వనపర్తి, జూన్ 14 : మూడు నెలలుగా వేతనాలు లేక దవాఖాన పారిశుధ్య కార్మికులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని తెలంగాణ మెడికల్ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ కార్యదర్శి సురేశ్ ఆవేదన వ్యక్తం చేశారు. శుక్రవారం జిల్లాలోని జీజీ హెచ్, ఎంసీహెచ్ విభాగాల్లో పనిచేస్తున్న కార్మికుల పెండింగ్ వేతనాలు చెల్లించాలని కోరుతూ ప్రభుత్వ జనరల్ దవాఖాన ఎదుట ఏఐటీయూసీ నాయకులు, కార్మికులతో కలిసి ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా కార్మిక సంఘాల నాయకులు మాట్లాడుతూ ప్రభుత్వ దవాఖానల్లో పనిచేస్తున్న పారిశుధ్య కార్మికులకు ప్రభుత్వం ప్రతి నెలా బడ్జెట్ను విడుదల చేస్తున్నా క్షేత్రస్థాయిలో అందించడంలేదని వాపోయారు. అంబియన్స్ ఏజెన్సీ అవినీతి అక్రమాలపై కొన్ని నెలలుగా విచారణ జరుగుతున్నదన్నారు. కార్మికులు పూర్తిస్థాయిలో వివరాలను అందజేస్తున్నా విచారణ పేరుతో మూడు నెలలుగా వేతనాలను పెండింగ్ ఉంచారన్నారు. ఈ సమస్యలను యూనియన్ నాయకులు, కార్మికులు అదనపు కలెక్టర్, ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు చిన్నారెడ్డి, ఎమ్మెల్యే మేఘారెడ్డి దృష్టికి తీసుకెళ్లినా ఏజెన్సీ నిర్వాహకులుల వేతనాలు చెల్లించకుండా మరిన్ని ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కార్మికుల వద్దకు దవాఖాన సూపరింటెండెంట్ రంగారావు, డీసీహెచ్ఎస్ చైతన్యగౌడ్, ఆర్ఎంవో ప్రభాకర్ వెళ్లి వేతనాలు త్వరలోనే అందేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వడంతో ఆందోళనను విరమించారు. కార్యక్రమంలో ఏఐటీయూసీ జిల్లా సహాయ కార్యదర్శి గోపాలకృష్ణ, ఎస్సీ, ఎస్టీ విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ సభ్యులు నాగరాజు, అఖిలపక్ష ఐక్యవేదిక అధ్యక్షుడు సతీశ్యాదవ్, యూనియన్ నాయకులు నర్సింహ, శ్రీను, దర్గాస్వామి, కుమార్, నరేందర్, మహేశ్, కృష్ణ, ఆనంద్, ఉదయ్, శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.