కొత్తకోట, ఫిబ్రవరి 18 : క్రీడలపై ఆసక్తి గల ప్రతి ఒక్కరు ఉన్నత శిఖరాలను అధిరోహించవచ్చని మాజీ సీడీసీ చైర్మన్ బీసం చెన్నకేశవరెడ్డి అన్నారు. కొత్తకోట పట్టణంలో ఐదవరోజు కొనసాగుతున్న క్రికెట్ పోటీల్లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని పాస్ వేసి ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ క్రీడలను ప్రతి ఒక్కరు అలవర్చుకోవాలని చెప్పారు. క్రీడల పట్ల యువత శ్రద్ధ వహించాలన్నారు. క్రీడల వలన ఎందరెందరో ఉన్నత శిఖరాలకు చేరుకొని ఒక ఉన్నతమైన స్థాయిలో స్థిరపడిన వారు ఉన్నారని పేర్కొన్నారు. క్రీడల వల్ల వ్యక్తిగత జీవితంలో ఉన్నతమైన మార్పు వస్తుందని తెలిపారు. అనంతరం క్రీడాకారులతో కరచాలనం చేసి వారిని ప్రోత్సహించారు. కార్యక్రమంలో కేపీఎల్ నిర్వాహకులు నవీన్ కుమార్ రెడ్డి, బాలకృష్ణారెడ్డి, గుంత శివ, రఘు, కార్తీక్, సాయి, సన్నీ, మహేష్, శివశంకర్, తరుణ్, గణేష్, అరుణ్, జగదీష్ తదితరులు పాల్గొన్నారు