కొల్లాపూర్ రూరల్, జనవరి 8 : కొల్లాపూర్ మండలం రామాపురం గ్రామంలో ఏడో వార్డుతోపాటు వివిధ వార్డు ల్లో దాదాపు నెల రోజుల నుంచి తాగునీటి ఎద్దడి నెలకొన్నది. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో తాగునీటి సమస్యను పరిష్కరించాలని కోరుతూ బుదవారం ఖాళీ బిందెలతో గ్రామస్తులు ప్రధాన రహదారిపై నిరసన వ్యక్తం చేశారు. వీరికి సామాజిక నాయకుడు చంద్రయ్యయాదవ్ తదితరులు మద్దతు తెలిపారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో మిషన్ భగీరథ ద్వారా ఇంటింటికీ నల్లాల ద్వారా నీటిని సరపరా చేసేవారు. కానీ కాం గ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత నియోజకవర్గంలోని పలు గ్రామాల్లో ప్రజలు తాగునీటి కోసం తంటాలు పడాల్సిన పరిస్థితి నెలకొన్నది. కనీసం మిషన్ భగీరథ పథకం నిర్వహణను సైతం పట్టించుకోకపోవడంతో ప్రజలు తాగునీటి కోసం తీవ్ర ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి నెలకొన్నంది.
ఒక మంత్రి ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గంలో కూడా ప్రజలు తాగునీటి కోసం ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి తాగునీటి ఎద్దడి నివారణకు చర్యలు తీసుకోవాలని, లేదంటే మంత్రి జూపల్లి కృష్ణారావు ఇంటి ఎదుట నిరసన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు. కార్యక్రమంలో సామాజిక నాయకుడు ఆనుకమోని చంద్రయ్య యాదవ్‌తోపాటు కాలనీకి చెందిన పలువురు ప్రముఖులు పాల్గొన్నారు.