లింగాల, ఫిబ్రవరి 22 : స్థానిక సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో ఆదివారం నిర్వహించిన గురుకుల ప్రవేశ పరీక్ష ఆలస్యంగా ప్రారంభమవడంతో కేంద్రం వద్ద విద్యార్థులు, తల్లిదండ్రులు ఆందోళనకు దిగారు. వివరాల్లోకి వెళితే.. 2026-27 విద్యా సంవత్సరానికి గాను సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో 8వ తరగతి ప్రవేశ పరీక్షలు రాష్ట్ర వ్యాప్తంగా ఆదివారం ప్రారంభమయ్యాయి. స్థానిక గురుకుల పాఠశాలలో పరీక్షా కేంద్రం ఏర్పాటు చేయగా దాదాపు 510మంది విద్యార్థులకు గానూ 483 మంది విద్యార్థులు హాజరయ్యారు.
పరీక్షా కేంద్రానికి 7వ తరగతి ప్రశ్నాపత్రాలకు బదులుగా 8వ తరగతి ప్రశ్నాపత్రాలు రావడంతో ఉదయం 11గంటలకు ప్రారంభం కావాల్సిన పరీక్ష దాదాపు 3గంటల పాటు ఆలస్యంగా ప్రారంభమైంది. దీంతో ఆగ్రహించిన విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళనకు దిగి రోడ్డుపై బైఠయించి రాస్తారోకో చేశారు. తమ పిల్లలు ఉదయం అల్పాహారం చేయకుండా పరీక్ష రాయడానికి వెళ్లారని, ఇన్ని గంటల పాటు ఆలస్యమైతే ఖాళీ కడుపుతో పరీక్ష ఎలా రాస్తారని ఆవేదన వ్యక్తం చేశారు. పాఠశాల ఆవరణలో తాగునీటి సౌకర్యం కూడా లేదని వాపోయారు. దీంతో పాఠశాల ప్రిన్సిపాల్ శ్రీనివాసులు గేటు దగ్గరకు వచ్చి విద్యార్థులకు అరటి పండ్లు, బిస్కెట్లు ఇవ్వడమే కాకుండా పరీక్ష ముగిసిన అనంతరం భోజన వసతి కల్పిస్తామని తల్లిదండ్రులకు నచ్చజెప్పడంతో ఆందోళన విరమించారు.
విషయం తెలుసుకున్న సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలల రాష్ట్ర అధికారిణి నిర్మల వెంటనే పరీక్ష కేంద్రాన్ని సందర్శించి ప్రశ్నాపత్రాల జాప్యాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పరీక్షా కేంద్రానికి వచ్చిన ప్రశ్నాపత్రాలు తారుమారయ్యాయని, తెలకపల్లి, కల్వకుర్తి కేంద్రాలకు వెళ్లి ప్రశ్నాపత్రాలు తీసుకొని వచ్చే లోపు జాప్యం జరిగినట్లు తెలిపారు. ఇందులో ప్రిన్సిపాల్, పరీక్ష సిబ్బంది నిర్లక్ష్యమేమీ లేదని, ప్రింటింగ్ ప్రెస్ వారే నిర్లక్ష్యం చేశారని, విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఆమె తెలిపారు. అనంతరం పరీక్షా కేంద్రం వద్ద ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా అచ్చంపేట ఎస్సై సద్దాం ఆధ్వర్యంలో పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు.
ప్రభుత్వాధికారుల తడబాటు..
ధరూరు, ఫిబ్రవరి 22 : మండలంలోని మార్లబీడులో నెట్టెంపాడు ఎత్తిపోతల పేజ్-2 క్వార్టర్స్‌లో నిర్వహింపబడుతున్న కేటిదొడ్డి మండల గురుకుల పాఠశాలలో ఆదివారం నిర్వహించిన గురుకుల ప్రవేశ పరీక్షలో నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఆరో తరగతి ప్రవేశ పరీక్ష పేపర్‌కు బదులుగా మరో తరగతి ప్రవేవ పరీక్షకు సంబంధించిన పశ్నాపత్రాలు రావడంతో ఉదయం పదకొండు గంటలకు ప్రా రంభమవ్వాల్సిన పరీక్ష మధ్యాహ్నం రెండు గంటలకు కూడా ప్రారంభం కాలేదు. దీంతో అధికారులు తల లు పట్టుకున్నారు. విషయం తెలియడంతో పరీక్ష కేంద్రం బయట ఉన్న విద్యార్థుల తల్లిదండ్రులు అధికారులతో వాగ్వివాదానికి దిగా రు. పరిస్థితి విషమించడంతో పోలీసులు రంగ ప్రవేశం చేసి గొడవను సద్దుమణిగించారు.
11 గంటలకు ప్రారంభం కావాల్సిన పరీక్ష ఆలస్యంగా ప్రారంభం కావడంతో పాఠశాల విద్యార్థులకు వండిన భోజనాన్ని ప్రవేశ పరీక్షకు వచ్చిన విద్యార్థులకు పెట్టారు. చివరకు గద్వాలలోని మరో పరీక్షా కేంద్రం నుంచి ప్రశ్నాపత్రాలను జిరాక్స్ తీసుకు వచ్చి మధ్యాహ్నం మూడు గంటలకు పరీక్ష నిర్వహించారు. పోలీసుల చేత తల్లిదండ్రులను అదుపు చేయించి విద్యార్థుల చేత పరీక్ష రా యించడంపై విద్యార్థుల తల్లిదండ్రులు పోలీసులపై మండిపడ్డారు. నిర్లక్ష్యంగా వ్యవహరించిన అధికారుల మీద చర్యలు తీసుకోవాల్సింది పోయి మా మీద మీ ప్రతాపమేంటని గొడవకు దిగారు. ఉదయం 11గంటలకు రెం డు నిమిషాలు ఆలస్యంగా వచ్చిన విద్యార్థిని లోపలికి అనుమతించలేదని, మరి మధ్యా హ్నం మూడు గంటలకు పరీక్షలు నిర్వహించిన అధికారులను ఏం చేస్తారో చెప్పాలన్నా రు. ఇంత జరిగినా జిల్లా విద్యాశాఖ అధికారులు గాని, కలెక్టర్ గాని, మండల తాసీల్దార్ గాని స్పందించకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇదిలా ఉండగా పాఠశాల విద్యార్థుల భోజనాన్ని పరీక్షకు హాజరైన విద్యార్థులకు పెట్టడంతో వారు సాయంత్రం నాలుగు గంట ల వరకు పస్తులతో ఉండాల్సి రావడం బాధాకరమని వాపోయారు.