కల్వకుర్తి రూరల్, మార్చి 19 : కల్వకుర్తి ప్రభుత్వ దవాఖానలో ప్రసవం అనంతరం వైద్యుల నిర్లక్ష్యం కారణంగా మృతి చెందిన శ్యామల(25) కుటుంబానికి న్యాయం చేయాలని బుధవారం ప్రభుత్వ దవాఖాన ఎదుట మృతురాలి కుటుంబసభ్యులు ధర్నా నిర్వహించారు. శ్యామల కుటుంబసభ్యులు తెలిపిన వివరాల ప్రకారం… రంగారెడ్డి జిల్లా తలకొండపల్లి మండలం రాంపూర్ గ్రామానికి చెందిన శేఖర్‌గౌడ్ భార్య శ్యామల ఈ నెల 17న కాన్పు కోసం కల్వకుర్తి ప్రభుత్వ దవాఖానకు రాగా వైద్య సిబ్బంది పరీక్షలు నిర్వహించి ఆమెను అడ్మిట్ చేసుకున్నారు.
మంగళవారం శ్యామలకు రక్తం తక్కువగా ఉండడంతో జిల్లా కేంద్రం నుంచి రక్తం తీసుకురావాలని వైద్య సిబ్బంది సూచించడంతో శేఖర్ రక్తం తీసుకురావడానికి వెళ్లి వచ్చే సరికి శ్యామలకు ఆపరేషన్ నిర్వహించారు. ఆపరేషన్ అయిన కొంత సమయానికే ఆమెకు తీవ్రంగా బ్లీడింగ్ అవ్వడంతో హైదరాబాద్‌కు తీసుకువెళ్లాలని రెఫర్ చేశారు. ఈక్రమంలో హైదరాబాద్‌కు తరలించేందుకు 108 అంబులెన్స్ ఉన్నా వాహనం డ్రైవర్ రావడంలో ఆలస్యం కావడంతో ఆమెను హైదరాబాద్‌కు తరలిస్తుండగా మార్గమధ్యంలోనే శ్యామల మృతి చెందింది.
శ్యామల మృతి చెందడానికి వైద్యుల నిర్లక్ష్యం, 108 అంబులెన్స్ డ్రైవర్ నిర్లక్ష్యమే కారణమని ఆరోపించారు. ఈ మేరకు బుధవారం దవాఖాన ఎదుట ప్రధాన రహదారిపై ఆందోళన నిర్వహించారు. ఈ సందర్భంగా మృతురాలి కుటుంబానికి రూ.50లక్షల ఎక్స్‌గ్రేషియా చెల్లించడంతోపాటు కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉ ద్యోగం ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఆందోళన విషయం తెలుసుకున్న వెల్దండ సీఐ విష్ణువర్దన్‌రెడ్డి, ఎస్సైలు మాధవరెడ్డి, మహేందర్, కురుమూర్తి, కృష్ణదేవరాయలతో పాటు పోలీస్ సిబ్బంది దవాఖాన వద్దకు చేరుకుని మృతురాలి కుటుంబ సభ్యులను నచ్చజెప్పి ధర్నాను విరమింపజేశారు. కల్వకుర్తి ప్రభుత్వ దవాఖాన వైద్యసిబ్బంది నిర్లక్ష్యాన్ని బీఆర్ఎస్నాయకులు ఖండించారు.
జాతీయ స్థాయి ఖోఖోకు ఉపాధ్యాయురాలు ఎంపిక
మాగనూర్, మార్చి 19: ఆల్ ఇండియా సివిల్ సర్వీ సు జాతీయ స్థాయి ఖోఖో పోటీలకు మాగనూరు మండలకేంద్రానికి చెందిన ఉపాధ్యాయురాలు దీప(ఎస్జీటీ) ఎంపికైనట్లు డీవైఎస్వో వెంకటేశ్ శెట్టి బుధవారం ప్రకటనలో తెలిపారు. జనవరి 23, 24 తేదీల్లో సికింద్రాబాద్ జింఖాన మైదానంలో నిర్వహించిన ఆల్ ఇండియా సివి ల్ సర్వీస్ మహిళా రాష్ట్రస్థాయి ఖోఖో పోటీల్లో పాల్గొని ప్రతిభ కనబర్చి జాతీయ స్థాయి పోటీలకు ఎంపికైంది. రాష్ట్ర జట్టు తరఫున ఈనెల 21నుంచి 24వరకు ఢిల్లీలో నిర్వహించే జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొననున్నారు.