మహబూబ్ నగర్ : నగర పాలిక వార్డుల విభజన ( Division ) శాస్త్రీయంగా చేపట్టాలని మున్సిపల్ మాజీ చైర్మన్ నర్సింహులు( Former Chairman Narsimulu) డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కాంగ్రెస్ ( Congress ) పార్టీ ఇచ్చిన హామీలు అమలు చేయకపోవడంతో ప్రజల నుంచి వ్యతిరేకత ఉండడంతో స్థానిక సంస్థల ఎన్నికల ఓటమి పాలవుతామన్న భయంతో కొత్త వార్డులు ఏర్పాటు చేశారని ఆరోపించారు.
వార్డుల విభజన చేస్తే భవిష్యత్ లో అభివృద్ధి కి ఆటంకం కలుగుతుందని అన్నారు. పెద్ద గ్రామ పంచాయతీలు, వార్డుల పేర్లు కనుమరుగయ్యే విధంగా విభజన చేసారని మండిపడ్డారు. స్థానిక ప్రజల మనోభావాలు దెబ్బతినే విధంగా కొత్త వార్డుల ఏర్పాటు ఉందని తెలిపారు. అధికారులు సరి చేయకుంటే ప్రజాక్షేత్రంలోకి వెళ్లి ప్రజలకు వాస్తవాలు వివరించి పోరాటం చేస్తామని హెచ్చరించారు.
పట్టణ అధ్యక్షులు శివరాజ్ మాట్లాడుతూ గతంలో వార్డుల విభజన ప్రజలందరి ఏకాభిప్రాయంతో ఆమోదం తెలిపినట్టు చెప్పారు. గతంలో మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్ని పక్షాల సలహాలు తీసుకున్న తరువాతే ముందుకు వెళ్లాలని అధికారులకు ఆదేశాలు జారీ చేసిన విషయాన్ని గుర్తు చేశారు. ఒకదగ్గర కూర్చొని వార్డుల విభజన చేయడం సరికాదని, అన్ని పార్టీలతో సమావేశం నిర్వహించాలని, సీనియర్ వార్డు మెంబెర్లతో సమావేశం నిర్వహించిర అభిప్రాయాలు తీసుకోవాలని కోరారు.
ఇష్టారీతిన అధికారపార్టీ తీరు ఉంటే ఎన్నికల్లో తగిన గుణపాఠం ప్రజలు చెప్తారని పేర్కొన్నారు. సమావేశంలో ముడా మాజీ చైర్మన్ గంజి వెంకన్న, మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ గణేష్, మాజీ కౌన్సిలర్లు అనంతరెడ్డి, రామ్ లక్ష్మణ్, సీనియర్ నాయకులు శ్రీనివాస్ రెడ్డి, సుధాకర్, శరత్ చంద్రారెడ్డి, తదితరులు పాల్గొన్నారు.