వనపర్తి, జూలై 19 : ప్రభుత్వం వైద్య రంగానికి పెద్దపీట వేసింది. ఇందులో భాగంగా దవాఖానల్లో కార్పొరేట్ తరహా వైద్య సేవలు అందిస్తున్నది. అన్ని రకాల వైద్య సేవలను అందుబాటులో ఉంచడంతోపాటు ప్రసవాల సంఖ్యను పెంచేందుకు చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా మాతా, శిశు మరణాలను తగ్గించడంపై దృష్టి సారించింది. గర్భం దాల్చిన నాటి నుంచి మహిళలకు సరైన పౌష్టికాహారం అందక పుట్టిన బిడ్డలు అనారోగ్యం బారిన పడడం, కొందరు గర్భంలోనే చనిపోతుంటారు. ఇలాంటి ఘటనలు జరగకుండా పోషకాహారం ఉన్న న్యూట్రిషన్ కిట్లను పంపిణీ చేస్తున్నది. ఒక్కో గర్భిణి కాన్పు వరకు రెండు సార్లు అందజేయనున్నారు. ఇందుకు సంబంధించిన వివరాలను ఎప్పటికప్పుడు ఆన్లైన్లో పొందుపర్చనున్నారు. మహబూబ్‌నగర్ జిల్లాలో 1302 మందికి, నాగర్‌కర్నూల్‌లో 10288, జోగుళాంబ గద్వాలలో 12,591, వనపర్తిలో 1,200, నారాయణపేటలో 713.. మొత్తం 26,094 మందికి కిట్లను వైద్య, ఆరోగ్య శాఖాధికారులు పంపిణీ చేశారు. పుట్టబోయే బిడ్డ ఆరోగ్యంగా ఉండాలని పథకాన్ని అమలు చేస్తున్న సీఎం కేసీఆర్‌కు కృతజ్ఞతలు వెల్లువెత్తుతున్నాయి.
గర్భం దాల్చిన సమయంలో మహిళలకు సరైన పౌష్టికాహారం అందక పుట్టిన బిడ్డలు అనారోగ్యం బారిన పడడం, కొందరు కడుపులోనే చనిపోవడం వంటి సంఘటనలు జరుగుతుంటాయి. ఇవి పునరావృతం కావొద్దనే ఉద్దేశంతో ప్రభుత్వం సరికొత్త ఆలోచనతో గర్భిణులకు న్యూట్రిషన్ కిట్ల పంపిణీ కార్యక్రమం డిసెంబర్ 21, 2022న రాష్ట్ర వ్యాప్తంగా 9 జిల్లాలో ప్రారంభమైంది. కాగా ఉమ్మడి పాలమూరు జిల్లాలోని జోగుళాంబ గద్వాల, నాగర్‌కర్నూల్ జిల్లాల్లో పైలట్ ప్రాజెక్టు కింద ప్రారంభమైంది. ఈ కార్యక్రమం విజయవంతం కావడంతో రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేయాలన్న ఉద్దేశంతో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా దశాబ్ది వేడుకల్లో భాగంగా జూన్ 10న వైద్య, ఆరోగ్య దినోత్సవాన్ని పురస్కరించుకొని అన్ని జిల్లాల్లో శ్రీకారం చుట్టింది. వనపర్తి జిల్లాలో కలెక్టర్ తేజస్ నందలాల్‌పవార్, జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ సిబ్బందితో కలిసి వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి ప్రారంభించారు. దీంతో గర్భిణులకు న్యూట్రిషన్ కిట్లను అందజేసి వీటితో కలిగే లాభాలు, వాడే విధానాన్ని వివరించారు. మహిళ గర్భం దాల్చిన సమయం మొదలుకొని ప్రసవం జరిగే వరకు ఆయా గ్రామాల్లో, పట్టణాల్లో ఆశ కార్యకర్తలు వారి వద్దకు వెళ్తూ.. ప్రతి నెలా ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీస్తున్నారు. క్రమం తప్పకుండా 102 వాహనంలో గర్భిణులకు అందుబాటులో, దగ్గరలోని ప్రభుత్వ దవాఖానకు తీసుకెళ్లి రక్త పరీక్షలను చేయిస్తున్నారు. అయితే పౌష్టికాహారలోపం ఉన్నట్లు ప్రధానంగా తేలుతున్నదని, దీనిని అధిగమించేందుకు ప్రభుత్వం న్యూట్రిషన్ కిట్ల పంపిణీని మొదలుపెట్టింది.
పీహెచ్‌సీల్లో రక్త పరీక్షలు
గర్భం దాల్చిన మహిళలు ఆరోగ్యంగా ఉండేందుకు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో రక్తహీనత పరీక్షలు నిర్వహిస్తారు. గర్భం దా ల్చిన మహిళలను ఏఎన్ఎంలు, ఆశ వర్కర్లు, అంగన్వాడీ కార్యకర్తలు వారి పరిధిలో గుర్తిస్తారు. వారిని మూడు నెలల నుంచి ప్రసవమయ్యే వరకు ప్రత్యేకంగా పర్యవేక్షించనున్నారు. ప్రతి నె లా పీహెచ్‌సీల్లో రక్త పరీక్షలను నిర్వహించి ఏమైనా సమస్యలు ఉంటే టీహబ్‌కు టెస్ట్ కోసం పంపిస్తున్నారు. ఆరోగ్య పరీక్షలు చే యడం, ఎత్తుకు తగిన బరువు ఉన్నారా..? లేదా అన్న విషయాలను ఎప్పటికప్పుడు ఆన్లైన్లో నమోదు చేసి గర్భిణుల హెల్త్ ప్రొఫైల్ తయారు చేస్తున్నారు. రక్తహీనత ఉన్న వారిపై ప్రత్యేక దృష్టికి కేంద్రీకరిస్తున్నారు. ఎనిమియాతో బాధపడే గర్భిణులకు పౌష్టికాహారం అందించి వారిని ఆరోగ్య వంతులుగా చేయడం.. కడుపులోని బిడ్డ మరింత ఆరోగ్యంగా పుట్టడం కోసం ప్రొటీన్లు, విటమిన్లు కలిగిన పోషకాహారం కేసీఆర్ న్యూట్రిషన్ కిట్‌లో ఉంటున్నాయి. ఆయా పీహెచ్‌సీలు, జనరల్ దవాఖానల్లో గర్భిణీ వివరాలను తీసుకుని అందుకు సంబంధించిన ఫొటోను ఎప్పటికప్పుడు ఆన్లైన్లో పొందుపర్చుతున్నారు.
న్యూట్రిషన్ కిట్లకు శ్రీకారం
మాతా శిశు మరణాలను తగ్గించడం ఒకవైపు.. మరో వైపు ప్ర దవాఖానలో ప్రసవాల సంఖ్యను పెంచేందుకు ప్రభుత్వం చర్య లు చేపట్టింది. ఒక్కో కిట్‌కు రూ.1,962ను ప్రభుత్వం ఖర్చు చే స్తుంది. గర్భిణులు 13 నుంచి 24 వారాల మధ్య న్యూట్రిషన్ కిట్, తర్వాత నెల రోజులకు 28 నుంచి 34 వారాల మధ్య రెండో కిట్‌ను అందుకుంటున్నారు.
వనపర్తి జిల్లాలో 1,200 కిట్లు పంపిణీ
వనపర్తి జిల్లాలో కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్‌తో కలిసి వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి న్యూట్రిషన్ కిట్ల పంపిణీని ప్రారంభించారు. తొలి రోజే 40 మందికి పంపిణీ చేశారు. ఇప్పటి వరకు జిల్లా వ్యాప్తంగా 1200 కిట్లను అందజేసినట్లు వైద్య, ఆరోగ్య శాఖ ప్రోగ్రాం అధికారి ఇస్మాయిల్ తెలిపారు.
పౌష్టికాహారం వస్తువులు
గర్భిణులకు అందించే న్యూట్రిషన్ కిట్లలో పౌష్టికాహారం వస్తువులు అందిస్తున్నారు. న్యూట్రిషన్ మిక్స్ పౌడర్ (మదర్ హార్లిక్స్, కేజీ), ఖర్జూర కేజీ, ఐరన్ సిరప్ బాటిల్స్ 3, నెయ్యి అర్ధకిలో, పల్లీపట్టి 200 గ్రాములు, ఆల్బెండజోల్ టాబెట్లు, తాగడానికి అవసరమైన ప్లాస్టిక్ కప్పును అందిస్తున్నారు.
రెండోసారి తీసుకున్నా..
మొదటి సారి న్యూట్రిషన్ కిట్‌ను మంత్రి నిరంజన్‌రెడ్డి చేతుల మీదుగా తీసుకున్నా. తర్వాత వీటిని వాడడం మొదలుపెట్టాను. చాలా బాగుంది. ఇందులో పౌష్టికాహారానికి సంబంధించిన వస్తువులు ఉన్నాయి. వీటిని తీసుకోవడంతో ఆరోగ్యంగా ఉంటున్నా. రెండో సారి తీసుకుంటున్నాను. పుట్టబోయే బిడ్డకు ఆరోగ్యంగా ఉంటాడని వైద్యులు చెప్పారు. అందుకే క్రమం తప్పకుండా పౌష్టికాహారాన్ని వాడుతున్నాను.
– సంధ్యారాణి, గర్భిణి, వనపర్తి