మాగనూరు : మాగనూరు కృష్ణ ఉమ్మడి మండలంలోని వరి కొనుగోలు కేంద్రాలను , రైస్ మిల్లులను నారాయణపేట జిల్లా సివిల్ సప్లై అధికారి గురజా రావు ( DT Guruja Rao ) తనిఖీ చేశారు. శనివారం గుడెబల్లూరు ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన వరి కొనుగోలు కేంద్రాన్ని , మాగనూరు కృష్ణ మండలాలలో పీఏసీఎస్, మహిళా సమాఖ్య ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన వరి కొనుగోలు కేంద్రాలను ఆకస్మిక తనిఖీ చేశారు.
ఏ ఒక్క వరి కొనుగోలు కేంద్రాల వద్ద సంబంధిత అధికారులు లేకపోవడంతో ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా కేంద్రాల వద్ద వడ్లను పరిశీలించి రైతులతో మాట్లాడారు. కేంద్రాల వద్ద సంబంధిత అధికారులు సరిగా ఉండడం లేదని రైతులు ఫిర్యాదు చేశారు.
టోకెన్లు కూడా సక్రమంగా ఇవ్వడం లేదని, గన్ని బ్యాగులు కూడా సప్లై చేయాలని కోరారు. కొనుగోలు కేంద్రాల వద్ద సంబంధిత అధికారులు లేని విషయం పై నారాయణపేట డీఏవో జాన్ సుధాకర్ , డీఎం సైదులుకు సమాచారం అందించినట్లు డీటి తెలిపారు. ఆయన వెంట సివిల్ సప్లై అధికారులు, రైతులు పాల్గొన్నారు.