ఊట్కూర్ : కాంగ్రెస్ ప్రభుత్వం (Congress Government) ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన హామీ మేరకు వ్యవసాయ కూలీలందరికీ ఇందిరమ్మ ఆత్మీయ భరోసాను( Indiramma Aatmiya Barosa) అమలు చేయాలని అఖిలభారత ప్రగతిశీల వ్యవసాయ కార్మిక సంఘం(AIPKMS) జిల్లా అధ్యక్షులు సలీమ్, మండల కార్యదర్శి కే మల్లేష్, జిల్లా నాయకులు కనక రాయుడు డిమాండ్ చేశారు. సోమవారం ఊట్కూర్ మండల తహసీల్ కార్యాలయం ఎదుట నిర్వహించిన ధర్నాలో ఆయన మాట్లాడారు.
ఇందిరమ్మ ఆత్మీయ భరోసా కింద సంవత్సరానికి రూ. 12,000 వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. గ్రామ సభలు నిర్వహించి వ్యవసాయ కూలీలను గుర్తించి వారికి ప్రత్యేకంగా ఐడీ కార్డులు ఇవ్వాలన్నారు. మూడు ఎకరాల లోపు భూమి కలిగిన సన్నా, చిన్న కారు రైతులు ఏడాది పొడుగునా వ్యవసాయ కూలీగానే బతుకుతున్న వారికి ఇందిరమ్మ ఆత్మీయ భరోసా వర్తింపజేయాలని డిమాండ్ చేశారు.
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వ్యవసాయ కూలీలకు సమగ్రమైన చట్టం రూపొందించాలని కోరారు . కార్యక్రమానికి ఏఐపీకేఎంఎస్ జిల్లా కార్యదర్శి చెన్నప్ప ఆధ్వర్యంలో తహసీల్దార్ కార్యాలయ సిబ్బందికి వినతి పత్రం అందజేశారు. కార్యక్రమంలో రైతు సంఘం నాయకులు వెంకట్ రెడ్డి, కే లింగప్ప, టీ ఎల్లప్ప, తిప్పయ్య, అమీన్పూర్ శంకరప్ప , రాజు పాల్గొన్నారు.