ధరూరు, మే 31 : ‘చదివింది చారెడు.. చికిత్స లు బారెడు’ అనే శీర్షికన ఈనెల 19న నమస్తే తెలంగాణ దినపత్రికలో వార్త ప్రచురితమైంది. ఈమేరకు జిల్లా వైద్య యంత్రాంగం ఎట్టకేలకు స్పందించారు. నిబంధనలకు విరుద్ధంగా, మెడికల్ రూల్స్, శుభ్రత పాటించకుండా క్లినిక్‌లు నడిపితే కఠిన చర్యలు తప్పవని జిల్లా వైద్యాధికారిణి శశికళ హెచ్చరించారు. శుక్రవారం మండలంలోని క్లినిక్‌లను ఆమె సిబ్బందితో కలిసి తనిఖీ చేశారు. వైఎస్సార్ చౌరస్తాలోని కంసలి శ్రీనివాస్, చాకలి శ్రీను క్లినిక్‌లను పరిశీలించారు. కాగా కంసలి శ్రీనివాస్ క్లినిక్‌లో చిన్నారులకు స్లైన్ ఎక్కించడం, హైడోస్ యాంటిబయాటిక్ మందులు ఇవ్వడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. క్లినిక్‌లో బయో మెడికల్ వేస్టేజీ లేకపోవడం, వాడిన సిరంజీలను సరైన పద్ధతిలో డంప్ చేయకపోవడంపై ఆమె సీరియస్ అయ్యారు.
ప్రథమ చికిత్సకు బదులు కనీస శుభ్రత పాటించకుండా వైద్యం చేస్తారా? ఇలా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే పర్యావరణం కలుషితమై ఎయిడ్స్, హైపటైటిస్ వ్యాధులు ప్రబలుతాయని తెలియదా అని మందలించారు. క్వాలిఫైడ్ డాక్టర్ లేకుండా ఎలా వైద్యం చేస్తారని నిలదీశారు. నిబంధనలు పాటించకపోవడమే కాకుండా మహిళా వైద్యాధికారిణులతో దురుసుగా ప్రవర్తించినందుకు క్లినిక్‌ను తాత్కాలికంగా బంద్ చేయించారు. అలాగే చాకలి శ్రీను క్లినిక్‌ను పరిశీలించి ఇవి ప్రథమ చికిత్స కేంద్రాలా? లేక ఎంబీబీఎస్ దవాఖానలా? అని అడిగారు. అవగాహన లేని వైద్యంతో ఎన్ని ఇబ్బందులొస్తాయో ఒక్కసారైనా ఆలోచించారా అని ప్రశ్నించారు. ఈక్రమంలో రెండు క్లినిక్‌లను బంద్ చేయించారు. కార్యక్రమంలో డిప్యూటీ డీఎంహెచ్‌వో సిద్ధప్ప, ప్రోగ్రాం ఆఫీసర్ స్రవంతి పాల్గొన్నారు.