నారాయణపేట : జిల్లా కలెక్టరేట్ ఎదుట ఓ రైతు ఆత్మహత్యాయత్నానికి ( Suicide Attempt ) పాల్పడ్డాడు. తన పేరిట రావాల్సిన 31 గుంటల భూమి కోసం అధికారుల చుట్టూ తిరిగినా పరిష్కారం కాకపోవడంతో ప్రతి సోమవారం కలెక్టరేట్లో నిర్వహించే ప్రజావాణి( Prajavani ) ఎదుట దామరగిద్ద మండలం క్యాతన్ పల్లి గ్రామానికి చెందిన నడిమింటి కనకప్ప అనే రైతు పురుగుల మందు తాగాడు.
గమనించిన సెక్యూరిటీ సిబ్బంది అప్రమత్తమై అతని చేతిలోని పురుగుల మందు డబ్బాను లాక్కొని రైతును హుటాహుటిన జిల్లా ఆసుపత్రికి తరలించారు. రైతు ఆరోగ్య పరిస్థితి ప్రస్తుతం నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. తనకు చెందిన 31 గుంటల భూమి తన అన్న పెద్ద కనకప్ప భార్య హనుమమ్మ కబ్జాలో ఉందని, ఈ విషయంపై గ్రామస్థాయిలో పలుమార్లు పంచాయతీలు జరిగినప్పటికీ సమస్య పరిష్కారం కాలేదని బాధితుడు పేర్కొన్నాడు. గత 40 ఏళ్లుగా భూమి తమ అధీనంలోనే ఉందని, కేవలం బెదిరించడానికి ఆత్మహత్యా యత్నం చేశారని పెద్ద కనకప్ప కుటుంబీకులు ఆరోపించారు.