జిల్లా కేంద్రంలోని రాజవీధిలోని వాసవీ కన్యకాపరమేశ్వరి ఆలయంలో శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా అమ్మవారిని రూ. 3.51కోట్లలతో శుక్రవారం అలంకరణ చేశారు. అలాగే రెండో రైల్వేగేట్‌లోని తాయమ్మ ఆలయంలో అమ్మవారిని రూ. 51లక్షలతో అలంకరించారు. అంబాభవాని, కాళమ్మ ఆలయాల్లో అమ్మవారిని ధనలక్ష్మి రూపంలో అలంకరించి విశిష్ట పూజలు నిర్వహించారు. సాయంత్రం అమ్మవారి సన్నిధిలో పెద్దఎత్తున మహిళలు పాల్గొని కుంకుమార్చన చేసి భక్తితో కొలిచారు.
– గద్వాలటౌన్, అక్టోబర్ 4
శ్రీశైలంలో దసరా మహోత్సవాల్లో భాగంగా రెండో రోజు శుక్రవారం అమ్మవారిని సింహమండపం వద్ద
ఏర్పాటు చేసిన వేదికపై బ్రహ్మచారిణీగా అలంకరించారు. భక్తులు ప్రత్యేక పూజలు చేశారు. అక్క మహాదేవి
అలంకార మండపంలో భ్రామరి, మల్లికార్జునులు మయూర వాహనాన్ని అధిష్టించి భక్తులను కరుణించారు. అనంతరం గ్రామోత్సవంలో భాగంగా ఉత్సవమూర్తులు మయూర వాహనంపై విహరిస్తూ భక్తులను కటాక్షించారు. కార్యక్రమంలో ఈవో పెద్దిరాజు, పీఆర్వో శ్రీనివాసరావు, ఈఈ నర్సింహారెడ్డి, అనీల్‌కుమార్, చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ అయ్యన్న ఉన్నారు.
– శ్రీశైలం, అక్టోబర్ 4
అలంపూర్ క్షేత్రంలో దేవీ శరన్నవ రాత్రోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. శుక్రవారం జోగుళాంబ బ్రహ్మచారిణి దేవీగా భక్తులకు దర్శనమిచ్చింది. ఒక చేతిలో కమండలం, మరో చేతిలో పుస్తకం, జపమాల, దండం ధరించి కటాక్షించారు. పూజా కార్యక్రమాల్లో ఈవో ఫురేందర్కుమార్, ఆలయ ధర్మకర్తలు, పాలక మండలి చైర్మన్ కొంకల నాగేశ్వర్‌రెడ్డి, ఆలయ ధర్మకర్తలు, భక్తులు పాల్గొన్నారు.
– అలంపూర్, అక్టోబర్ 4