మహబూబ్‌నగర్ మున్సిపాలిటీ, ఆగస్టు 30 : మహబూబ్‌నగర్ పట్టణంలోని ఆదర్శనగర్‌లో అక్ర మ నిర్మాణాలంటూ రెవెన్యూ అధికారులు కూల్చిన దివ్యాంగుల ఇండ్ల సమస్యల పరిష్కారంలో కదలిక మొదలైంది. మాజీ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ దివ్యాంగులకు జరిగిన నష్టంపై ప్రభుత్వం, అధికార యం త్రాంగాన్ని నిలదీశారు. సమస్యలు పరిష్కారం అ య్యేవరకు వెన్నంటి ఉంటానంటూ వారికి భరోసా కల్పించారు. పలు సంఘాలు సైతం దివ్యాంగులకు మద్దతుగా నిలిచేందుకు ముందుకొచ్చాయి.
దివ్యాంగుల సమస్యలపై శుక్రవారం కలెక్టర్ విజయేందిర బోయిని మాజీ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ కలిసి సమస్యలను విన్నవించారు. నిరుపేదలైన దివ్యాంగులు కట్టుకున్న ఇండ్లను అక్రమ నిర్మాణాల పేరిట అధికారులు కూల్చివేశారని, ఈ విషయంలో ప్రత్యేక చొరవ చూపాలని కోరారు. నకిలీ పట్టాలంటూ ఎంతో వ్యయప్రయాసాలకోర్చి కట్టుకున్న ఇండ్లను నేలమట్టం చేయడం అమానవీయమైన అంశంగా పరిగణించాలన్నారు. కనీస సమాచారం లేకుండా, నోటీసులు ఇవ్వకుండా అర్ధరాత్రిళ్లు పోలీసు బలగాల పహార మధ్య దుర్మార్గంగా అధికారులు వ్యవహరించాలని దివ్యాంగులు సైతం కలెక్టర్‌తో బాధను వెల్లిబుచ్చుకుంటూ కన్నీరు పెట్టుకున్నారు.
దివ్యాంగుల ఇండ్ల కూల్చివేతలో అధికారులు ఏకపక్షంగా వ్యవహరించడం ఎంతమాత్రం భావ్యం కాదని మాజీ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ అన్నారు. అధికారులు ఎలాంటి నోటీసులు లేకుండా ఇండ్లను కూలగొట్టారు. పైసలున్న వారికి నోటీసులు ఇచ్చి సమయం ఇస్తున్న అధికారులు పేదల విషయంలో అలా ఎందుకు వ్యవహరించలేదని మీడియా సమావేశంలో ప్రశ్నించారు.
పట్టాలు నిజమైనవి కాకపోతే విచారణ చేసి బాధ్యులపై చర్యలు తీసుకోవాలే తప్పా అర్ధరాత్రి వచ్చి బలవంతంగా బయటకు గెంటేసి కూల్చేస్తే వారు ఎక్కడికెళ్తారని నిలదీశారు. రూపాయి, రూపాయి కూడబెట్టుకొని ఇండ్లు కట్టుకుంటే వారి ఇండ్లను కూలగొట్టడం సరికాదన్నారు. మానవీయ కోణంలో ఆలోచన చేసి కూలగొట్టిన ప్రాంతంలోనే ఇండ్లు నిర్మాణం చేయడంతోపాటు తాత్కాలిక వసతి సౌకర్యం కల్పించాలన్నారు. ఈ ఘటనపై విచారణ చేసి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
ఇండ్లు కూల్చిన స్థలంలోనే పునర్నిర్మించి ఇవ్వాలని పాలమూరు అధ్యయన వేదిక, టీఎఫ్‌టీయూ నాయకులు డిమాండ్ చేశారు. శుక్రవారం దివ్యాంగుల రిలే నిరాహార దీక్ష శిబిరాన్ని సందర్శించి వారికి మద్దతు తెలిపారు. రాజకీయ చదరంగంలో పేదలను బలి చేస్తున్నారని, దీనిపై సమగ్ర విచారణ జరపాలన్నారు. బాధ్యులైన అధికారులు, దళారులపై చర్యలు తీసుకోవాలన్నారు. కార్యక్రమంలో పాలమూరు అధ్యయ వేదిక ఉమ్మడి జిల్లా కన్వీనర్ ఎం.రాఘవాచారి, వామన్‌కుమార్, టీఎఫ్‌టీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఖలీల్, జిల్లా అధ్యక్ష కార్యదర్శులు విజయ్‌కుమార్, యాదగిరి, టీఎస్టీయూ నాయకులు గట్టన్న, జలాల్పాషా, బాలకృష్ణ, ఖర్షీద్ తదితరులు సంఘీభావం తెలిపారు. దివ్యాంగుల పోరాటానికి పూర్తి మద్దతు ఇస్తున్నట్లు తెలిపారు.
మాజీ మంత్రి వి.శ్రీనివాస్‌గౌడ్ తమకు అండగా ఉంటూ నిరాశ్రయులకు ఆశ్రయం కల్పించేందుకు పోరాటం చేస్తున్నారని దివ్యాంగుల సంక్షేమ సం ఘం నాయకులు అన్నారు. శుక్రవారం కలెక్టరేట్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మీ డియాతో మాట్లాడారు. కొందరు శ్రీనివాస్‌గౌడ్‌ను బద్నాం చేసేందుకు ప్రయత్నిస్తున్నారని, అలాంటి వారిపై తాము కేసులు పెట్టడంతోపాటు మానవ హక్కుల సంఘానికి ఫిర్యాదు చేస్తామని హెచ్చరించారు. అభాగ్యులకు అండగా ఉండటం తప్పా అని ప్రశ్నించారు. దివ్యాంగులకు మద్దతు తెలుపుతున్న వారి జోలికి వస్తే న్యాయపోరాటం ద్వారా వారికి తగిన బుద్ధి చెబుతామని బ్లైండ్లేమ్ వెల్ఫేర్ అసోసియేషన్ నాయకులు పేర్కొన్నారు.
పునరావాస కేంద్రం ఏర్పాటు : మాజీ మంత్రి శ్రీనివాస్‌గౌడ్, దివ్యాంగుల ఆందోళనతో ప్రజా పా లన ప్రభుత్వం దిగొచ్చింది. దివ్యాంగులకు మహబూబ్‌నగర్‌లోని అల్మాస్ ఫంక్షన్హాల్లో పునరావాస కేంద్రం ఏర్పాటు చేస్తున్నట్లు స్థానిక ఎమ్మెల్యే శ్రీనివాస్‌రెడ్డి తెలిపారు.