భూత్పూర్ : సమాజంలో విద్యతోనే అభివృద్ధి సాధ్యమవుతుందని రాష్ట్ర యాదవ సంఘం అధ్యక్షుడు చలికాని వెంకట్ యాదవ్ (Venkat Yadav) అన్నారు. శనివారం స్థానిక కేఎంఆర్ ఫంక్షన్ హాల్ లో యాదవ విద్యావంతుల వేదిక కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దశాబ్ధాల కాలంగా దేశంలో కుల గణన సర్వే జరుపలేదని అన్నారు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇటీవల కులగణన చేపట్టి రానున్న స్థానిక సంస్థల ఎన్నికలలో( Local Body Elections) బీసీలకు 42 శాతం రిజర్వేషన్ ( Reservation ) కల్పిస్తామని హామీ ఇచ్చారని గుర్తు చేశారు. రాజకీయ నాయకులు, పార్టీల ఎజెండాలను పక్కనపెట్టి బీసీ ( BC) లకు రిజర్వేషన్ కల్పిస్తామన్న అంశాన్ని దృష్టిలో పెట్టుకొని యాదవులు ముందుకు సాగాలని సూచించారు.
ముఖ్యంగా యాదవులలో విద్యావంతులు చాలా తక్కువ శాతం ఉన్నారని , ఏ కులమైన విద్యతోనే సాధ్యమని పేర్కొన్నారు. సమాజంలో అల్ప సంఖ్యాకులు రాజకీయాలను శాసిస్తున్నారంటే అందుకు ప్రధాన కారణం చదువు, ఆర్థికంగా ఎదగడం, సామాజిక అంశాల పట్ల అవగాహన కలిగి ఉండడమేనని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం 42 శాతం బిసి రిజర్వేషన్ అమలు చేస్తే బీసీలు ఎక్కువ శాతం స్థానిక సంస్థల ఎన్నికలలో గెలిచే అవకాశం ఉంటుందని తెలిపారు.
ఈ కార్యక్రమంలో మహబూబ్ నగర్ ముడా చైర్మన్ లక్ష్మణ్ యాదవ్, జిల్లా గొర్రెల కాపరుల సంఘం అధ్యక్షుడు లక్ష్మీనరసింహ యాదవ్, యాదవ సంఘం మండల అధ్యక్షుడు మల్లేష్ యాదవ్, విద్యావంతుల వేదిక సభ్యులు జుర్రు నారాయణ, బాలస్వామి, రవి కుమార్ యాదవ్, మండల నాయకులు ఉషన్న, శాంతన్న, భీమన్న యాదవ్ తదితరులు పాల్గొన్నారు.