Alampur | అలంపూర్, ఏప్రిల్ 15 : కాలం అనుకూలించక అనేక కష్టాలకోర్చి అప్పులు చేసి వ్యవసాయం చేస్తున్న అన్నదాతలు కాంగ్రెస్ ప్రభుత్వంలో తీవ్ర నిర్లక్ష్యానికి గురవుతున్నారు. ఇప్పటికే సాగునీరందక ఆగమవుతున్న రైతులకు పుండు మీద కారం చల్లినట్లు చేతులు తడిపితేనే కానీ విద్యుత్ సరఫరా చేయలేమంటూ కాలం వెళ్ళదీస్తున్నారు.
వివరాల్లోకి వెళితే అలంపూర్ మండలం క్యాతూరు గ్రామానికి చెందిన గొల్ల వెంకటస్వామి అనే రైతు తన సొంత పొలంలో సర్వేనెంబర్ 473/ అ లో వ్యవసాయం కోసం విద్యుత్తు లైన్ వేయించుకోవాలనుకున్నాడు. నిబంధనల మేరకు రూ. 7,500 ప్రకారం నాలుగు డీడీలు చెల్లించాడు. గత సంవత్సరం అక్టోబర్ నెలలోనే ఓఆర్సీ రూ. 85,850 కూడా చెల్లించాడు. అయినా నేటి వరకు పని పూర్తి చేయలేదు. గత నెలలో విద్యుత్ స్తంభాలు వేసినప్పటికి తీగలు లాగి ట్రాన్స్ఫార్మర్ బిగించడానికి అధికారులు చుక్కలు చూపించారు. విద్యుత్ కార్యాలయం చుట్టూ, అధికారుల చుట్టూ, గుత్తేదారుల చుట్టూ తిరిగి తిరిగి వేసారి పోయినట్లు బాధితుడు రైతు గొల్ల వెంకటస్వామి ఆవేదన వ్యక్తం చేశాడు. గుత్తేదారుడిని పనుల విషయంలో గట్టిగా అడగడంతో పదివేల రూపాయలు ఇస్తేనే స్తంభాలకు వైరులాగి ట్రాన్స్ఫార్మర్ బిగిస్తామని చెప్పినట్టు రైతు ఆరోపించాడు.
సామాన్లు కొనడానికే డబ్బులు అడిగాను
రైతు పొలంలో విద్యుత్ పనులు చేయడానికి సంబంధిత శాఖ సరైన సమయంలో అవసరమైన సామాన్లు సరఫరా చేయలేదు. రైతులకు సకాలంలో పనులు పూర్తి చేయాలంటే విద్యుత్ వైర్ డిపిఆర్ బయట బహిరంగ మార్కెట్లో కొనాల్సి ఉంటుంది. కాబట్టి డబ్బులు అడిగాను.. పనులు చేసేందుకు రైతును ఎటువంటి లంచం అడగలేదు. డిపార్ట్మెంట్ అవసరమైన సామాన్లు ఎప్పుడు సరఫరా చేస్తే అప్పుడే పనులు పూర్తి చేసే బాధ్యత నాది.
-గుత్తేదారుడు నాగేంద్ర గౌడ్
సామాన్లు లేక పనులు పెండింగ్
డిపార్ట్మెంట్ పరంగా విద్యుత్ వైర్ల కొరత ఉంది. క్యాతూరు గ్రామంలోనే కాదు.. మండలంలో సుమారు 20 పనుల వరకు పెండింగ్లో ఉన్నాయి. వనపర్తి స్టోర్లో సామాన్లు స్టాక్ లేవు. శాఖాపరమైన సమస్యలను ఉన్న అధికారుల దృష్టికి తీసుకుపోయాం. ఈ నెలాఖరు లోపల పనులన్నీ పూర్తి చేయిస్తాం.
-మండల ఏఈ అఖిల్