గద్వాల, జూలై 16 : ఎల్నినో ప్రభావం అన్నదాతలకు శాపంగా మారడంతో జిల్లాలో వానకాలం సాగుపై నీలినీడలు కమ్ముకున్నాయి. ఎల్నివో గాలి పొర నైరుతి రుతుపవనాలను బలహీన పర్చింది. దీని ప్రభావం కారణంగా అక్కడక్కడ చిరుజల్లులు కురిసినా అది రైతులకు పెద్దగా ఉపయోగ పడలేదు. దీంతో జోగుళాంబ గద్వాల జిల్లా రైతాంగాన్ని సాగునీటి కష్టాలు తీవ్ర ఆందోళనకు గురి చేస్తున్నాయి. వర్షాలు ఆశించిన స్థాయిలో కురువక పోవడంతో జిల్లాలోని ప్రధాన సాగు నీటి ప్రాజెక్టులు ప్రస్తుతం నీరు లేక వెలవెల బోతున్నాయి.
జిల్లాలో ఈ వానకాలం సీజన్లో 3,78,239 ఎకరాల్లో పంటలు సాగు కావాల్సిన ఇప్పటి వరకు 1,57,761 ఎకరాల్లో మాత్రమే రైతులు వివిధ పంటలు సాగు చేశారు. ఇందులో అధికంగా పత్తి 1,16,876 ఎకరాల్లో సాగు చేయగా నీటి లభ్యత లేని కారణంగా జిల్లాలో ఇప్పటి వరకు వరి ఒక్క ఎకరం కూడా రైతులు సాగు చేయలేదు. వాస్తవంగా జిల్లాలో ఈ వానకాలం సీజన్లో 1,16,532 ఎకరాల్లో వరి సాగు చేయాల్సి ఉంది. అయితే ఎల్నివో ప్రభావం వల్ల వర్షాపాతం తగ్గి జిల్లాలోని జూరాల, నెట్టెంపాడ్, ఆర్డీఎస్ రిజర్వాయర్లు, డ్యాముల్లో నీటి మట్టాలు గణనీయంగా పడిపోవడంతో ఆయకట్టుకు సంబంధించి నీరు ఇవ్వడానికి ప్రాజెక్టుల్లో బొట్టు నీరు కూడా అందుబాటులో లేవని నీటి పారుదల శాఖ అధికారులు స్పష్టం చేయడంతో రైతులు దిక్కుతోచని పరిస్థితుల్లో ఉన్నారు. ప్రాజెక్టుల్లో నీటి కొరత వల్ల వ్యవసాయంపై తీవ్రప్రభావం చూపుతున్నది.
ప్రస్తుతం ప్రాజెక్టుల్లో ఉన్న నీరు తాగునీటి అవసరాలకు మాత్రమే వినియోగిస్తామని సాగునీటికి వినియోగించుకోవడానికి అవకాశం లేదని ఇరిగేషన్ శాఖ అధికారులు చెప్పడంతో జిల్లాలోని ఆయకట్టు ప్రమాదంలో పడినట్లు అయింది. ఇలాంటి కరువు పరిస్థితుల్లో రైతులు సాగు నీటి కొరతను అధిగమించి నష్టాల బారిన పడకుండా ఉండడానికి అధికారులు ఆరుతడి లేదా ప్రత్యామ్నాయ పంటలు సాగు చేసుకోవాలని సూచనలు చేస్తున్నారు.
వర్షాలు కురువక పోవడం, ప్రాజెక్టుల్లో నీటి నిల్వలు అనుకున్న స్థాయిలో లేక పోవడంతో వానకాలం సా గుపై ఆశలు పెట్టుకున్న రైతులు ప్రత్యామ్నాయ పం టల వైపు చూడాలని వ్యవసాయ, ఇరిగేషన్ శాఖల అధికారులు సూచిస్తున్నారు. రైతులు వరి పంటల జోలికి వెళ్లొద్దని హెచ్చరిస్తూ తక్కువ నీటితో తక్కువ కాలంలో చేతికి వచ్చే ఆరుతడి, ప్రత్యామ్నాయ పం టలైనా మొక్కజొన్న, మినుములు, పెసర, శనగ, కంది, నువ్వులు, జొన్న, సజ్జలు, రాగులు, కొర్రలు వంటి చిరుధాన్యాల పంటల సాగు చేయడం వల్ల రైతులకు ఎంతగానో మేలు జరుగుతుందని చెప్తున్నారు. ఈ పంటలు సాగు చేయడం వల్ల నీటిఎద్దడి రాక ముందే పంట చేతికొస్తుందని వ్యవసాయశాఖ అధికారులు సూచిస్తున్నారు.
ఒక వేళ రైతులు వరి సాగు చేయాలను కుంటే పొలంలో ఎల్లప్పుడూ నీరు నిల్వ ఉంచకుండా ఒక తడి ఇచ్చిన తర్వాత భూమి ఆరిన తర్వాత మరో తడి ఇవ్వాలన్నారు. వర్షాలు సమృద్ధిగా కురిసి ఉంటే జూలై 15 నాటికి జిల్లాలో 2,62,048 ఎకరాల పంటలు రైతులు సాగు చే యాల్సి ఉండగా ప్రస్తుతం 1,57,761 ఎకరాల్లో మాత్రమే వివిధ పంటలు సాగు చేస్తున్నారు. జిల్లాలో జూలై 15నాటికి 279 మిల్లీమీటర్ల వర్షపాతం న మోదు కావాల్సి ఉండగా ఇప్పటి వరకు కేవలం 96 మిల్లీ మీటర్ల వర్షాపాతం మాత్రమే నమోదైంది. వ్య వసాయ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం మై నస్ 39 శాతం డెబిసిటి వర్షపాతం నమోదైనట్లు చె ప్పారు. దీంతో సాగు ప్రశ్నార్థకంగా మారింది.
నడిగడ్డ రైతుల ఆశలన్నీ కర్ణాటక జలాశయాలపై ఆధారపడి ఉన్నాయి. అక్కడ డ్యాంలు నిండితే తప్పా దిగువన ఉన్న జూరాల ప్రాజెక్టుకు వరద నీరు వచ్చే అవకాశం లేదు. మహారాష్ట్ర, కర్ణాటక ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాల కారణంగా అల్మట్టికి వరద నీరు భారీగా చేరుతున్నది. అయితే అల్మట్టి పూర్తి జలాశయ నీటి మట్టం 123.8టీఎంసీలు కాగా ప్రస్తుతం 57.06 టీఎంసీల నీరు నిల్వ ఉన్నట్లు ఇరిగేషన్ అధికారులు చెబుతున్నారు.
అల్మట్టి నిండిన తర్వాత నారాయణపూర్ డ్యాంకు వరద వచ్చే అవకాశం ఉంది. నారాయణపూర్ ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం 33.313 టీఎంసీలు కాగా ప్రస్తుతం 19.726 టీఎంసీల నీరు నిల్వ ఉన్నది. ఈ రెండు ప్రాజెక్టులు పూర్తి స్థాయిలో నిండితే తప్పా జూరాలకు వరద నీరు వచ్చి చేరే అవకాశం లేదు. జూరాల ప్రాజెక్టుకు వరద నీరు వస్తే తప్పా.. దీని పరిధిలో కుడి, ఎడమ కాల్వలకు నీటిని విడుదల చేసే అవకాశం ఉంది. దీంతోపాటు నెట్టెంపాడ్కు జూరాల ప్రాజుక్టు నీరే ప్రధాన వనరు కావడంతో మన ఆశలన్నీ కర్ణాటక జలాశయాలపై ఆధారపడాల్సిన పరిస్థితి నెలకొంది. ఈ పరిస్థితుల్లో వర్షాలు సమృద్ధిగా కురిస్తే తప్పా రైతులు ఈ సందిగ్ధం నుంచి బయటపడే అవకాశం ఉన్నది.