ఊట్కూర్ : చట్టాలపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని న్యాయ సేవాధికార సంస్థ చీఫ్ లీగల్ ఎయిడ్ కౌన్సిల్ సభ్యుడు లక్ష్మీపతి గౌడ్ ( Lakshmipati Goud ) అన్నారు. జిల్లా న్యాయ సేవ అధికార సంస్థ ఆధ్వర్యంలో మంగళవారం నారాయణపేట ( Narayanapet ) జిల్లా ఊట్కూర్ మండలంలోని పెద్దజట్రం, అవుసలోనిపల్లి గ్రామాల్లో న్యాయ విజ్ఞాన సదస్సులు ( Legal knowledge ) నిర్వహించి వివిధ చట్టాలపై ప్రజలకు అవగాహన కల్పించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లా న్యాయ సేవ అధికార సంస్థ ఆధ్వర్యంలో రెండు రకాల సేవలను ఉచితంగా పొందవచ్చని తెలిపారు. రూ. 3 లక్షల లోపు ఆదాయం కలిగిన ఎస్సీ, ఎస్టీలు ఉచితంగా ఒక లాయర్‌ను ఏర్పాటు చేసుకోవచ్చని సూచించారు. ప్రతి పౌరుడు ఉచిత న్యాయ సలహాల కోసం 15100 టోల్ ఫ్రీ ( Toll Free ) నెంబర్ కు ఫోన్ చేసి వివరాలు తెలుసుకోవచ్చని తెలిపారు.
రాజ్యాంగం కల్పించిన హక్కులను ఎవరూ కూడా ధిక్కరించరాదని, ప్రతి ఒక్కరూ చట్టానికి అనుగుణంగా నడచుకోవాలని సూచించారు. బాల్యవివాహాలు, ఫొక్సో, రైతు చట్టాల గురించి వివరించారు. లీగల్ ఎయిడ్ అసిస్టెంట్ కౌన్సిల్ సభ్యులు నాగేశ్వరి మాట్లాడుతూ ప్రతి ఒక్కరు సెల్‌ఫోన్‌కు దూరంగా ఉండి పిల్లల ప్రవర్తనపై దృష్టి పెట్టాలని, ప్రతి రోజు పిల్లలకు మంచి ఆహారం ఇవ్వాలని, వారి అవసరాలు తీర్చడానికి కృషి చేయాలన్నారు.
ఈ కార్యక్రమంలో సామాజిక కార్యకర్త నారాయణ, చైల్డ్ లైన్ సిబ్బంది శ్రావణ్ కుమార్, తిరుపతయ్య, హాజమ్మ, సుకన్య, వర్ష, ఉమ, చెన్నప్ప, భీమమ్మ, అంగన్వాడీ, ఆశ కార్యకర్తలు పాల్గొన్నారు.