ఇంటింటా దీపాలు.. లోగిళ్లలో ప్రమిదల వెలుగులు.. వీధుల్లో పటాకుల మోతలు.. ఇదే కదా దీపావళి.. ఇలా చిన్న, పెద్ద, పేద, ధనిక తేడా లేకుండా జరుపుకొనే వెలుగు జిలుగుల వేడుక. హిందువుల పవిత్ర పండుగల్లో ఒకటైన ఈ పర్వదినాన్ని ఆదివారం ప్రజలు సంబురంగా నిర్వహించుకోనున్నారు. ప్రతి ఏడాది అశ్వయుజ అమావాస్య రోజున నరక చతుర్ధశిని నిర్వహిస్తారు. చెడుపై మంచి సాధించిన విజయానికి సంకేతంగా నిర్వహించే పండుగ కోసం ఉమ్మడి జిల్లా సిద్ధమైంది. ధన త్రయోదశి, లక్ష్మీపూజకు ఎంతో ప్రత్యేకం. బహురూపాల్లో దీపాంతలు లభ్యమవుతున్నాయి. క్రాకర్స్ విక్రయాలు జోరందుకున్నాయి. దీంతో మార్కెట్లన్నీ కొనుగోలుదారులతో సందడిగా మారాయి. అయితే పటాకులు కాల్చే సమయంలో ఎలాంటి ప్రమాదాలు జరగకుండా ఆనందంగా జరుపుకోవాలని అగ్నిమాపక అధికారులు సూచించారు.
నాగర్‌కర్నూల్ (నమస్తే తెలంగాణ)/వనపర్తి టౌన్, నవంబర్ 11 : హిందువుల పండుగలో దీపావళి పండుగ ముఖ్యమైనది. చెడుపై మంచి సాధించిన విజయానికి గుర్తుగా ఈ పర్వదినాన్ని జరుపుకొంటారు. ప్రతి ఏడాది అశ్వాయుజ అమావాస్య రోజున పండుగను నిర్వహిస్తుంటారు. వేకువ జామునే ఇండ్లను శుభ్రం చేసుకొని నూతన వస్ర్తాలతోపాటు వెండి, బంగారు ఆభరణాలతో ధనలక్ష్మి పూజలు చేస్తే ఐష్టెశ్వరాలు కలుగుతాయని నమ్మకం.
పురాణాలు, రామాయణం, మహాభారతంలో దీపావళి చరిత్రపై ప్రస్తావన ఉంది. భూదేవి వరాహస్వామికి, నరకాసురుడికి జన్మనిస్తారు. నరకాసురుడి బాధలు భరించలేని దేవతలు, మునులు, గాంధర్వులు శ్రీహరికి గోడు వెల్లబోసుకుంటారు. ద్వారక నగరంలో కృష్ణుడిగా అవతరించి సత్యభామ సహకారంతో నరకాసురుడిని సంహరింపజేస్తారు. అలాగే లంకలో రావణుడిని హతమార్చి శ్రీరాముడు సీతాసమేతంగా అయోధ్యకు తిరిగి వచ్చిన సందర్భంగానూ దీపావళి జరుపుకొన్నట్లుగా చెబుతుంటారు. ఇలా దీపాలు వెలిగించి సంబురాలు చేసుకుంటారు.
చెడు, చీకటిపై నాడు సాధించిన మంచి విజయాలకు గుర్తే ఈ పండుగ. పర్వదినాన్ని ఘనంగా నిర్వహించేందుకు ప్రజలు సిద్ధమయ్యారు. ఇందులో భాగంగా ఇండ్లను ముస్తాబు చేసుకోవడంతో పాటు లక్ష్మీ పూజలను జరుపుకోనున్నారు. దీపావళికి చాలా మంది నోములు ఆచరిస్తారు. పిండివంటలను చేసుకోవడం, కొత్త దుస్తులు వేసుకోవడం, పూజ చేయడం జరుగుతుంది. చివరికి దీపావళి ప్రత్యేకంగా నిలిచే పటాకులను కాల్చడం జరుగుతుంది. ఇంటిలో పెద్దలు, పిల్లలంతా ఇండ్ల ముందు మట్టి దీపాలను, కొవ్వొత్తులను వెలిగిస్తారు. మహాలక్ష్మీ పూజ నిర్వహించడం ఈ పండుగ విశిష్టత. వ్యాపారులు, ప్రజలంతా దేవి కటాక్షం కోసం పూజలు చేస్తారు. పూర్వం దుర్వాస మహర్షిని అవమానించిన ఇంద్రుడిని శపిస్తే రాజ్యం, సంపదలు కోల్పోతాడు. దీనిపై శ్రీమహావిష్ణువును ఇంద్రుడు శరణు కోరితే లక్ష్మీదేవిని పూజించాలని చెప్తే ఆ తర్వాత దేవి కటాక్షంతో ఇంద్రుడు రాజ్యం, సంపదలను తిరిగి పొందుతాడు. దీనివల్ల లక్ష్మీపూజను దీపావళి రోజు చేసుకుంటే అదృష్టం కలిసి వస్తుందని భక్తుల భావన. అనంతరం పటాకులు కాలుస్తూ సంబురాలు చేసుకొంటారు.
దీపావళి పండుగ అంటేనే ఠక్కున గుర్తొచ్చేది పటాకులు.. వివిధ రకాల క్రాకర్స్‌ను కాల్చడంతో చిన్నారుల నుంచి పెద్దల వరకు ఎంతో ఉత్సాహం చూపుతారు. వారం రోజులు ముందు నుంచే పటాకుల దుకాణాలు వెలిశాయి. దీంతో కొనుగోళ్లు షురూ అయ్యాయి. వనపర్తి జిల్లా కేంద్రంలోని బాలుర జూనియర్ కళాశాల మైదానంలో దుకాణాలు ఏర్పాటు చేశారు. 17 స్టాల్స్‌ను ఏర్పాటు చేయగా అందులో వివిధ రకాల పటాకులు ఉన్నాయి. సురుసుర బత్తులు, మిరపకాయ టపాసులు, ఎల్లిపాయ బోనాలు, పెన్సిల్ బోనాల్, చిట్పట్లు, గన్నులు, రీల్ బోనాలు, లక్ష్మీ బోనాలు, అగ్గిపెట్టె బోనాలు, పాము బోనాలు, చిచ్చుబుడ్లతోపాటు 12 షాట్స్, 60 షాట్స్, 120 షాట్స్, హండ్రెడ్ వాలా, టుహండ్రెడ్ వాలా, టూథౌసెండ్ వాలా.., ఫైథౌసెండ్ వాలాలు ఉన్నాయి. రూ.5 నుంచి రూ.5 వేల వరకు ధరల అందుబాటులో ఉన్నాయి. ఈ ఏడాది నూతనంగా బుల్లెట్ గన్, కలర్షాక్లు కూడా వచ్చాయి. వివిధ డిజైన్లలో లాంతర్లు, ఏనుగు బొమ్మలతో ఆకట్టుకునేలా దీపాలు ఉన్నాయి. అమావాస్యనాడు వెలిగించే దీపాలతో వచ్చే అగ్నితో తేజస్సు, ఆహారాన్ని పొందుతారు. దీంతో దీపాల్లోని నీలం, పసుపు, తెలుపు రంగులు మానవ మనుగడకు సమస్త గుణముల సమ్మేళనంగా చెబుతుంటారు. కొత్తగా వెండి, బంగారం ఆభరణాలు కొనుగోలు చేసి లక్ష్మీ పూజలో పెడితే ఐష్టెశ్వర్యాలు సిద్ధిస్తాయని, ధనలక్ష్మి, కుబేరులను భక్తి శ్రద్ధలతో పూజిస్తారు. ఇలా ధనత్రయోదశి రోజు ఏ వస్తువు కొన్నా అది అమృతభాండం అవుతుందని నమ్ముతారు.
గతేడాది కన్నా ఈసారి 30 శాతం ధరలు అదనంగా పెరిగాయి. దీంతో అమ్మకాలు తక్కువగా జరిగే అవకాశం ఉన్నదని, లాభాలు కూడా అంతంతే వస్తున్నాయని వ్యాపారులు వాపోతున్నారు. ధరలు పెరుగుతున్నా పండుగ రోజు క్రాకర్స్‌ను కాల్చాక తప్పదు. ధర ఎంతున్నా కొనుగోళ్లు చేయాల్సింది.
దీపావళి పండుగ రోజు ఇండ్లల్లో దీపాలు వెలిగించుకుంటారు. మట్టితో తయారు చేసిన ప్రమిదలు మార్కెట్లోకి వివిధ రకాల్లో వచ్చాయి. సైజుల మేరకు ధర నిర్ణయించి విక్రయిస్తున్నారు. ఈ మట్టి ప్రమిదలను వెలిగించి అనంతరం నదుల్లో వదులుతుంటారు. ఈ సీజన్లో వచ్చే బంతి, చామంతి పూలు కూడా రాసులుగా పోసి అమ్ముతున్నారు. నోములకు ప్రత్యేకమైన మట్టికుండలతోపాటు రంగురంగులతో కూడిన కుండలు కూడా మార్కెట్ అందుబాటులో ఉన్నాయి. అలాగే మిఠాయి దుకాణాలు, వస్త్ర దుకాణాలు కొనుగోలుదారులతో కిక్కిరిసి దర్శనమిస్తున్నాయి. మార్కెట్లనీ సందడిగా మారా యి. ఆదివారం మరింత రద్దీ కనిపించే అవకాశం ఉన్నది.