భూత్పూర్, ఫిబ్రవరి 20 : తన తండ్రి ఆల రఘుపతిరెడ్డి స్ఫూర్తితోనే రాజకీయాల్లోకి వచ్చానని దేవరకద్ర ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్‌రెడ్డి తెలిపారు. సోమవారం భూత్పూర్ మండలంలోని కొత్తమొల్గర గ్రామంలో బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలతో ఆత్మీయ సమ్మేళనం (వన భోజనం) కార్యక్రమాన్ని నిర్వహించారు. జెడ్పీ చైర్పర్సన్ స్వర్ణసుధాకర్‌రెడ్డి, గిడ్డంగుల కార్పొరేషన్ చైర్మన్ సాయిచంద్ ముఖ్యఅతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆల మాట్లాడుతూ 2004లో తన తండ్రి మరణించినప్పుడు కాంట్రాక్టర్ వృత్తి రీత్యా ఒరిస్సాలో ఉన్నానన్నారు. చనిపోయిన మరునాడు గ్రామానికి వచ్చి అంత్యక్రియలు చేశానని గుర్తు చేశారు. తన తండ్రి, కుటుంబంపై మండల నాయకులు, కార్యకర్తలు చూపిన ప్రేమాప్యాయతలే తనకు రాజకీయ ప్రే రణ కలిగించాయన్నారు.
2006లో జెడ్పీటీసీ ఎన్నికల్లో పోటీ చేసి.. ఉమ్మడి జిల్లాలోనే భారీ మెజార్టీ సాధించానన్నారు. 2010లో తెలంగాణ ఉద్యమానికి ఆకర్షితుడై కేసీఆర్ పిలుపుమేరకు గులాబీ తీర్థం పుచ్చుకున్నానన్నారు. కేసీఆర్ ఆశీర్వాదంతో 2014లో అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి విజయం సాధించానన్నారు. 2018లో మళ్లీ పోటీ చేస్తే భూత్పూర్ మండలం నుంచి 10,500 ఓట్ల మెజార్టీ వచ్చిందని గుర్తు చేశారు. తన జీవితంలో భూత్పూర్ మండలం ఎప్పటికీ తీపిగుర్తుగా ఉంటుందన్నారు. ఆత్మీయ సమ్మేళనానికి దాదాపు గా 15వేల మం ది రావడం చాలా సంతోషంగా ఉందని, ఇది మరింత బాధ్యతను పెంచిందన్నారు. తన ఇంటికి వచ్చిన వారికి పార్టీలతో ప్రమేయం లేకుండా సహకారం అందిస్తానన్నారు.
బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు తన ఆత్మీయబంధువులని అన్నారు. జెడ్పీ చైర్పర్సన్ స్వర్ణసుధాకర్‌రెడ్డి మాట్లాడుతూ దేవరకద్ర నియోజకవర్గానికి ఆల వెంకటేశ్వర్‌రెడ్డి ఎమ్మెల్యేగా ఉండడం అదృష్టమన్నారు. సాయిచంద్ మాట్లాడుతూ తన తల్లిదండ్రులు వెంకటేశ్వర్‌రెడ్డి అని పేరు పెడితే అభిమానులు ఆలన్న అని ఇంటి పేరునే ఒంటి పేరుగా మార్చి ఆప్యాయంగా పిలుకుంటున్నారన్నారు. అనంతరం కార్యకర్తలకు ఎమ్మెల్యే ఆల, ఆయన సతీమణి మంజుల అరటి ఆకులో భోజనం వడ్డించారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ బస్వరాజ్‌గౌడ్, ఎంపీపీలు శేఖర్‌రెడ్డి, హర్షవర్ధన్‌రెడ్డి, వనపర్తి జెడ్పీ వైస్‌చైర్మన్ వామన్‌గౌడ్, జెడ్పీటీసీ రాజేశ్వరి, రైతుబంధు సమితి మండలాధ్యక్షుడు నర్సింహగౌడ్, సింగిల్‌విండో చైర్మన్ అశోక్‌రెడ్డి, ముడా డైరెక్టర్లు చంద్రశేఖర్‌గౌడ్, సాయిలు, కౌన్సిలర్లు శ్రీనివాస్‌రెడ్డి, బాలకోటి, నాగమ్మ, రామకృష్ణ, వైస్‌ఎంపీపీ నరేశ్‌గౌడ్, సర్పంచులు వెంకటమ్మ, ఆంజనేయులు, శేఖర్, రాజారెడ్డి, వేణుగోపాలాచారి, బీఆర్ఎస్ నాయకులు నారాయణగౌడ్, సత్యనారాయణ, మురళీధర్‌గౌడ్, అశోక్‌గౌడ్, సురేశ్‌గౌడ్, నర్సింహులు, రాములు, ప్రేమ్‌కుమార్, రాము, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.