బిజినపల్లి : పేద మహిళలు (Poor Womens ) ఆర్థికంగా ఉన్నత స్థితిలో ఉండాలని, సమాజం, కుటుంబంలో వారికొక గుర్తింపు సాధించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం అనేక కార్యక్రమాలను అమలు చేస్తుందని డీఆర్డీవో పీడీ చిన్న ఓబులేష్ ( PD Chinna Obulesh ) అన్నారు. శుక్రవారం బిజినేపల్లి మండలం పాలెం గ్రామంలో స్త్రీనిధి రుణాల మొండి బకాయిదారులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం మహిళా సంఘాలకు స్త్రీనిధి, బ్యాంకు లింకేజి ద్వారా జీవనోపాధి రుణాలు అందచేస్తోందని వెల్లడించారు. కొందరు అవగాహనరాహిత్యం వల్ల తీసుకున్న అప్పు సరైన వాయిదాలు చెల్లించకపోవడంతో బకాయిలు పేరుకు పోతున్నాయని తెలిపారు. దీని వల్ల పేద మహిళలకు రుణ సదుపాయం అవకాశం లేకుండా పోతోందని పేర్కొన్నారు.
గ్రామ సంఘం పరిధిలోని చిన్న సంఘాల్లో ఏ ఒక్క సభ్యురాలు బకాయి ఉన్నా ఆ సంఘాలు స్త్రీనిధి రుణ మంజూరుకు అర్హత కోల్పోతాయని స్పష్టం చేశారు. సభ్యులు తీసుకున్న అప్పులను క్రమం తప్పకుండా వాయిదాలు చెల్లించాలని సూచించారు. కార్యక్రమంలో స్త్రీనిధి రీజినల్ మేనేజర్ మహేంద్రకుమార్, మేనేజర్ విక్రమ్ కుమార్, సీసీ రామస్వామి, వీవోఏలు, పలు సంఘాల లీడర్లు, సభ్యులు పాల్గొన్నారు.