
శ్రీశైలం, డిసెంబర్ 21: శ్రీశైల మహాక్షేత్రానికి వస్తున్న యాత్రికుల ఇబ్బందులను నేరుగా తెలుసుకునేందుకు డయల్ యువర్ ఈవో కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నట్లు ఈవో లవన్న ప్రకటించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర దేవాదాయశాఖ కమిషనర్ ఆదేశాల మేరకు ప్రతి బుధవారం ఉదయం 11గంటల నుంచి 12 గంటల వరకు భక్తులు నేరుగా దేవస్థాన కార్యనిర్వాహణాధికారితో మట్లాడేందుకు వీలు కల్పిస్తున్నట్లు చెప్పారు. ఉభయ తెలుగు రాష్ర్టాల యాత్రికులే కాకుండా దేశం నలుమూలల నుంచి జ్యోతిర్లింగ శక్తిపీఠాన్ని దర్శించుకునేందుకు వస్తున్న వారికి అవసరమైన వసతి ఏర్పాట్లు, అర్జితసేవా టిక్కెట్ల కేటాయింపు, దర్శన విధానాలు, అన్నప్రసాద వితరణ, ప్రసాదాలు, పబ్లికేషన్స్ విభాగాల సేవల వల్ల భక్తులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను స్వయంగా తెలుసుకుని సత్వర పరిష్కారం చేసేందుకు చర్యలు తీసుకోనున్నట్లు చెప్పారు. ప్రతి బుధవారం యాత్రికులు 08524-28711 నెంబరుకు ఫోన్ చేసి సలహాలు, సూచనలు అందించాలని ఈవో లవన్న కోరారు.
మల్లన్న సన్నిధిలో సుప్రీం కోర్టు జడ్జి
శ్రీశైల భ్రమరాంబ, మల్లికార్జున స్వామి, అమ్మవారిని సుప్రీం కోర్ట్టు జడ్జి జస్టిస్ వి.సుబ్రహ్మణ్యన్ సతీమణి సరస్వతితో కలిసి మంగళవారం దర్శించుకున్నారు. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ జ్యుడీషియల్ ప్రివ్యూ జడ్జి జస్టిస్ డాక్టర్ శివశంకర్రావు కూడా స్వామి, అమ్మవారిని దర్శించుకున్నారు. మంగళవారం క్షేత్రానికి చేరుకున్న వీరికి ఈవో లవన్న ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. స్వామివారి గర్భాలయంలో బిల్వాభిషేకాలు, వృద్ధమల్లికార్జున స్వామికి ప్రత్యేక పూజలు, అమ్మవారికి శ్రీచక్ర కుంకుమార్చన పూజలు చేసుకున్నారు. ఆలయ సంప్రదాయం ప్రకారం అర్చక వేదపండితులు వేదాశీర్వచనాలు చేసి తీర్థప్రసాదాలు ఇచ్చారు.
రూ.7.30కోట్లకు తలనీలాల వేలం
శ్రీశైల భ్రమరాంబ, మల్లికార్జున స్వామి, అమ్మవారికి మెక్కులుగా చెల్లించే తలనీలాల వేలంపాటలో ఓ భక్తుడు రూ.7కోట్ల30లక్షల 8వేలకు సొంతం చేసుకున్నారు. మంగళవారం పరిపాలనా భవనంలో ఈవో లవన్న ఆధ్వర్యంలో కల్యాణకట్ట తలనీలాల బహిరంగ వేలంపాట నిర్వహించారు. ఈ వేలంపాటలో వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన 12మంది డిపాజిట్లను జమచేసి పాల్గొనగా 9 మంది మాత్రమే ఆసక్తిగా ముందుకుసాగారు. అదేవిధంగా ఈ ప్రొక్యూర్మెంట్ టెండర్లో నలుగురు మాత్రమే కోడ్ చేశారు. దేవస్థాన ప్రధాన విభాగాల అధికారులు, సిబ్బంది సమక్షంలో తొలుతగా బహిరంగ వేలం జరుగగా ప్రకాశం జిల్లా చీమకుర్తికి చెందిన యాదగిరి రూ.7,30,8,000లకు ఖరారు చేసుకున్నారు. అనంతరం ఈ ప్రొక్యూర్మెంట్ టెండర్లను పరిశీలించగా రూ.30లక్షలు తక్కువగా కోడ్ చేయడంతో అధిక మొత్తం పాడుకున్న వారికే సంవత్సర కాలానికి తలనీలాల సేకరణకు అవకాశం ఇచ్చారు. గతేడాదికంటే రెట్టింపు ధరపలకడంతో పాటదారులను ఈవో అభినందించారు.