ఊట్కూర్, జూలై 17 : యుద్ధంలో వీర మరణం పొందిన మహ్మద్ ప్రవక్త మనుమలు ఇమామ్ హసన్, ఇమామ్ హు స్సేన్ల త్యాగానికి గుర్తింపుగా జరుపుకొనే మొహర్రం (పీర్ల పండుగ ) వేడుకలకు బుధవారం కర్ణాటక, మహారాష్ట్రతోపా టు పలు పట్టణాలు, పరిసర గ్రామాల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. వేలాది మంది భక్తుల రాకతో ఊ ట్కూర్ మండలకేంద్రంలోని హసన్, హుస్సేన్‌ల పీర్ల చావిడి జనసంద్రంగా మారింది. భక్తులు చక్కెర, పుట్నాలు, గోధు మ పిండితో నైవేద్యం తయారు చేసి మొక్కుబడులు చెల్లించుకున్నారు.
కొందరు భక్తులు గొర్రెలు, మేకలతో కందూర్లు నిర్వహించారు. నవమి, దశమి రోజులను ప్రత్యేక సంతాప దినాలుగా భావిస్తూ భక్తులు ఉపవాస దీక్షలను కొనసాగించారు. స్థానిక పెద్దపీర్ల మసీదు నుంచి మెయిన్ బజార్, భరత్‌నగర్, బస్టాండ్, శివాజీనగర్ ఏరియా నుంచి పెద్దచెరువు వరకు నిర్వహించిన ఊరేగింపులో భక్తులు చిన్న, పెద్ద బేధం లేకుండా పాల్గొన్నారు. యువకులు అలాయ్ బలాయ్.. అసైదుల్లా నినాదాలతో హోరెత్తించారు. మహిళలు బొడ్డెమ్మలు వేశారు.
కాగా, పీర్ల సవారీ వేడుకల్లో ప్రధాన ఘట్టమైన ఊ యల (తొట్ల) కార్యక్రమం విశేషంగా ఆకట్టుకున్నది. బుధవారం ఉదయం, సాయంత్రం వేళ నిర్వహించిన ఊయలను తిలకించేందుకు భక్తులు పిల్లాపాపలతో తరలివచ్చారు. ఈ సందర్భంగా స్థానిక రుద్రనగర్లో ఆరెకటిక వంశంలో పుట్టిన పసి బిడ్డలను ఊయలలో వేసి సవారీ చేత నామకరణం చే యించారు. రాత్రికి స్థానిక పెద్ద చెరువు అలుగు కట్టపై పీర్ల అలాయ్ బలాయ్ ఆటలతో వేడుకలకు ముగింపు పలికారు. పేట డీఎస్పీ లింగయ్య, మక్తల్ సీఐ చంద్రశేఖర్, ఎస్సై నవీద్ పర్యవేక్షణలో బందోబస్తు కల్పించారు.