గద్వాల అర్బన్/ఎర్రవల్లి చౌరస్తా, అక్టోబర్ 9 : రాష్ట్రంలో పోలీస్ మానిటరింగ్ చాలా బాగుందని జోగుళాంబ జోన్ డీఐజీ ఎల్ఎస్ చౌహాన్ పేర్కొన్నారు. వార్షిక తనిఖీల్లో భాగంగా బుధవారం ఎస్పీ శ్రీనివాసరావుతో కలిసి బుధవారం జిల్లా కేంద్రంలోని పోలీస్, డీఎస్పీ కార్యాలయాన్ని తనిఖీ చేశా రు. డీఎస్పీ కార్యాలయంలో రికార్డులు, కేసుల వివరాలపై ఆరా తీశారు. అలాగే అలంపూర్ సీఐ కార్యాలయం, ఇటిక్యాల పీఎస్‌ను పరిశీలించారు. ఇటిక్యాల పీఎస్‌లో రికార్డులను చూశారు. అనంతరం జిల్లా పోలీస్ కార్యాలయం, ఇటిక్యాల పీఎస్ ఆవరణలో ఎస్పీ శ్రీనివాసరావు, డీఎస్పీ సత్యనారాయణతో కలిసి మొక్క నాటి నీళ్లను పోశారు.
సర్కిళ్ల పరిధిలో కేసులు, లా అండ్ ఆర్డర్ అమలు, ఏడాదిలో ఏ కేసులు అధికంగా నమోదయ్యాయి, 5 ఎస్ అమలు తీరు, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ వంటి కేసుల వివరాలను సీఐ సూర్యానాయక్తో అడిగి తెలుసుకున్నారు. డిమాండ్ డైరీ చార్జిషీట్, ఇంటరాగేషన్, రిపోర్ట్‌ల ఆన్లైన్ ఎంట్రీ గురించి ఆరా తీశారు. డయల్ 100కు కాల్ రాగానే వెంటనే స్పందించి ఘటనా స్థలికి చేరుకోవాలన్నారు. 24 గంటలూ గస్తీ నిర్వహించేలా ఎస్సైల ద్వారా చర్యలు చేపట్టాలని అలంపూర్ సీఐ రవిబాబుకు సూచించారు. ఈ సందర్భంగా డీఐజీ మాట్లాడుతూ శాంతి భద్రతల పరిరక్షణకు పోలీసులు, సిబ్బంది కృషి చేయాలని సూచించారు.
పెండింగ్‌లో ఉన్న కేసులను త్వరగా పరిష్కరించాలన్నారు. పోలీసులకు మొబైల్ఫోన్లు అందించడం ద్వారా సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకొని కేసులు త్వరగా ఛేదించేందుకు ఉపయోగపడుతుందన్నారు. జిల్లాల్లో షీటీం సేవలు అద్భుతంగా ఉన్నాయన్నారు. జిల్లా మీదుగా మట్టి, ఇసుక, బియ్యం వంటి అక్రమ రవాణాలపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసి.. నిబంధనలు పాటించని వారిపై చర్యలు తీసుకోవాలని సూచించారు. లా అండ్ ఆర్డర్‌ను కాపాడుతున్న ఎస్పీ శ్రీనివాసరావు, డీఎస్పీ సత్యనారాయణను అభినందించారు. కార్యక్రమంలో ఏవో సతీశ్‌కుమార్, సాయుధ దళ డీఎస్పీ నరేందర్‌రావు, సీఐలు నాగేశ్వర్‌రెడ్డి, టాటాబాబు, రవిబాబు, ఎస్సై వెంకటేశ్, ఇటిక్యాల పీఎస్ సిబ్బంది పాల్గొన్నారు.