వనపర్తి, ఆగస్టు 8 (నమస్తే తెలంగాణ) : పసిపిల్లలపై కుక్కల దాడులు తీవ్రమైన నేపథ్యంలో ఎట్టకేలకు వాటి సంతతిని తగ్గించేందుకు కార్యాచరణ ప్రారంభమైంది. చిన్నారులతోపాటు మహిళలు, వృద్ధులపై కుక్కల దాడులు పెరగడం వల్ల వీటి నివారణకు శ్రీకారం చుట్టారు. ఈ ఘటనలపై కోర్టులు సైతం ప్రభుత్వానికి మొట్టికాయలు వేయడంతో చలనం వచ్చింది. ఈ మేరకు వనపర్తి జిల్లాలో గురువారం సాయంత్రం కుక్కలకు కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు చేశారు.
కలెక్టర్ ఆదర్శ్ సురభి ఆదేశాలకు మేరకు ము న్సిపల్ అధికారుల పర్యవేక్షణలో కుక్కల శస్త్రచికిత్సలు ఎట్టకేలకు మొదలయ్యాయి. మున్సిపల్ పరిధిలోని నాగవరం శివారులోని ఊరగుట్ట సమీపంలో జంతు జనన నియంత్రణ కేంద్రాన్ని ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు. యానిమల్ వెల్పేర్ కేర్ సెంటర్ ఏజెన్సీతో ఒప్పందం మేరకు ఈ కార్యక్రమాన్ని నడిపిస్తున్నారు. కుక్కల సంతతిని తగ్గించడం కోసం సురక్షితమైన పద్ధతిలో సర్జరీలు చేసే విధంగా నిర్ణయం తీసుకున్నారు.
జిల్లా నలుమూలల నుంచి కుక్కలను సేకరించి సంతాన ఉత్పత్తి జరగకుండా ఏజెన్సీ నిర్వాహకులు చికిత్సలకు శ్రీకారం చుట్టారు. శస్త్రచికిత్స అనంతరం కుక్కలను వారం రోజులపాటు కేంద్రంలోనే ఉంచుకొని ఆరోగ్యం మెరుగుపడిన అనంతరం యథాస్థానంలో కుక్కలను వదిలి పెట్టేలా చర్యలు తీసుకుంటున్నారు. జిల్లాలో మొత్తం 15వేలకు పైగా కుక్కలున్నట్లు 2019 జంతుగణన ద్వారా పశుసంవర్ధకశాఖలో నమోదైంది. ఇదిలా ఉంటే, గతంలో కుక్కలకు మందులు పెట్టి జీపీల వారీగా నివారణ చర్యలు తీసుకునే పరిస్థితి ఉండింది. కొం దరు జంతు ప్రేమికులు కోర్టులకు ఎక్కడం ద్వారా కుక్కలను చం పడం నిలిచిపోయింది. వీటిపై కొన్ని పోలీస్స్టేషన్లలో కేసులు కూ డా నమోదైన సంగతి తెలిసిందే.