అలంపూర్, ఏప్రిల్ 17 : ప్రజలు రెండుసార్లు అసెంబ్లీ ఎన్నికల్లో అభివృద్ధికే పట్టం కట్టారు. ఎనిమిదేండ్లలో రాష్ట్రంతోపాటు అలంపూర్ నియోజకవర్గం కూడా సంక్షేమంలో పరుగులు పెడుతున్నది. వంతెన నిర్మాణాలు, ఎత్తిపోతల పథకాలు, రోడ్లు, తాగునీటి, సాగునీటి సౌకర్యం వంటి కార్యక్రమాలను చేపట్టారు. దశాబ్దాల నుంచి పెండింగ్లో ఉన్న సమస్యలకు పరిష్కారం చూపారు. జిల్లాలో సుమారు లక్ష ఎకరాలకు సాగునీరందించే తుమ్మిళ్ల ఎత్తిపోతల పథకం, గట్టు ఎత్తిపోతల ఏర్పాటుతో జిల్లావాసులు హర్షం వ్యక్తం చేశారు. గతంలో నిర్వహించిన అసెంబ్లీ ఎన్నికల్లో గద్వాల, అలంపూరు నియోజకవర్గాలకు చెందిన టీఆర్ఎస్ అభ్యర్థులకు మంచి మెజార్టీతో అధికారం కట్టబెట్టారు. జిల్లాలో సాగునీటికి ఇబ్బంది పడుతున్న తరుణంలో ఎత్తిపోతల పథకాలు ప్రవేశపెట్టి ఆయకట్టు రైతులకు సాగునీరందించారు. గ్రామగ్రామాన బీటీరోడ్లు, విద్యుత్ సబ్స్టేషన్లు, సాగుకు 24గంటల ఉచిత విద్యుత్, ఆసరా పింఛన్లు, రైతుబంధు, అంతర్రాష్ట్ర రహదారి పనులు, మిషన్ భగీరథ, మిషన్ కాకతీయతోపాటు ప్రజా సంక్షేమ పథకాలెన్నో సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టారు. అదేవిధంగా పంటలకు గిట్టుబాటు ధర, మద్దతు ధరతో కొనుగోలు కేంద్రాల ఏర్పాటు, ధరలు లేనపుడు ధాన్యం నిల్వ చేసుకోవడానికి గిడ్డంగులను నిర్మించారు. ఒకప్పుడు వలసల జిల్లాగా పేరున్న పాలమూరుకు నేడు ఇతర రాష్ర్టాల నుంచి కూలీలు వలసలు వచ్చేస్థాయికి ఎదిగింది.
రాష్ర్టాన్ని అభివృద్ధి చేసే విషయంలో సీఎం కేసీఆర్పై ప్రజలకు పూర్తి విశ్వాసం, నమ్మకం ఉన్నది. ఒకసారి గెలిచి ఎంతో అభివృద్ధి చేశారు. ముందస్తు ఎన్నికలతో కొన్ని పనులు పెండింగ్లో పడగా వాటిని పూర్తి చేసి మరింత అభివృద్ధికి సహకరిస్తాడని ప్రజలు నమ్ముతున్నారు. ఇప్పటికే ఎమ్మెల్యే అబ్రహం కృషి ఫలితంగా కొత్త మున్సిపాలిటీలకు సంక్షేమానికి రూ.పది కోట్లు కేటాయించారు.
-మనోరమ వెంకటేష్,మున్సిపల్ చైర్ పర్సన్ , అలంపూరు
ఉమ్మడిరాష్ట్రంలో మన ప్రాంతం అభివృద్ధికి నోచుకోలేదు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాతే మనకు గుర్తింపు వచ్చింది. పరిపాలన సౌలభం పెరిగి అధికారులు ప్రజలకు చేరువయ్యారు. నేటి కాలంలో కలెక్టర్లు నిత్యం గ్రామాన్ని, మండలాన్ని సందర్శిస్తూ సమస్యల పరిష్కారినికి కృషి చేస్తున్నారు. అన్ని గ్రామాల్లో అధికార యంత్రాంగం అలర్ట్గా పని చేస్తున్నది.
-చిన్న దేవన్న, మున్సిపల్ చైర్మన్, అయిజ
ముప్పై ఏండ్లుగా ఆయకట్టు భూములకు సాగునీరందక అన్నదాతలు ఇబ్బందులు పడ్డారు. తుమ్మిళ్ల ఎత్తిపోతలతోపాటు కృష్ణానదిపై నిర్మించిన ఎత్తిపోతలతో ఆయకట్టు భూములకు సాగునీరంది బంగారు పంటలు పండిస్తున్నారు. దీంతో రైతుల వార్షిక ఆదాయం పెరిగింది. నా హయాంలోనే చివరి ఆయకట్టు భూములకు కూడా సాగునీరందించాం. ఇదంతా కేసీఆర్ ముందస్తు ఆలోచన వల్లె సాధ్యమైంది. ఉమ్మడి జిల్లాపై కేసీఆర్కు ప్రత్యేక అభిమానం ఉన్నది. అందుకే పెండింగ్లో ఉన్న ప్రాజెక్టులన్నింటిలోనూ కదలికలు తీసుకొచ్చారు.
– వీఎం అబ్రహం, అలంపూరు ఎమ్మెల్యే