
దేవరకద్రరూరల్, డిసెంబర్ 14: టీఆర్ఎస్ హయాంలోనే రాష్ట్రం అభివృద్ధి చెందుతున్నదని, అభివృద్ధిని చూసి పలు పార్టీల నాయకులు టీఆర్ఎస్లో చేరుతున్నారని ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్‌రెడ్డి పేర్కొన్నారు. దేవరకద్ర, చిన్న చింతకుంట మండలాల్లో మంగళవారం ఎమ్మెల్యే పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. దేవరకద్రలో రూ.12.30లక్షల పంచాయతీ నిధులతో కొనుగోలు చేసిన రెండు చెత్త సేకరణ వ్యాన్లను సర్పంచ్ కొండ విజయలక్ష్మితో కలిసి ఎమ్మెల్యే ప్రారంభించారు. అనంతరం చిన్నచింతకుంట మండలం తిర్మలాపూర్‌కు చెందిన పలువురు కాంగ్రెస్ నాయకులు టీఆర్ఎస్లో చేరారు. చేరిన వారికి ఎమ్మెల్యే పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు. ఉద్యానవన, పట్టుపరిశ్రమశాఖ ఆధ్వర్యంలో దేవరకద్ర నియోజకవర్గం నుంచి 36మంది రైతులు భద్రాద్రి కొత్తగూడెం పామాయిల్ తోటల పరిశీలనకు వెళ్తుండటంతో వాహనాలను చింతకుంట వ్యవసాయ కార్యాలయం వద్ద జెడ్పీ చైర్పర్సన్ స్వర్ణసుధాకర్‌రెడ్డి, ఆ శాఖ అధికారి మహేందర్‌తో కలిసి ఎమ్మెల్యే జెండా ఊపి ప్రారంభించారు. ఉంద్యాల ఆర్అండ్బీ రోడ్డు నుంచి ఉంద్యాలతండా వరకు రూ.23లక్షలతో నిర్మించిన సీసీరోడ్డును ప్రారంభించారు. అదేవిధంగా ఉంద్యాలతండాలో తుల్జాభవానీకి పూజ చేశారు. చిన్నరాజమూర్ ఆంజనేయస్వామి బ్రహ్మోత్సవాల సందర్భంగా ఉత్సవాల కరపత్రాలను ఎమ్మెల్యే విడుదల చేశారు.
అనంతరం జెడ్పీ చైర్పర్సన్ స్వగృహంలో ఎమ్మెల్యే ఆల మాట్లాడారు. గత ప్రభుత్వాలతో పోల్చుకుంటే టీఆర్ఎస్ ప్రభుత్వంలోనే తెలంగాణ అన్ని రంగాల్లో అభివృద్ధి చెందిందన్నారు. చిన్నచింతకుంట మండలకేంద్రం నుంచి కురుమూర్తి ఆలయం వరకు వాగులో రూ.30కోట్లతో వంతెన, చెక్‌డ్యాం, రూ.11 కోట్లతో గుట్టకింది నుంచి గర్భగుడి వరకు రోడ్డు నిర్మాణానికి జీవో తీసుకొచ్చినట్లు తెలిపారు. కాగా, రెండేండ్లుగా కరోనా కారణంగా టెండర్లు కాలేదన్నారు. త్వరలో సంబంధిత మంత్రితో కలిసి భూమిపూజ చేసి పనులు ప్రారంభిస్తామన్నారు. పేరూర్ లిఫ్ట్ కోసం రూ.51కోట్లు మంజూరైనట్లు పేర్కొన్నారు. ఈ లిఫ్ట్ కింద పేరూర్, వెంకంపల్లి, దాసరిపల్లి, అమ్మాపూర్తోపాటు ఆరు గ్రామాల్లోని 2500ఎకరాలకు సాగునీరు అందుతుందన్నారు. కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నంతవరకు రాష్ర్టాభివృద్ధికి లోటు ఉండదన్నారు. కార్యక్రమంలో ఎంపీపీలు హర్షవర్ధన్‌రెడ్డి, రమాదేవి, జెడ్పీటీసీలు రాజేశ్వరి, అన్నపూర్ణ, రైతుబంధు సమితి జిల్లా సభ్యులు కరుణాకర్‌రెడ్డి, పార్టీ మండలాధ్యక్షుడు జెట్టి నర్సింహారెడ్డి, కోట రాము, ఆయా గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.