జడ్చర్ల, జూన్ 11 : వానకాలం సాగు ప్రారంభంకానున్న నేపథ్యంలో రైతులు విత్తనాలు, ఎరువుల కొనుగోళ్లలో జాగ్రత్తలు పాటించాలని వ్యవసాయాధికారులు సూచిస్తున్నారు. ఇప్పటికే రైతులు ముందస్తుగా విత్తనాలు కొనుగోలు చేసుకొంటున్నారు. మార్కెట్లో గుర్తింపు లేని విత్తనాలు పుట్టగొడుగుల్లా వస్తున్న తరుణంలో రైతులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. అధికారుల సలహమేర కు రైతులు విత్తనాలను కొనుగోలు చేయాలంటున్నారు. విత్తనాలు విత్తుకోవాలనే ఉద్దేశంతో రైతులు ముందుగానే ఎరువులు, విత్తనాలను కొనుగోలు చేసి వాటిని ఇంట్లో నిల్వ చేసుకుంటారు.
ఇదే అదునుగా చూసి కొందరు విక్రయదారులు నకిలీ ఎరువులు, విత్తనాలను అమ్మే ప్రమాదం పొంచిఉంది. రైతులు విత్తనాలను కొనుగోలు చేసే సమయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని వ్యవసాయాధికారులు సూచిస్తున్నారు. అదేవిధంగా వేసిన పంటలో కలుపు రాకుండా ఉండేందుకుగానూ చాలా మంది రైతులు నిషేధిత విత్తనాలను తీసుకునే అవకాశం ఉంది. వీటితో పంటలు నష్టపోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. గుర్తింపులేని విత్తనాలు మార్కెట్లోగానీ, గ్రామాల్లో గానీ కొనుగోలు చేయకూడదు. విత్తనాలు, పురుగుమందుల కోసం కంపెనీలు ఆకర్షణీయమైన ప్రకటనలు, ప్రచార ఆర్భాటాలతో రైతులను తమవైపు తిప్పుకునే విధంగా ప్రయత్నాలు చేస్తారు.
అటువంటి కంపెనీల విషయంలో రైతులు అప్రమత్తంగా ఉండాలి. జిల్లాలో పత్తి, మొక్కజొన్న ఎక్కువగా సాగవుతుంది. విత్తనాల ప్యాకెట్లపై ఉన్న ప్రభుత్వ నిబంధనలు, వివరాలు చూసుకున్న తర్వాతనే కొనుగోలు చేయాలని మండల వ్యవసాయాధికారి గోపీనాథ్ సూచించారు. వ్యవసాయశాఖ ద్వారా లైసెన్స్ పొందిన డీలర్ల వద్దనే విత్తనాలు కొనుగోలు చేయాలి. విత్తనాలు కొనుగోలు చేసిన సమయంలో రసీదులు తప్పనిసరిగా తీసుకోవాలి. రసీదుపై విత్తన రకం, దానియొక్క కోడ్నెంబర్, కొనుగోలు తేదీ, డీలర్సంతకం ఉండేలా చూసుకోవాలి. గడువుదాటిన విత్తనాలు, లూజ్ విత్తనాలు, చిరిగిన ప్యాకెట్లను కొనుగోలు చేయొద్దు. అదేవిధంగా కొనుగోలు చేసిన రసీదుపై అమ్మకందారుడి పేరు, అమ్మకాల పన్ను నెంబర్, విక్రయదారుడి గ్రామం, పేరు, విక్రయదారుడి సంతకం తేదీలు వాటియొక్క రకం పేర్లు, బ్యాచ్నెంబర్, గడువుతేదీ, తూకం, ధర, కంపెనీపేరు నమోదై ఉండాలి.
మొలకెత్తీదశ, పూతదశలో పంటలో లోపం కనిపిస్తే అధికారులు, శాస్త్త్రవేత్తలను సంప్రదించాలని వ్యవసాయాధికారులు సూచిస్తున్నారు. విత్తనాలు కొనుగోలు చేసిన రసీదులను పంటచేతికొచ్చే వరకు జాగ్రత్తగా ఉంచుకోవాలని వ్యవసాయశాఖ అధికారులు పేర్కొన్నారు. పురుగు మందుల ఎంపికలో జాగ్రత్తలు పాటించాలి. వానకాలంలో వేసిన పంటల్లో చీడపీడలు ఎక్కువగా ఉన్నప్పుడు వ్యవసాయశాఖ అధికారులు, శాస్త్త్రవేత్తలు సూచించిన పురుగుల మందులను మాత్రమే కొనుగోలు చేయాలని పేర్కొన్నారు. అదేవిధంగా లైసెన్స్ కలిగిన దుకాణాల్లోనే ఎరువులను కొనుగోలు చేయాలని సూచిస్తున్నారు. వానకాలం సీజన్ రాకముందే నకిలీ విత్తనాలు మార్కెట్లోకి వస్తాయని తెలుసుకున్న అధికారులు ముందస్తుగానే ప్రత్యేక టీంలను ఏర్పాటు చేసి తనిఖీలు నిర్వహించారు.
వానకాలంలో రైతులు పంటలు వేసే సమయంలో నాణ్యమైన విత్తనాలనే కొనుగోలు చేయాలి. పంటల దిగుబడి బాగా వస్తుందిని మాయమాటలు నమ్మి నకిలీ విత్తనాలు కొనుగోలు చేసిన మోసపోవద్దు. వానకాలం సీజన్ వస్తుంది కాబట్టి నకిలీ విత్తనాలను మార్కెట్లోకి వచ్చే అవకాశం ఉంటుంది. రైతులు జాగ్రత్తగా ఉండాలి.
– గోపినాథ్, మండల వ్యవసాయాధికారి, జడ్చర్ల