కార్యదర్శి పోస్ట్ బీసీకి వస్తుందా..?
డిస్ట్రిక్ క్లబ్ ఎన్నికల్లో మితిమీరిన రాజకీయ జోక్యం కనిపిస్తోంది. జిల్లా క్లబ్ అధ్యక్షుడిగా రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వ్యక్తిని ఏకగ్రీవం చేసిన.. కార్యదర్శి విషయంలో బీసీకి ఇవ్వడానికి ససేమిరా అంటున్నారు. దీంతో డిస్ట్రిక్ట్ క్లబ్లో రాజకీయ జోక్యంపై మాజీ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ ఫైర్ అయ్యారు. సామాజిక న్యాయం పాటించాలని కార్యదర్శి పదవి బీసీకి కేటాయించాలని పట్టుబట్టారు. ఈ పదవికి పోటీపడుతున్న సంజీవ్ ముదిరాజ్‌కు మద్దతుగా నామినేషన్లు వేసిన మల్లు నరసింహారెడ్డి, యాదాద్రిరెడ్డిలను చివరి నిమిషంలో విత్‌డ్రా చేయించారు. అయితే ఆలస్యంగా ఉపసంహరించుకున్నారని కొత్త డ్రామాకు తెర లేపారు. నామినేషన్లు ఉపసంహరించుకున్న వాటిని పరిగణలోకి తీసుకుంటారా? కార్యదర్శి పదవి బీసీకి ఇస్తారా? మళ్లీ రాజకీయం చేస్తారా? అనేది వేచి చూడాల్సిందే.. ఎన్నడూ లేని విధంగా డిస్టిక్ క్లబ్ ఎన్నికల్లో సభ్యుల మధ్య విభేదాలు బజారున పడుతున్నాయి.
మహబూబ్‌నగర్, అక్టోబర్ 14 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : పాలమూరు డిస్ట్రిక్ట్ క్లబ్ ఎన్నికల్లో కొత్త కార్యవర్గం ఎన్నిక అనేక మలుపులు తిరుగుతోంది. అధ్యక్ష పదవికి పోటీపడిన అధికార పార్టీ నేతలకు బీజేపీ ఎంపీ డీకే అరుణ షాక్ ఇవ్వడం దుమారం లేపుతోంది. చివరి నిమిషంలో మధ్యవర్తి పాత్రను తెరమీదకి తీసుకువచ్చి ఇటు ఎంపీ అటు ఎమ్మెల్యే క్లబ్ కార్యవర్గంలో తల దూర్చడంతో ఆశావహులు ఖంగుతిన్నారు. కేవలం అధ్యక్ష పదవికి మాత్రమే మధ్యవర్తిత్వం వహించిన పెద్దమనిషి మిగతా కార్యవర్గ విషయంలో పత్తా లేకుండా పోవడంతో సభ్యులు రుసరుసలాడుతున్నారు. డిస్ట్రిక్ క్లబ్ అధ్యక్ష పదవికి ఓ ప్రజాప్రతినిధి అండతో అధికార పార్టీకి చెందిన ఇద్దరు నేతలు తీవ్ర ప్రయత్నం చేశారు.
చివరి నిమిషంలో టీఎన్జీవో మాజీ జిల్లా అధ్యక్షుడు రాజేందర్‌రెడ్డికి ఇస్తారని భావించారు. అయితే అనూహ్యంగా ఎంపీడీకే అరుణ జోక్యం చేసుకోవడం.. ఎమ్మెల్యే మధ్యవర్తి ద్వారా పరిష్కరించుకోవాలని చెప్పడం చకచకా జరిగిపోయాయి. దీంతో డిస్ట్రిక్ట్ క్లబ్ ఎన్నికల్లో బీజేపీ మద్దతుదారుడైన నాగేశ్వర్‌రెడ్డికి అధ్యక్ష పదవిని ఇప్పించడంలో ఎంపీ డీకే అరుణ సక్సెస్ అయ్యారు. అధికార పార్టీని కాదని బీజేపీకి చెందిన వ్యక్తికి జిల్లా క్లబ్ పగ్గాలు అప్పగించడం.. మిగతా కార్యవర్గం తేల్చకుండా తన్నుకు చావండి అంటూ మధ్యవర్తి జారుకోవడంతో క్లబ్ ఎన్నికలు సభ్యుల మధ్యచిచ్చు రేపుతున్నాయి. పదవులపై ఆశ పెట్టుకున్న అనేకమంది పోటీలో ఉంటామని తమ సత్తా ఏందో చూపిస్తామని సవాళ్లు విసురుకుంటున్నారు. మరోవైపు జిల్లా క్లబ్ ఎన్నికలను రాజకీయ రంగు పులిమారని గుసగుసలు వినిపిస్తున్నాయి.
అక్రమ నిర్మాణంపై ఆరా..
ఒకవైపు జిల్లా క్లబ్ ఎన్నికలు పార్టీల మధ్య చిచ్చు రేపుతుంటే మరోవైపు కోట్లు ఖర్చుపెట్టి నిర్మించిన ఈ భవనానికి అసలు అనుమతులు లేవన్న విషయం బయటికి రావడంతో అధికార యంత్రాంగం ఆరా తీస్తున్నారు. ఇప్పటికే ఈ వ్యవహారం రాష్ట్ర మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ వరకు వెళ్లడం.. విజిలెన్స్ యంత్రాంగం కూడా దీనిపై దృష్టి పెట్టడంతో కొత్త భవనంపై నీలినీడలు కమ్ముకున్నాయి. ఇది పూర్తి అవుతుందా లేక.. మధ్యలోనే ఆగిపోతుందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. డిస్ట్రిక్ క్లబ్ అనుమతి లేకుండా కట్టారని విషయంపై స్థానిక నగరపాలక సంస్థ రాష్ట్ర మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ విభాగానికి సమాచారం చేరవేసినట్లు తెలుస్తోంది. అయితే ఈ వ్యవహారంపై చూసి చూడనట్లు వ్యవహరించాలని ప్రజాప్రతినిధులు ఒత్తిడి చేస్తున్నట్లు తెలుస్తోంది. మొత్తంపైన జిల్లా క్లబ్ ఎన్నికల్లో రాజకీయ జోక్యం మితిమీరి పోయిందనే దానికి అధ్యక్షుడి ఎన్నికే నిదర్శనమని అంటున్నారు.