిలక్‌కుమార్‌రెడ్డి తెలిపారు. కాగా దవాఖానలో చికిత్స పొందుతున్న సాయిరెడ్డిని ప్రణాళికా సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు చిన్నారెడ్డి పరామర్శించారు. సమస్య ఉంటే పరిష్కరించుకోవాలని.. ఇలాంటి ప్రయత్నం చేయొద్దని సూచించారు.
ఆరు నెలలుగా మా పొలానికి బాట లేదని ఇబ్బందులకు గురి చేస్తుంటే మా సమస్యను ఎవరూ పట్టించుకోవడం లేదు.గ్రామ పెద్దలు, గోపాల్పేట రెవెన్యూ అధికారుల దృష్టికి తీసుకెళ్లినా మా గోడును ఆలకించేవారే కరువయ్యారు. చేసేది లేక పొలం బీడు పెట్టుకున్నం. ప్రజావాణిలో దరఖాస్తు అందించినా అధికారులు చొరవ చూపడం లేదు. ఎప్పుడూ ఏదో ఒక పని అంటూ దాటవేసుకుంటూ వెళ్తున్నారు. తమకు న్యాయం చేయాల్సిన వాళ్లు ఇలా తప్పించుకుని తిరిగితే ఎవరికి చెప్పుకోవాలి. అధికారులు చట్టప్రకారం న్యాయం చేయండి..
– యాదగిరిరెడ్డి, బాధిత రైతు కుమారుడు, ఏదుట్ల, గోపాల్పేట మండలం