నారాయణపేట : వారం రోజులుగా పోస్ట్ ఆఫీస్ చుట్టూ తిరుగుతున్న తమకు పింఛన్ డబ్బులు ఇవ్వడం లేదని ఆరోపిస్తూ నారాయణపేట జిల్లా ధన్వాడ మండలం కంసాన్ పల్లి గ్రామానికి ( Kamsanpalli Villagers ) చెందిన వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులు మండల కేంద్రంలో రోడ్డుపై రాస్తారోకో ( Rastaroko ) నిర్వహించారు.
హైదరాబాద్ నారాయణపేట ప్రాంతాలకు వెళ్తున్న బస్సులను అడ్డుకొని నిరసన తెలిపారు. వరలక్ష్మి అనే మహిళ పింఛను ఇచ్చేంత వరకు కదిలేది లేదని బస్సు ఎదుట బైటాయించింది. విషయం తెలుసుకున్న ఏఎస్సై ముస్తాక్ అలీ సంఘటన స్థలానికి చేరుకొని రాస్తారోకో విరమించాలని కోరారు. పెన్షన్‌దారులను బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ వద్దకు తీసుకువెళ్లి మాట్లాడించారు. ఎందుకు పెన్షన్ ఇవ్వడం లేదంటూ ఆరా తీశారు.
కంసాన్పల్లి గ్రామస్తులు మాట్లాడుతూ ప్రతినెలా తమ గ్రామానికి వచ్చి పింఛన్లు ఇచ్చేవారని, కాని కొన్ని నెలలుగా తాము మూడు కిలోమీటర్లు నడుచుకుంటూ వచ్చి పోస్ట్ ఆఫీస్ చుట్టూ తిరుగుతున్నా పింఛన్లు ఇవ్వడం లేదని పోలీసులతోనూ పోస్ట్ మాస్టర్‌తోనూ వాగ్వాదానికి దిగారు.
పోస్ట్ మాస్టర్ ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ పది రోజుల నుంచి పింఛన్లు పంపిణీ చేస్తున్నామని 60 శాతం మందికి పింఛన్లు పంపిణీ చేశామని నగదు కొరత వల్ల ఇంకా 40 శాతం మందికి పెన్షన్లు ఇవ్వలేదని వివరించారు. పింఛన్లు పంపిణీలో జాప్యం జరుగుతుందని ఇందులో తమ నిర్లక్ష్యం ఏ మాత్రం లేదని వివరించారు.