యువతను టార్గెట్ చేస్తూ ప్రతిపక్షాలు కొత్త రాజకీయానికి తెరతీశాయి. ఉద్యోగాల పేరుతో కాంగ్రెస్, బీజేపీ జిమ్మిక్కులు చేస్తున్నాయి. నిరుద్యోగుల పేరుతో ర్యాలీలు నిర్వహిస్తూ..ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నాయి. ఆదివారం మహబూబ్‌నగర్‌లో టీపీసీసీ చీఫ్ చేపట్టిన నిరుద్యోగ ర్యాలీ అట్టర్‌ఫ్లాప్ అయ్యింది. ఓ వైపు యువత, జనం లేక ఆదరణ కరువైతే.. మరోవైపు పార్టీ రాష్ట్ర అధ్యక్షుడి ముందే నేతల మధ్య వర్గపోరు బహిర్గతమైంది. జడ్చర్లలో నేతలు బాహాబాహీగా తలపడగా.. పాలమూరులో ఆధిపత్య పోరు కొనసాగింది. దీంతో అసహనానికి గురైన రేవంత్ రాబోయే ఎన్నికల్లో పార్టీ నుంచి బీఫాం ఇచ్చేది తానేనని పరోక్షంగా హెచ్చరికలు జారీ చేశారు. ఆర్భాట ప్రచారంతో చేపడుతున్న ఇలాంటి యాత్రలు తుస్సుమంటున్నాయి.
మహబూబ్‌నగర్, మే 1 (నమ స్తే తెలంగాణ ప్రతినిధి) : టీపీసీసీ చీ ఫ్ రేవంత్ పాచికలు ఫలించలేదు. నిరుద్యోగ నిరసన ర్యాలీ చివరకు ఎన్నికల సభ గా మారడంతో నిరుద్యోగులు ఖంగుతింటున్నారు. వచ్చే ఎన్నికల్లో పార్టీని గెలిపించాలని ని నాదాలు చేయడంతో ఎన్నికల సభను తలపించింది. దీంతో సభకు వచ్చిన వారంతా ఇది నిరుద్యోగ సభ నా..? ఎన్నికల ప్రచారసభనా? అని ముక్కున వేలేసుకున్నారు. కేంద్రం రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తానని మోసం చే సిందని ప్రగల్బాలు పలికిన కాంగ్రెస్ నేతలు బీజేపీపై, మోదీపై ఒక్క విమర్శ కూడా చేయడకపోవడం గమనార్హం. వచ్చే ఎన్నికల్లో బీఫాం ఇచ్చేది తానే అని, తాను సంతకం పెడితేనే చెల్లుతుందని, నల్లమలలో ఉన్నా బీ ఫాం వచ్చి తీసుకోపోవాల్సిందే అని పరోక్షంగా హెచ్చరించడంతో సొంత పార్టీ నేతలు తెల్లమొహాలు వేసుకున్నారు.
కోమటిరెడ్డి, జానారెడ్డి, ఉత్తంకు అయి నా.. తానే ఇవ్వాలని.. ఈ విషయాన్ని వారే స్వయంగా ఒప్పుకున్నారని చెప్పుకొచ్చారు. దీంతో పక్కనే ఉన్న వీహెచ్ ఖంగుతిన్నారు. ఇదిలా ఉండగా రేవంత్‌రెడ్డి.. టీపీసీసీ చీఫ్ అయ్యాక రెండోసారి జిల్లాకు వచ్చిన వేళ.. అడుగడుగునా ఆ పార్టీలో కు మ్ములాటలు, వర్గపోరు భయటపడ్డాయి. ఒకరికొకరు తోసుకోవడంతో మున్సిపాలిటీ పూలతొట్టీలు ధ్వంసమయ్యే వరకు వెళ్లింది. కాంగ్రెస్ చేపట్టిన నిరుద్యోగ నిరసన ర్యాలీ రసాభాస గా మారింది. రేవంత్ దృష్టిలో పడేందుకు నేతలంతా ప్రయత్నించి అభాసుపాలయ్యారు. జడ్చర్లలో అనిరుధ్‌రెడ్డి, ఎర్రశేఖర్ గజమాలలు వేసేందుకు పోటీపడగా.. కార్యకర్తలు ఇరువర్గాలుగా విడిపోయి ఘర్షణకు దిగారు. సభ ముగిశాక నేతలం తా ఒక్కసారిగా బస్సుపై ఎక్కి రేవంత్‌తోపాటు జనాలకు అభివాదం చేయడానికి తహతహలాడడంతో గందరగోళం నెలకొన్నది.
నారాయణపేట జిల్లాలో పార్టీ నుంచి బహిష్కరించిన ఓ నేత సభలో ప్రత్యక్షం కావడం కలకలం రేపింది. గతంలో అదే పార్టీకి చెందిన ఓ మహిళా నేతను లైంగికంగా వేధించి, హైదరాబాద్‌లో ఏకంగా పోలీస్ కేసు నమోదుకావడంతో పార్టీ పరువుపోతుందని అతడిని బయటకు పంపారు. అయితే, అనుహ్యంగా రేవంత్‌రెడ్డి పక్కన ప్రత్యక్షం కావడంతో కార్యకర్తలు విస్మయం చెందారు. మహబూబ్‌నగర్ డీసీసీ అధ్యక్షుడికి చెక్‌పెడుతూ దేవరకద్ర నియోజకవర్గానికి చెందిన నేతలు హల్చల్ చేయడం గందరగోళానికి దారి తీసింది. మొత్తమ్మీద నిరుద్యోగుల సభ అని పెట్టినా బండి సంజయ్, రేవంత్ సభలకు జనం రాకపోవడంతో పార్టీల నేతలు అసహనం వ్యక్తంచేస్తున్నారు.
ఎన్నికల సభలా.. నిరుద్యోగ ర్యాలీలా..?
నిరుద్యోగుల నిరసన ర్యాలీ పేరుతో కాంగ్రెస్ చేపట్టిన కార్యక్రమం ఎన్నికల ప్రచారాన్ని తలపించింది. జిందాబాద్‌లు, మాకే ఓటేయ్యండి.. అంటూ రేవంత్ విజ్ఞాపనలు చేయడంతో అందరు ఒక్కసారిగా అవాక్కయ్యారు. జిల్లాలోని 14 నియోజకవర్గాల్లో కాంగ్రెస్‌ను గెలిపించాలని వేడుకున్నారు. అన్ని స్థానాలు గెలిపిస్తే తెలంగాణ, పాలమూరు అభివృద్ధి చేసి చూపిస్తామని హామీలు గుప్పించారు. విపక్ష పార్టీగా కాంగ్రెస్ ఏం చేస్తుందని చెప్పకుండా ఎన్నికల ప్రచారంలా దీన్ని వాడుకోవడంతో నిరుద్యోగులు మండిపడుతున్నారు. ఇదేనా నిరుద్యోగులకు ఇచ్చే గౌరవం అని విమర్శిస్తున్నారు. కేవలం విమర్శలు, ప్రతివిమర్శలు, సొంత డబ్బా కొట్టుకోవడానికే ఈ జిల్లాకు వచ్చారా? అని నిరుద్యోగులు ప్రశ్నిస్తున్నారు. ‘పేరు మాది.. ఊరు మీది’ అన్న చందంగా నిరుద్యోగులను రెండు పార్టీలు వాడుకుంటున్నాయని విమర్శించారు.
జడ్చర్లలో బాహాబాహీ.. కార్యకర్తల తోపులాట..
మహబూబ్‌నగర్ సమావేశానికి రేవంత్ వస్తుండడంతో జడ్చర్ల కాంగ్రెస్‌లో రెండు వర్గాలుగా విడిపోయారు. టీపీసీసీ అధికార ప్రతినిధి అనిరుధ్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే ఎర్రశేఖర్ వర్గాల మధ్య తొక్కిసలాట చోటు చేసుకున్నది. తొలుత అనిరుధ్‌రెడ్డి క్రేన్ ద్వారా రేవంత్‌కు గజమాల వేసి వస్తుంటే.. ఎర్రశేఖర్ ఇంకోచోట గజమాల ఏర్పాటు చేశారు. దీంతో ఇరువర్గాలు తోపులాడుకున్నాయి. టీపీసీసీ చీఫ్ ఎదుటే బాహాబాహీకి దిగారు. ఇరువర్గాలను శాంతిపజేయడానికి ప్రయత్నిస్తున్న తరుణంలో పక్కనే ఉన్న మున్సిపాలిటీ కుండీల మీద పడడంతో విరిగిపోయాయి. మరికొందరు వాటిని ధ్వంసం చేశారు. దాంట్లో ఉన్న మొక్కలు పీకేశారు. ఎవరికివారే జిందాబాద్ కొట్టడంతో గందరగోళంగా మారిపోయింది. కాగా, ఇరువర్గాల ఘర్షణను మరో మాజీ ఎమ్మెల్యే మల్లురవి చోద్యం చూస్తూ ఉండిపోయారు. కార్యకర్తలు మాత్రం.. మల్లురవికే టికెట్ వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ర్యాలీలో చిక్కుకున్న ఓ మహిళ మెడలోంచి మూడుతులాల పుస్తెల తాడును దొంగలు ఎత్తుకుపోయారు. ‘ఎవరికోసం ఈ మీటింగ్‌లు పెట్టారు..? నా బంగారు గొలుసుపోయింది.. తీసుకొచ్చి ఇస్తారా’ అంటూ శాపనార్థాలు పెట్టింది. పోలీస్‌స్టేషన్‌లో కేసు పెట్టినా.. ఇప్పటి వరకు సదరు మహిళను కాంగ్రెస్ నేతలు పరామర్శించకపోవడం గమనార్హం.
ఇరుపార్టీల్లో ఫలించని వ్యూహం..
ఏదో ఒకటి చేయాలని పన్నిన బీజేపీ, కాంగ్రెస్ టార్గెట్ ఫలించలేదు. వచ్చే ఎన్నికల్లో కీ ఓటర్లుగా ఉన్న యువతను ఆకట్టుకోవడానికి ఇటు బీజేపీ చేపట్టిన నిరుద్యోగ మార్చ్.. అటు కాంగ్రెస్ చేపట్టిన నిరుద్యోగ నిరసన ర్యాలీలు తుస్సుమన్నాయి. ఈ రెండు పార్టీలు యూత్‌ను తమవైపు తిప్పుకోవాలని చేసిన ప్రయత్నం బెడిసికొట్టింది. నిరుద్యోగులంతా రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన ఉద్యోగాల నోటిఫికేషన్లో భాగంగా బిజీబిజీగా ఉన్నారు. అందరూ ఉద్యోగాల కోసం ప్రిపేర్ అవుతున్న సందర్భంలో రెండు పార్టీలు వేసిన స్కెచ్ అట్టర్‌ఫ్లాప్ అయింది. రెండు సభలు ఒకే చోట నిర్వహించినా.. నిరుద్యోగుల నుంచి స్పందన రాలేదు. కాంగ్రెస్‌కు ఎక్కువ, బీజేపీకి తక్కువ అన్నట్లుగా జనసమీకరణ సాగింది. బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్, టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి ఇద్దరూ నిరుద్యోగులకు భరోసా కల్పించడంలో విఫలమయ్యారని నిరుద్యోగ యువత మండిపడుతున్నది. తాము అధికారంలో వస్తే ఏటా రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామని ఒకరంటే.. రెండు కోట్ల ఉద్యోగాల ఉసెత్తకుండా మరొకరు సైలెంట్‌గా వెళ్లిపోవడంతో మతలబు ఏంటని కార్యకర్తలు బుర్రలు బద్ధలు కొట్టుకుంటున్నారు. వీరి టార్గెట్ యువతే అయినా.. దారితప్పి ప్రభుత్వంపై చేసిన విమర్శలే ఎక్కువే ఉన్నాయి. అయినా జనం స్పందించకపోవడంతో సభ అసలు ఉద్దేశమే మార్చేశారు. ఉమ్మడి జిల్లాలో అనుకున్న స్థాయిలో యువత నుంచి రెస్పాన్స్ లభించకపోవడంతో రెండు పార్టీలు ఖంగుతిన్నాయి.