మహ్మదాబాద్, మార్చి 30: వేసవి ఆరంభంలోనే పల్లెల్లో తాగునీటి కష్టాలు మొదలయ్యాయి. మండలంలోని సంగాయిపల్లి, బాపన్కుంట తండా, ధర్మాపూర్లో తాగునీటి కోసం ప్రజలు తంటాలు పడుతున్నారు. ధర్మాపూర్లో నెల రోజుల నుంచి గ్రామంలోకి తాగునీటిని సరఫరా చేసే బోరు మోటరు పాడవడంతో ఇప్పటివరకు బోరు మోటరును బాగుచేయించక పోవండతో గ్రామస్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గ్రామ సమీపంలోని వ్యవసాయ బోర్ల నుంచి బిందెలతో తాగునీటిని తెచ్చుకుంటున్నారు.
తాగునీటి కష్టాల గురించి గ్రామాల ప్రజలు కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లడంతో వారం కిందట కలెక్టర్ విజయేందిర బోయి మండలంలో ఆకస్మిక పర్యటన నిర్వహించి ధర్మాపూర్, సంగాయిపల్లిల్లో తాగునీటి సమస్యలపై అధికారులతో చర్చించారు. హన్వాడ మండలం నుంచి పైప్లైన్ తీయాలని మిషన్ భగీరథ ఏఈ అనిల్ రెడ్డి సూచించారు. గ్రామాలకు తాగునీటి సమస్యలు రాకుండా తగు చర్యలు చేపట్టాలని ఆదేశించారు. వారం గడుస్తున్నా ఇప్పటివరకు అధికారులు తాగునీటి సమస్యపై దృష్టిసారించక పోవడంతో రోజురోజుకు సమస్య పెరిగిపోతున్నది.
ప్రజలు తాగునీటి కోసం వ్యవసాయ బోర్లను ఆశ్రయించాల్సి వస్తుంది. మిషన్ భగీరథ నీళ్లు రెండుమూడు రోజులకోసారి రావండంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ సమస్యను పంచాయతీ కార్యదర్శి, స్థానిక అధికారుల దృష్టికి తీసుకెళ్లినా ఎవరూ పట్టించుకోవడం లేదని ఆయా గ్రామాల ప్రజలు ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి పల్లెల్లో తాగునీటి సమస్య పరిష్కారానికి తగిన చర్యలు తీసుకోవాలని ఆయా గ్రామాల ప్రజలు కోరుతున్నారు.